logo

చిత్తశుద్ధి ఉంటే నివేదిక బయటపెట్టండి

ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని పీఆర్‌సీ సాధన సమితి రాష్ట్ర నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం 

Published : 28 Jan 2022 02:17 IST

పీఆర్‌సీ సాధన సమితి నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని పీఆర్‌సీ సాధన సమితి రాష్ట్ర నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ధర్నాచౌక్‌లో చేపట్టిన రిలేదీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది...వెళ్లడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని, తమ లేఖలోని అంశాలపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు..రూ.3కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి కమిషన్‌ వేసి రూపొందించిన నివేదికను బయట పెట్టడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు. ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేసిన చరిత్ర ఎప్పుడూ లేదని విమర్శించారు. ఒకటో తేదీ జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగ,ఉపాధ్యాయ, పింఛనుదారులనుంచి నాయకులపై వ్యతిరేకత వస్తుందని, వారు తిరుగుబాటు చేస్తే ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించవచ్చని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆయన వెంట పాల్గొన్న వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు కె.వి శివారెడ్డి, ఎం.కృష్ణయ్యలు చీకటి జీవోలు రద్దు చేయడంతోపాటు సాధన సమితి సూచించిన మూడు అంశాలను పరిష్కరించి చర్చలకు పిలవాలని అన్నారు. అనంతరం ఏపీ జేఏసీ ఛైర్మన్‌ వుల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, కేవలం మా పాతజీతాలు మాత్రమే ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు శోభన్‌బాబు మాట్లాడుతూ జీతాలు చేయమని ఖజానాశాఖ ఉద్యోగులపై ఒత్తిడి పెట్టవద్దన్నారు. వివిధ సంఘాల నాయకులు దీక్షలో పాల్గొన్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరం ఐకమత్యంగా ఉంటూ హక్కుసాధించేవరకు పోరాటాలు సాగిద్దామని పిలుపునిచ్చారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు దీక్ష కొనసాగించారు. దీక్షలో ఎక్కువమంది మహిళా ఉద్యోగులు పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పారు. సంఘాల నాయకులు నెల్సన్‌పాల్‌బాబు, దారపు శ్రీనివాస్‌, పి.రాము, కె.సునీల్‌కుమార్‌, దారపు శ్రీనివాస్‌, ఆకూరి శ్రీనివాసరావు, సాయికుమార్‌, ఎ.వెంకటేశ్వరరావు, కె. రాజేంద్రప్రసాదు, తోట ప్రసాదు, కోన ఆంజనేయులు, ఎ.సుబ్రహ్మణ్యం, వి.సీతారామయ్య, రమాదేవి, రజని, భారతి తదితరులతోపాటు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి దీక్షలో బొప్పరాజు

వెంకటేశ్వర్లు, శివారెడ్డి, ఎం.కృష్ణయ్య తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని