logo

విజ్ఞానం పెట్టెలకే పరిమితం

విద్యార్థి దశలో విజ్ఞానంపై ఆలోచనలు రేకెత్తించి, ఆసక్తి కలిగిస్తే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వారు తమ లక్ష్యాలకు అనుగుణంగా పురోగమిస్తారు. ఆ ఆసక్తి వారిని విభిన్న రంగాల్లో పరిశోధకులుగా తీర్చిదిద్దుతుంది. పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి స్థాయిలోనే 

Published : 21 Jan 2022 03:11 IST

సైన్సు పరికరాలు అలంకారప్రాయం


మండవల్లి ఉన్నత పాఠశాలలో ప్రయోగశాలలో విద్యార్థులు

మండవల్లి, న్యూస్‌టుడే : విద్యార్థి దశలో విజ్ఞానంపై ఆలోచనలు రేకెత్తించి, ఆసక్తి కలిగిస్తే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వారు తమ లక్ష్యాలకు అనుగుణంగా పురోగమిస్తారు. ఆ ఆసక్తి వారిని విభిన్న రంగాల్లో పరిశోధకులుగా తీర్చిదిద్దుతుంది. పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి స్థాయిలోనే విద్యార్థులు ఆయా రంగాల వైపు దృష్టిసారించి పూర్తి అవగాహన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేయాలని విద్యా, సాంకేతిక నిపుణులు ముక్తకంఠంతో కోరుతున్నారు. జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహించి విద్యార్థులను సైన్స్‌ పట్ల ఆకర్షితులుగా చేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ఉన్నత పాఠశాలల విషయానికొస్తే అవి ఎంత వరకు సక్రమంగా అమలవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ప్రయోగశాలలు అంతంత మాత్రంగానే ఉండడంతో పలు చోట్ల ప్రయోగ తరగతులు మొక్కుబడిగానే మారుతున్నాయి. ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలలుగా రూపొందిన వాటిలో నేటికీ కనీసం ప్రయోగశాలలు లేవు. దీంతో విద్యార్థులు సాంకేతిక, సైన్స్‌ అంశాలకు దూరం అవుతున్నారు.

నాసిరకమే..

కైకలూరు నియోజకవర్గంలో మండవల్లి, ముదినేపల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో 30 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ప్రయోగ పరికరాలు సమకూర్చుకున్నారు. వీటిలో ఎక్కువ శాతం నాసికరంగా ఉండడంతో వాటిని వినియోగించేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదు. పరీక్షలకు అవసరమైన అన్ని పరికరాలు, మూలకాలు, వస్తువులను విద్యాశాఖ ఉన్నతాధికారుల జోక్యంతోనే పాఠశాలలకు చేరుతున్నాయి. అలా కాకుండా ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ను క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు కేటాయిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించే వీలుంటుంది. ఉన్నత పాఠశాలల్లోని ప్రయోగశాలలను ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దితే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా విద్యాశాఖాధికారులు కార్యాచరణ చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇంగిలిపాకలంకలో పెట్టెల్లో భద్రంగా ఉన్న పరికరాలు

ప్రదర్శనకేదీ చోటు

నియోజవకర్గంలో చాలా పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ పంపుతున్న వస్తువులన్ని బీరువాల్లోకే చేరుతున్నాయి. ముఖ్యంగా స్థాయి పెరిగిన ప్రతి పాఠశాలలో ల్యాబ్‌ కొరత వేధిస్తోంది. మండవల్లి మండలంలో లోకుమూడి, పుట్లచెరువు, ఇంగిలిపాకలంక గ్రామాల్లో ప్రయోగశాలలు లేకపోవడంతో ఉపాధ్యాయులు వారికి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. పుస్తకాల్లో బొమ్మల ఆధారంగా విద్యార్థులు పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో విద్యార్థులు పరీక్షల్లో పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారు.

ఆధునిక సదుపాయాలు అవసరం

ఉన్నత పాఠశాలల్లో ప్రయోగశాలలను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాలి. పరికరాలు, సౌకర్యాలతో పాటు, సైన్సు ప్రదర్శన గదులను కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు వెళ్లాలంటే పాఠశాలల్లో అందుకు అవసరమైన అన్ని అంశాలపై ప్రయోగాలను సొంతంగా నిర్వహించే స్థాయికి చేరుకునేలా తీర్చిదిద్దాలి. అందుకే పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు ఎంతో అవసరం. అప్పుడే మంచి ఫలితాల సాధనకు వీలుంటుంది. - శ్యామ్‌కుమార్‌, సైన్స్‌ ఉపాధ్యాయుడు, కానుకొల్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని