logo

నూలు ధరలు మళ్లీ పెరిగాయ్‌

జిల్లాలో ముడినూలు ధరలు మరోసారి పెరిగాయి. ఈ పరిణామంతో సహకార, సహకారేతర సంఘాలతోపాటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అడ్డూ అదుపు లేకుండా ప్రతి నెలా ఎంతో కొంతమేర ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

Published : 23 Jan 2022 03:11 IST

డబ్ల్యుకు రూ.225 పెంపు

న్యూస్‌టుడే - పెడన గ్రామీణం

జిల్లాలో ముడినూలు ధరలు మరోసారి పెరిగాయి. ఈ పరిణామంతో సహకార, సహకారేతర సంఘాలతోపాటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అడ్డూ అదుపు లేకుండా ప్రతి నెలా ఎంతో కొంతమేర ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జిల్లాలో 35 చేనేత సహకార సంఘాలు, మాస్టర్‌ వీవర్లు ఎక్కువగా చీరలు ఉత్పత్తి చేస్తున్నారు. నేత చీరల ఉత్పత్తిలో పడుగు, పేకకు ఉపయోగించే 80 నంబరు కూంబుడ్‌ నూలు డబ్ల్యు ధర డిసెంబరులో రూ.2,900 ఉండగా, ఇప్పుడు రూ. 3,125కు ఎగబాగింది. ఒక్క నెలలో రూ. 225 పెరిగింది. 60 నంబర్‌ కూంబుడ్‌ నూలు గత నెలలో రూ. 1,770 ఉండగా, ఈ నెల రూ.1850కు అంటే రూ.80 పెరిగింది. ఈ నూలుకు అద్దకం కేంద్రాల్లో రంగులు అద్దాల్సి ఉంటుంది. లేత రంగులు (నెప్తాల్‌) డబ్ల్యుకు రూ.400 వరకు వ్యయం అవుతుంది. ముదురు రంగులు ఒక డబ్ల్యు రూ.650 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ముడి సరకుల ధరల పెరిగిన ప్రకారం చీరల ధరలు పెంచలేక, విక్రయాలు జరగక, అటు ఆప్కో కొనుగోలు చేయక సంఘాలు పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో వేతనాలు గిట్టుబాటుకాక నేత కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. జిల్లాలో చేనేత కేంద్రమైన పెడన పట్టణంలో గతంలో 6 నూలు విక్రయ దుకాణాలు ఉండేవి. ఇప్పుడు రెండుకి పరిమితమయ్యాయి. అద్దకం కేంద్రాలు గతంలో పది ఉండగా, మూడుకు తగ్గిపోయాయి. సహకార సంఘాలు తమకు అనుబంధంగా ఉన్న అద్దకం కేంద్రాల్ని మూసివేసి మంగళగిరి, చీరాల ప్రాంతాల్లో నూలుకు రంగులు అద్దించుకుంటున్నారు.

నియంత్రణ చర్యలు చేపట్టాలి

కొవిడ్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి చైనా ఉత్పత్తి చేసే పత్తి, నూలు సరఫరా నిలిచిపోయింది. మన రాష్ట్రం నుంచి కూడా పత్తి, ముడి నూలు, కోన్‌ నూలు విదేశాలకు యథేచ్ఛగా ఎగుమతి అవుతోంది. విదేశాల నుంచి రాకపోవడం, ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తుండటంతో నూలు ధరలు పెరిగిపోతున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ విధించాలి. - వి.విష్ణు, మేనేజర్‌, సదాశివలింగేశ్వర చేనేత  సహకార సంఘం, పెడన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని