logo

భూ సర్వేకుఅడుగడుగునా ఆటంకాలు

భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో చేపట్టిన భూహక్కు...భూరక్ష కార్యక్రమం సజావుగా సాగడానికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పూర్తిచేయగా రెండోవిడత

Published : 18 Jan 2022 01:34 IST

బందరు మండల పరిధిలో రైతులతో కలిసి

పొలాల మ్యాప్‌లు పరిశీలిస్తున్న సర్వేయర్లు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో చేపట్టిన భూహక్కు...భూరక్ష కార్యక్రమం సజావుగా సాగడానికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పూర్తిచేయగా రెండోవిడత వివిధ మండలాల్లోని గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ సాగుతున్న తరుణంలో లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు చూసి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

29 గ్రామాల్లో రెండో విడత

జిల్లాలో ముందుగా 332 గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడ డివిజన్‌లో జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట, బందరు డివిజన్‌లో బందరు మండలంలోని పొట్లపాలెం, నూజీవీడు డివిజన్‌లో మర్రిబందం, గుడివాడ డివిజన్‌లో మెరకగూడెం గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. షేర్‌మహ్మద్‌పేట 240, పొట్లపాలెం 106, మర్రిబంధం 81, మెరకగూడెంలో 79 సర్వేనంబర్లకు పార్శిల్‌ సంఖ్యలు కేటాయించారు. రెండో విడతగా గుడ్లవల్లేరు, గన్నవరం, కంచికచర్ల, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఆగిరిపల్లి, పెడన, బందరు మండలాల్లో 29 గ్రామాలను ఎంపిక చేశారు. వీటిల్లో డ్రోన్‌ మ్యాపింగ్‌ పూర్తి చేసి సర్వే నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన మండలాల్లోని సర్వేయర్లు అందరితో బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో పొలాలు, ఇళ్ల హద్దులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం వరిపంట లేకపోవడంతో ఎక్కువ గ్రామాల్లో అపరాలు సాగు చేయడంతో సులువుగా హద్దులు గుర్తించి సర్వే వేగవంతం చేయాలని భావించినా ఆశించిన స్థాయిలో సర్వే సాగడం లేదు.

రైతులు అందుబాటులో లేక..

ప్రస్తుతం సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలంటే రైతులు అందుబాటులో ఉండాలి. ఆయా గ్రామాల్లో చాలామంది వృత్తి, వ్యాపారం తదితర కారణాలతో దూర ప్రాంతాల్లో ఉండటంతో సర్వే ఆగి...ఆగి సాగుతుంది. ఊళ్లల్లో భూములు ఉన్న వారు హైదరాబాదు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వారికి సమాచారం ఇచ్చినా చాలామంది రావడం లేదు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. తొలివిడతలో పూర్తి చేసిన సర్వేకి సంబంధించి అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటికీ ఆ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఆయా భూములకు సంబంధించిన రైతులు ఉండాలి...వారి అంగీకారంతో హద్దులు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఎంపిక చేసిన 29 గ్రామాల్లోనూ అనేక మంది భూ యజమానులు లేరు. ఉన్నతాధికారులు మాత్రం సర్వే పూర్తి చేయాలని ఆదేశించడంతో ఏంచేయాలో తెలియక సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ లక్ష్యంలోపు సర్వే సాధ్యం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఫోన్‌ చేసి పిలిపిస్తున్నాం

రైతులు అందుబాటులో లేకపోవడంతో కొంత సమస్య ఏర్పడుతున్న మాట వాస్తవమే. అయినా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశించిన సమయంలో రెండో విడత సర్వే పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. హద్దులు తేల్చేక్రమంలో ఇరుపక్షాలూ ఉండాలి. అప్పుడే తరువాత ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అందుకే ఆయా గ్రామాల్లో అందుబాటులో లేని రైతుల వివరాలు తీసుకుని ఫోన్‌ చేసి పిలిపిస్తున్నాం. డ్రోన్‌మ్యాపింగ్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా నిర్వహిస్తున్నాం. సాధ్యమైనంతవరకు లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. - కె.సూర్యారావు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు ఏడీ

జిల్లాలోని సర్వే నెంబర్లు: 3,15,153

భూమి విస్తీర్ణం: 21,26,798.72

ఎకరాలు రెవెన్యూ గ్రామాలు: 995

మొదటి విడత సర్వే నిర్వహించిన పైలెట్‌ గ్రామాలు: 4

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని