logo

అంతా డిప్యుటేషన్ల మయం

పాఠశాలల నిర్వహణకు ఉపాధ్యాయుల సర్దుబాటు అధికారులకు తలనొప్పిగా మారింది. ఒకపక్క కొవిడ్‌ బారిన పడిన ఉపాధ్యాయులు సెలవుల బాట పట్టడం, మరో పక్క కొత్తగా తెరిచిన పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపులు లేకపోవటంతో సర్దుబాటు

Published : 23 Jan 2022 03:11 IST

నరసన్నపాలెంలో విధులు నిర్వహిస్తున్న వాలంటీరు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: పాఠశాలల నిర్వహణకు ఉపాధ్యాయుల సర్దుబాటు అధికారులకు తలనొప్పిగా మారింది. ఒకపక్క కొవిడ్‌ బారిన పడిన ఉపాధ్యాయులు సెలవుల బాట పట్టడం, మరో పక్క కొత్తగా తెరిచిన పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపులు లేకపోవటంతో సర్దుబాటు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఉపాధ్యాయులకూ ఏ రోజు ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియని పరిస్థితి నెలకొంది. చిగురుకోట శివారు నరసన్నపాలెంలో కొత్తగా మంజూరైన పాఠశాలకు పెదకామనపూడి నుంచి ఓ ఉపాధ్యాయినిని డిప్యుటేషన్‌ వేశారు. తిరిగి శనివారం ఆమెకు వడాలి సమీపంలోని అప్పారావుపేటకు డిప్యుటేషన్‌ వేశారు. నరసన్నపాలెంకు మరో చోట నుంచి వాలంటీరు (అధికారికంగా వాలంటీర్ల నియామకం లేదు) వచ్చి పాఠశాలను నిర్వహించారు. మండలంలో ఉపాధ్యాయుల కొరతతో ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సెలవుపెడితే మండల విద్యాశాఖాధికారికి ఇబ్బందిగా పరిణమించింది. పేరూరు శివారు తేరగూడెం పాఠశాలకు రోజుకొక ఉపాధ్యాయుడు డిప్యుటేషన్‌పై వెళుతున్నారు. ఇలాగే మండలంలో కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయి. తేరగూడెం పాఠశాలకు శాశ్వత ప్రాతిపదికన డిప్యుటేషన్‌ వేసి కొనసాగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో దూరంగా ఉండే పాఠశాలకు ఎంఈవో డిప్యుటేషన్‌ వేస్తే వెళ్లటానికి ఉపాధ్యాములు సుముఖంగా లేకపోవటం గమనార్హం. ఆయా కాంప్లెక్సుల పరిధిలో సీఆర్పీలు కూడా డిప్యూటేషన్‌కు ససేమిరా అంటున్నారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని