AP News: గుడివాడలో భారీగా పోలీసుల మోహరింపు..

ఏపీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో భారీగా పోలీసులు మోహరించారు. సంక్రాంతికి క్యాసినో నిర్వహించడంపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ ఈరోజు అక్కడ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వైకాపా- తెదేపా వర్గాల ..

Updated : 21 Jan 2022 11:37 IST

గుడివాడ: ఏపీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో భారీగా పోలీసులు మోహరించారు. సంక్రాంతికి కొడాలి కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణల నేపథ్యంలో తెదేపా నిజనిర్ధారణ కమిటీ ఈరోజు అక్కడ పర్యటించనుంది. తెదేపా బృందం రాక విషయాన్ని తెలుసుకుని వైకాపా శ్రేణులు కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా- తెదేపా వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టారు. రోప్‌పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. డీఎస్పీ సత్యానందం నేతృత్వంలో గుడివాడ నెహ్రూ చౌక్‌, నియోజకవర్గ తెదేపా కార్యాలయం వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు. ఈ పరిస్థితుల్లో తెదేపా నిజనిర్ధారణ బృందం పర్యటనకు పోలీసులు ఏ మేరకు అనుమతి ఇస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి కొడాలి నాని అమరావతి వెళ్లారు.

క్యాసినో నిర్వహణపై తెదేపా ముఖ్య నేతలు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్యతో ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేడు గుడివాడలో పర్యటించి క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు సమాయత్తమైంది. అనంతరం దీనికి సంబంధించిన నివేదికను తెదేపా అధిష్ఠానానికి అందజేయనుంది.

కొడాలి నానిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి: బొండా ఉమ

సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ పేరిట క్యాసినో నిర్వహించారు. ఎన్టీఆర్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను సహించం. సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవా సంస్కృతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్నా అంటే సరిపోతుందా?ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానిని తప్పిస్తే న్యాయపోరాటం చేస్తాం. కొడాలి నాని దొరికిపోయిన దొంగ.. వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి’’ అని బొండా ఉమ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని