logo

ఎలా అమ్మాలి..ఏం చేయాలి?

ఘంటసాల మండలంలోని చిట్టూర్పు గ్రామానికి చెందిన రాఘవరావు అనే రైతు తన పొలాన్ని ఈ-పంటలో నమోదు చేయించుకున్నారు...ఇటీవల ధాన్యం విక్రయించడానికి వెళ్తే మూడెకరాల్లో సగం మాత్రమే నమోదైనట్లు సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు.

Published : 18 Jan 2022 01:34 IST

ఈ- పంటలో నమోదుకాక అన్నదాతల అవస్థలు

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తుతున్న రైతులు

ఘంటసాల మండలంలోని చిట్టూర్పు గ్రామానికి చెందిన రాఘవరావు అనే రైతు తన పొలాన్ని ఈ-పంటలో నమోదు చేయించుకున్నారు...ఇటీవల ధాన్యం విక్రయించడానికి వెళ్తే మూడెకరాల్లో సగం మాత్రమే నమోదైనట్లు సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబ సభ్యుల్లో పలువురి పొలాలు కూడా పూర్తిస్థాయిలో నమోదు కాలేదని వాపోతున్నారు.

గూడూరు మండలం కంకటావ గ్రామానికి చెందిన పలువురు రైతులు తాము సాగు చేసిన పొలాన్ని ఈ- పంటలో నమోదు చేసుకున్నారు.. అధికారులు కూడా నమోదైనట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రం సైట్‌లో వివరాలు చూపించకపోవడంతో ధాన్యం విక్రయించడానికి అవస్థలు పడుతున్నారు.

ఇలా జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతుల పొలాలు ఈ-పంటలో నమోదు కాకపోవడం, నమోదైనా ధాన్యం కొనుగోళ్ల సైట్‌లో చూపించకపోవడంతో విక్రయించుకునే మార్గం లేక ఆందోళన చెందుతున్నారు.

గోడుగుపేట (మచిలీపట్నం), న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 2.48లక్షల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో వరి సాగయ్యింది. క్షేత్రస్థాయిలో ఏది సాగుచేసినా అది ఈ-పంట సైట్‌లో నమోదైతేనే ప్రభుత్వ రాయితీలు అందుతాయి. ధాన్యం విక్రయించాలన్నా నమోదు తప్పనిసరి. అందుకే ఎప్పటి పంటలు అప్పుడు నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంత చేసినా పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. నూరుశాతం పంట నమోదు లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు, పెడన, ఘంటసాల, కృత్తివెన్ను, బందరు ఇలా అనేక మండలాల్లో వేలాది హెక్టార్లలో విస్తీర్ణం ఇంకా నమోదు కాలేదు. ఈ సమస్య జిల్లావ్యాప్తంగా ఉండడంతో ఏయే మండలాల్లో ఎంత విస్తీర్ణం నమోదు కాలేదో వివరాలు సేకరించే ప్రయత్నం చేసినా కొన్ని మండలాలకే పరిమితం అయ్యిందని రైతులు వాపోతున్నారు.

అవకాశం ఇచ్చి ఆదుకోవాలి

భూమి అడంగళ్లలో సమస్యలు, సాంకేతిక లోపాలు తదితర కారణాలతో జిల్లాలో వేలాదిమంది రైతుల పంటలు నమోదు కాలేదు. గ్రామాల్లో ఉండే వ్యవసాయ సహాయకులతోపాటు అనుబంధ శాఖల సిబ్బంది వారి పరిధిలోని పొలాలకు వెళ్లి ఏపంట సాగు చేశారో చిత్రాలు తీసి దస్తావేజుల వివరాలతో సహా నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు, కొంతమంది తమ పిల్లలకు భూమి పంపకాలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసినా ఇంకా ఆన్‌ లైన్‌లో నమోదు కాకపోవడం ఇలా వేలాదిమంది రైతుల భూమి వివరాలు నమోదుకాలేదు.కొన్ని చోట్ల రైతులు చనిపోవడంతో వారిపేరిట ఉన్న భూములకు సంబంధించిన ధాన్యాన్ని విక్రయించాలన్నా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇలాంటి సమస్య ఉత్పన్నంకావడంతో అప్పటికప్పుడు నమోదు చేయించేలా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పంట నమోదు వెబ్‌సైట్‌ను క్లోజ్‌ చేయడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

పంట నూర్చి రెండు నెలలైంది

రెండెకరాల పంట నూర్పిడి చేసి నెలయ్యింది...ధాన్యం విక్రయిద్దామని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్తే సర్వే నెంబర్లు చూసి సిబ్బంది నమోదు కాలేదన్నారు. ఆ తరువాత అసలు ఎంత విస్తీర్ణం నమోదయ్యిందో తెలుసుకుందామని ఆరాతీస్తే ఆరెకరాల్లో మూడు ఎకరాలే నమోదయ్యింది. నాలాంటి రైతులు చాలామంది ఉన్నారు. ఏంచేయాలో తెలియడం లేదు. - కొండవీటి నాగభూషణం, ఉప్పలకలవగుంట, పెడన మండలం

ప్రభుత్వానికి నివేదించాం

జిల్లాలో అన్ని పంటలూ నమోదు చేశాం. వివిధ కారణాలతో అక్కడక్కడా ఇంకా కొందరు ఉన్నారని తెలిసి వివరాలు సేకరించాం. దాదాపు ఇంకా 5వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం నమోదు చేయాల్సి ఉందని గుర్తించాం. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ పంట పోర్టల్లో నమోదు చేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - మోహన్‌రావు, వ్యవసాయశాఖ జేడీ

అప్పుడే చూసుకోవాల్సింది

పంట నమోదుచేసిన తరువాత జాబితాలను రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. అప్పుడే రైతులు తమ వివరాలు సరిచూసుకుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. అయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితంగా త్వరలోనే మళ్లీ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. - జన్ను రాఘవరావు, వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని