logo

బస్సెప్పుడొస్తుందో...!

పల్లెలు అభివృద్ధి బాట పట్టడం మాట అటుంచితే.. కనీస అవసరాలూ తీరని దయనీయ స్థితిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సొంత కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్న వాళ్ల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యా అధికమే.

Published : 23 Jan 2022 03:11 IST

లంక గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు


ప్రయాణానికి ఇలాంటి వాహనాలే శరణ్యం

కలిదిండి, కైకలూరు, న్యూస్‌టుడే : పల్లెలు అభివృద్ధి బాట పట్టడం మాట అటుంచితే.. కనీస అవసరాలూ తీరని దయనీయ స్థితిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సొంత కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్న వాళ్ల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యా అధికమే. కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సదుపాయం లేదంటే అతిశయోక్తి ఏమీ కాదు. నిత్యం రద్దీగా ఉండే గ్రామాలకూ బస్సులే నడపడం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణానికి సరకు తరలించే వాహనాలు, ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం. విద్యాలయం, అత్యవసర సమయంలో ఆసుపత్రి, ఏదైనా కార్యాలయానికి సకాలంలో వెళ్లాలంటే సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. కలిదిండి, కైకలూరు మండలాల్లో ప్రధాన గ్రామాల్లో మొత్తం జనాభా, బస్సులు నడపాలనే ప్రతిపాదనలు ఎంతకాలంగా అమలుకు నోచుకోలేదో తెలియచెప్పే ఉదాహరణలివి.

మార్గం కలిదిండి - కైకలూరు

గ్రామాలు : కలిదిండి, వెంకటాపురం, ఆరుతెగలపాడు, వరహాపట్నం, గోపవరం, రాచపట్నం, కైకలూరు

జనాభా : 30వేలు విస్తీర్ణం : 15కి.మీ

పరిస్థితి : ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దీనిని ఇప్పటి వరకు ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు.

కోరుకొల్లు - కైకలూరు

గ్రామాలు : కోరుకొల్లు, వేమవరప్పాడు, తామర, కొల్లు వింజరం, ఆచవరం, కైకలూరు

జనాభా : 30వేలు విస్తీర్ణం : 12కిమీ

పరిస్థితి : ఈ మార్గంలో గతంలో ఆర్టీసీ బస్సు సదుపాయం ఉండేది. ఉదయం, సాయంత్రం మాత్రమే నడపడంతో, మిగిలిన సమయాల్లో ప్రయాణ అవసరాల కోసం ఆటో ప్రయాణానికి ప్రజలు మొగ్గుచూపారు. దీంతో అధికారులు ఆర్టీసీ బస్సును రద్దు చేశారు. తిరిగి బస్సు సౌకర్యం పునరుద్ధరించలేదు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో బస్సు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలు ఎక్కువగా వస్తున్నాయి.

కలిదిండి - లోడిదలంక

గ్రామాలు : కలిదిండి, పడమటిపాలెం, లోడిదలంక

జనాభా : 15వేలు విస్తీర్ణం : 10కిమీ

పరిస్థితి : ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు తిరిగేది. కొన్నేళ్ల కిందట రోడ్డు దారుణంగా ధ్వంసం కావడంతో నిలిపివేశారు. కొంతకాలం 108 వాహనం కూడా తిరగలేదు. ఇటీవల రోడ్డు అభివృద్ధి చేశారు. అయినా బస్సు సదుపాయాన్ని తిరిగి ప్రారంభించలేదు.

కలిదిండి - గుర్వాయిపాలెం - పెదలంక

గ్రామాలు : కలిదిండి, గుర్వాయిపాలెం, సంతోషపురం, అమరావతి, భాస్కరరావుపేట, మూలలంక, పెదలంక

జనాభా : 25వేలు విస్తీర్ణం : 16కిమీ

పరిస్థితి : విజయవాడ నుంచి రాత్రి 6 గంటలకు వచ్చిన బస్సు ఉదయం 5 గంటలకు తిరిగి వెళ్తుంది. గుడివాడ నుంచి మూలలంక వరకు ఉదయం 9.30గంటలకు, భీమవరం నుంచి సాయంత్రం 6 గంటలకు ఒక బస్సు ఉంది. మధ్యాహ్నం వచ్చే బస్సు రద్దు చేశారు. దీనిని పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కైకలూరు - ఆలపాడు - కొల్లేరు లంక గ్రామాలు

గ్రామాలు : కైకలూరు, ఆటపాక, భుజబలపట్నం, పల్లెవాడ, ఆలపాడు, వడ్లకూటితిప్ప, పెంచికలమర్రు, కొల్లేటికోట, పందిరిపల్లెగూడెం

జనాభా: 35 వేలు

విస్తీర్ణం: 18 కి.మీ

పరిస్థితి: కొల్లేరు లంక గ్రామాల ప్రజలు కైకలూరు చేరాలంటే ప్రైవేటు వాహనాలే దిక్కు. ఎన్నో ఏళ్ల నుంచి బస్సు ఏర్పాటు చేయాలని లంక గ్రామస్ధులు కోరుతున్నా, ఇప్పటి వరకు అటుగా అడుగులు పడలేదు.

రామవరం - కైకలూరు

గ్రామాలు : రామవరం, దొడ్డిపట్ల, సీతనపల్లి, వరహాపట్నం, రాచపట్నం, గోపవరం, కైకలూరు

జనాభా : 20 వేలు

విస్తీర్ణం : 15 కిమీ

పరిస్థితి : గతంలో ఈ మార్గంలోని రామవరంలో ఉదయం 7.45గంటలకు బస్సు బయల్దేరి 9గంటలకు కైకలూరు చేరుకునేది. సాయంత్రం 6గంటలకు కైకలూరు నుంచి రామవరం మీదుగా భీమవరం వెళ్లేది. దీంతో విద్యార్థులు, పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లే ప్రజలకు ఆసరాగా ఉండేది. ప్రస్తుతం ఈ సర్వీసు రద్దు చేయడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. బస్సు సర్వీసు పునరుద్ధరించే విషయమై గతంలో మంత్రులతో పాటు గుడివాడ డిపో అధికారులకు వినతిపత్రం అందించారు.

కలిదిండి - మద్వానిగూడెం - పెదలంక

గ్రామాలు : కలిదిండి, మద్వానిగూడెం, కొండంగి, యడవల్లి, మట్టగుంట, పెదలంక

జనాభా : 22వేలు విస్తీర్ణం : 20కిమీ

పరిస్థితి : ఉదయం, రాత్రి 7 గంటల సమయంలో బస్సు సదుపాయం ఉండేది. కొన్నాళ్లుగా ఆ బస్సు రావడం లేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆటోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రతి చిన్న అవసరానికీ కలిదిండి, భీమవరం, గుడివాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఈ మార్గంలో సర్వీసులు పెంచి మరో రెండుసార్లు బస్సు నడిపితే ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

గుడివాడ - ముదినేపల్లి - చిగురుకోట

గ్రామాలు : ముదినేపల్లి, చినకామనపూడి, పెదకామనపూడి, నరసన్నపాలెం, చిగురుకోట

జనాభా : 15వేలు విస్తీర్ణం : 10కిమీ

పరిస్థితి : రహదారి ధ్వంసం కావడంతో ఈ మార్గంలో బస్సు సదుపాయాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఆటోల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. రోడ్డుకు మరమ్మతులు నిర్వహించి, బస్సు రాకపోకలను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

కైకలూరు - పెనుమాకలంక - గుడివాడ

గ్రామాలు : కైకలూరు, లోకుమూడి, దెయ్యంపాడు, మనుగునూరు, పెనుమాకలంక, నందిగామలంక, ఉనికిలి

జనాభా : 15 వేలు విస్తీర్ణం : 20 కి..మీ

పరిస్థితి : కైకలూరు నుంచి కొల్లేరు లంక గ్రామాల మీదుగా గుడివాడకు బస్సు సర్వీసు నడిచేది. ఐదేళ్లుగా నిలిపివేశారు. ఈ మార్గంలో బస్సును నడపాలని గ్రామస్థులు ఎన్నోసార్లు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని