logo

ఆదాయం తరిగె...ఖర్చులు పెరిగె!

పెడన పురపాలక సంఘం ప్రగతికి ఆర్థిక కష్టాలు అవరోధంగా పరిణమించాయి. దాదాపు 35 వేల జనాభా ఉన్న తృతీయ శ్రేణి మున్సిపాలిటీలో అభివృద్ధికి అవసరమైన నిధులు లేక కునారిల్లుతోంది. అత్యవసర చెల్లింపులకు నిధులు లేకపోవటంతో పనులు చేసేందుకు

Published : 21 Jan 2022 03:11 IST

పెడన మున్సిపాలిటీలో ఆర్థిక మందగమనం

బిల్లులు చెల్లించలేక సతమతం

న్యూస్‌టుడే - పెడన

పెడన మున్సిపల్‌ కార్యాలయం

పెడన పురపాలక సంఘం ప్రగతికి ఆర్థిక కష్టాలు అవరోధంగా పరిణమించాయి. దాదాపు 35 వేల జనాభా ఉన్న తృతీయ శ్రేణి మున్సిపాలిటీలో అభివృద్ధికి అవసరమైన నిధులు లేక కునారిల్లుతోంది. అత్యవసర చెల్లింపులకు నిధులు లేకపోవటంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం పురపాలక సంఘంలోని వివిధ విభాగాలపై కన్పిస్తోంది. సచివాలయాలకు అద్దెలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క కార్యాలయ నిర్వహణ ఖర్చులు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక నిర్వహణ సవాల్‌గా మారింది.

ఏటా రూ. 2కోట్ల ఆదాయం

పురపాలక సంఘానికి ఆస్తి పన్నులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల అద్దెల ద్వారా ఏడాదికి రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. ఇతర ఆదాయ వనరులైన మున్సిపల్‌ ఆశీలు, చెరువుల లీజులు, ఆక్రమణల పన్నులు తదితర విభాగాల నుంచి మరో రూ.కోటి వరకు సమకూరుతుంది. ఇలా మొత్తం రూ.2 కోట్లతో ఏడాది మొత్తం వివిధ విభాగాల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులొస్తే వాటిని కూడా రెండు బ్యాంకు కరెంటు ఖాతాలకు జమ చేస్తారు. గత పాలకవర్గ పదవీ కాలం పూర్తయ్యేనాటికి ఈ రెండు ఖాతాల్లో దాదాపు రూ.1.25 కోట్ల నిధులు ఉండగా, ప్రస్తుతం నిల్వ రూ.25 లక్షలకు పడిపోయింది. ఈ మొత్తంతో ఒప్పంద కార్మికుల రెండ్నెళ్ల వేతనాల చెల్లింపు కూడా కష్టంగా మారింది. మరోవైపు ఖర్చులు చూస్తే పెరిగిపోతున్నాయి. విద్యుత్తు బిల్లులు ప్రతి నెల రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వస్తున్నాయి. ఇందులో వీధి దీపాలు, సచివాలయాల అద్దె భవనాలు, మున్సిపల్‌ కార్యాలయంతోపాటు అనుబంధ విభాగాల సర్వీసులు ఉన్నాయి. తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రతి నెల రూ.2 లక్షల వరకు బిల్లులొస్తున్నాయి. ఈ కేటగిరీ సర్వీసుకు బిల్లులు చెల్లించకపోవటంతో ఇప్పటివరకు దాదాపు రూ.2 కోట్ల వరకు విద్యుత్తు సంస్థకు మున్సిపాలిటీ బకాయిపడింది. ప్రజారోగ్య విభాగంలోని వాహనాలకు నెలకు రూ.80 వేల వరకు డీజిల్‌ బిల్లులు వస్తున్నాయి. ప్రతినెలా బిల్లులు చెల్లించకపోవటంతో డీలర్‌కు దాదాపు రూ.8 లక్షల వరకు బకాయిలు నిలిచిపోయాయి. తాగునీటి సరఫరాకు సంబంధించి ఆలం, క్లోరిన్‌, పత్రికల టెండరు నోటీసుల బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

నిలిచిన చెల్లింపులు

వైకాపా కౌన్సిల్‌ అధికారం చేపట్టిన తర్వాత కౌన్సిల్‌ హాలు, ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌ ఛాంబర్‌లను శీతలీకరణ చేయించారు. దీనికి దాదాపు రూ.10 లక్షల వరకు వెచ్చించారు. ఈ సౌకర్యం ఏర్పాటై ఆర్నెళ్లు గడిచినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. మచిలీపట్నం రోడ్డులోని గ్యాస్‌ ఏజెన్సీ ఎదురుగా ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ పార్కుకు రూ.9 లక్షల వరకు గుత్తేదారుకు చెల్లించాల్సి ఉంది. తరకటూరు నుంచి పెడనకు వచ్చే వాటర్‌ వర్క్స్‌ రావాటర్‌ పైపులైను లీకులు, ఇతర మరమ్మతులకు కాంట్రాక్టర్‌కు రూ.3.50 లక్షల వరకు చెల్లింపులు నిలిచిపోయాయి. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పోలింగ్‌, కౌంటింగ్‌ ఏర్పాట్లకు గుత్తేదారుకు రూ.7.50 లక్షలు ఇవ్వాల్సి ఉంది. బిల్లులు చెల్లించకపోవడంతో తదుపరి పనులను నిలిపివేశారు. క్లోరిన్‌, ఆలంకు రూ.2.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. పెడనలో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసిన ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు కూడా చెల్లింపులు నిలిచిపోయాయి. ఇలా ప్రతి విభాగంపైనా పురపాలిక ఆర్థిక సంక్షోభం ప్రభావం కన్పిస్తోంది. దీనిపై కమిషనర్‌ అంజయ్య వివరణనిస్తూ.. పురపాలక సంఘ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఖాళీ స్థలాలు, కొత్త భవనాలకు త్వరితగతిన పన్నులు వేయాలని రెవెన్యూ విభాగాన్ని ఆదేశించామన్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న 18 దుకాణాలను లీజుకిచ్చేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని