logo

పాఠంపై పట్టు..సామర్థ్యాల పెంపు

రెండేళ్లుగా విద్యార్థుల చదువులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది. కొన్నాళ్లపాటు తరగతులు నిర్వహించలేని పరిస్థితి. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా పలు కారణాలతో అందరూ హాజరు కాలేకపోయారు. దీంతో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై అవగాహన

Published : 18 Jan 2022 01:34 IST

గూడూరు మండలం ఆర్వీపల్లి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : రెండేళ్లుగా విద్యార్థుల చదువులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపింది. కొన్నాళ్లపాటు తరగతులు నిర్వహించలేని పరిస్థితి. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా పలు కారణాలతో అందరూ హాజరు కాలేకపోయారు. దీంతో విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై అవగాహన లేక ఫలితాలపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు విద్యాశాఖపరంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తరగతుల వారీగా విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టుసాధించడంతోపాటు సామర్థ్యం పెంచేదిశగా రూపకల్పన చేశారు. శాఖాపరంగా నిర్వహించే కార్యక్రమాలు....వాటివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై కథనం.

100 రోజుల పఠనం

విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు ఇప్పటికే చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈనెల ఆరో తేదీనుంచి వంద రోజులపాటు పఠనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోనూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రీప్రైమరీ నుంచి 2వ తరగతి వరకు ఒకటి, మూడు నుంచి ఐదు, ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. పాఠ్యాంశాల వారీగా ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయాల్లో విద్యార్థులను చదివించాలి. ఇలా కేవలం పాఠ్యాంశాలే కాకుండా నీతికథలు, మహనీయుల జీవిత చరిత్రలు, స్వాతంత్య్ర సమరయోధులు, శాస్త్రవేత్తల గురించి విద్యార్థులకు వివరించాలి. మధ్యలో పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యాలను పరిశీలించాలి.

ట్విన్నింగ్‌ పాఠశాలలు

విద్యార్థులకు బోధించే విషయంలో కొందరు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటారు. అవసరమైన టీఎల్‌ఎం తయారీ చేయించడంతోపాటు దృశ్యరూపకంగా కూడా వివరిస్తుంటారు. అలాంటి పాఠశాలలకు సమీపంలోని వేరే పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు వెళ్లి అక్కడ ఉన్న వసతులు పరిశీలించి తాము ఆదిశగా అమలు చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ఈ ట్విన్నింగ్‌ పాఠశాలల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు అమలు చేస్తున్నారు. అలా మండలంలో ఓమెరుగైన పాఠశాలను ఎంచుకుని అదే మండలంలో మరొక పాఠశాలను దానికి ట్విన్నింగ్‌ చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 100 పాఠశాలలను మరో వంద పాఠశాలలకు ట్విన్నింగ్‌ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక పాఠశాల నుంచి మరొక దానికివెళ్లి రావడం, ఇతర ఖర్చుల నిమిత్తం ఒక్కో బడికి రూ.1000 ప్రభుత్వం అందజేస్తుంది. ఆర్ట్‌అండ్‌క్రాఫ్ట్‌, స్థానిక పండగలు,. వ్యవసాయం, పరిశ్రమలు ఇలా వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

భాషాభివృద్ధి

విద్యార్థులు మాతృభాషతోపాటు హిందీ, ఇంగ్లీషు భాషలపై కూడా పట్టుసాధించేలా చేయాలన్న లక్ష్యంతో లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం(లిప్‌)ను అమలు చేస్తున్నారు.1 నుంచి 2 తరగతులకు తెలుగు, ఇంగ్లీషు రెండు పదాలు, 3 నుంచి 5తరగతులు తెలుగు, ఇంగ్లీషు మూడు పదాల చొప్పున విద్యార్థులకు నేర్పించాలి. 6 నుంచి 8తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇటీవల వరకు ఐదు పదాలు నేర్పించాలని చెప్పినా ప్రస్తుతం వాటిని మూడు పదాలకు తగ్గించారు. ప్రతి 15 రోజులకోసారి ఆ పదాల జాబితాను ఆర్‌జేడీ కార్యాలయం విడుదల చేస్తుంది. నేర్చుకున్న పదాలపై పక్షం రోజులకు ఓసారి పరీక్ష నిర్వహించి గ్రేడ్‌లు కేటాయించాలి. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నా చేసిన మార్పులు, అమల్లో ఉపాధ్యాయుల చేపట్టాల్సిన విధులపై ఇటీవల సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.

సమర్థంగా అమలు

విద్యార్థుల్లో భాషానైపుణ్యం, సామర్థ్యాల పెంపుకోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నాం.దీనిలో భాగంగానే డివిజన్‌ వారీగా ఉపాధ్యాయులకు సదస్సులు నిర్వహిస్తున్నాం. లిప్‌ కార్యక్రమం అమల్లో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు ఒకేచోట రాయించకూడదు. వేర్వేరుగా ఒక పుస్తకంలో ఒక్కో భాషకు 30 పేజీల చొప్పున కేటాయించాలి. ఒకరోజు నేర్పిన పదాలను మరుసటిరోజు విద్యార్థుల చేత చూడకుండా రాయించాలి. ఈ కార్యక్రమాల అమలుపై మండల విద్యాశాఖాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ దిశగా ఆదేశాలు కూడా జారీచేశాం. - తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారిణి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని