logo

అవసరమెంతో..ఇచ్చింది కొంతే..

 జిల్లాలోని పలు పట్టణాల్లో భారీ ఎత్తున టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా చాలాచోట్ల పునాదులదశలోనే ఆగిపోయాయి. పూర్తయిన వాటికి సైతం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను సత్వరం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో

Published : 29 Jan 2022 01:39 IST

రూ.679 కోట్లకు వచ్చింది రూ.35 కోట్లు

జీప్లస్‌త్రీ ఇళ్ల కేటాయింపునకు రుణ మంజూరు సమస్య

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని పలు పట్టణాల్లో భారీ ఎత్తున టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా చాలాచోట్ల పునాదులదశలోనే ఆగిపోయాయి. పూర్తయిన వాటికి సైతం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను సత్వరం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో అధికారులు రుణాలు అందించాలని నిర్ణయించారు. రుణ మంజూరు ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరకపోవడంతో పాటు లబ్ధిదారులు సైతం ఇళ్లు ఎప్పుడు అప్పగిస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

పూర్తయినవే కేటాయింపు

మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నూజివీడు, పెడన, జగ్గయ్యపేట పట్టణాలకు జనాభా ప్రాతిపదికన ఇళ్లు కేటాయించారు. పెడనలో స్థల సేకరణ సమస్య కారణంగా పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన వాటిల్లో నిర్మాణాలు చేపట్టినా వివిధ కారణాలతో చాలా వరకు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మచిలీపట్నంలోని దేశాయిపేట గోసంఘం ప్రాంతంలో 11 ఎకరాలు, మండల పరిధిలోని రుద్రవరంలో 25 ఎకరాల భూమి సేకరించి నిర్మాణ పనులు ప్రారంభించారు. రుద్రవరంలో చేపట్టిన వాటిలో చాలావరకు పునాదుల దశలోనే ఆగిపోయాయి. అలా మచిలీపట్నంలో మొత్తం 6,400 గృహాలు నిర్మించాలని సంకల్పిస్తే ప్రస్తుతం కేవలం 960 మాత్రమే లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడెక్కడ ఎన్ని పూర్తయ్యాయో గుర్తించి వాటిని లబ్ధిదారులకు కేటాయించడానికి ఏర్పాట్లు చేశారు. తొలివిడతలో భాగంగా మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల్లో ఇళ్ల పనులు పూర్తిచేసి వారికి అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రుణ మేళాలో లబ్ధిదారులు, ఉద్యోగులు

సక్రమంగా అందేనా..?

పట్టణాల్లో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు నిర్మిస్తున్నారు. మొత్తం మూడు కేటగిరీలు ఏర్పాటు చేశారు. ఎ కేటగిరీలో రూ.500ల చొప్పున చెల్లించిన లబ్ధిదారులకు బ్యాంకు రుణం అవసరం లేకుండానే కేటాయిస్తున్నారు. బి కేటగిరీలో రూ.3.15లక్షలు, సి విభాగం వారికి రూ.3.65లక్షల రుణం మంజూరు చేయాల్సి ఉంది. దీన్ని లబ్ధిదారులు వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అర్హులందరికీ రుణాలు మంజూరు చేయడానికి చర్యలు చేపట్టినా ఆశించిన పురోగతి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పట్టణాల వారీగా మెప్మా అధికారులకు బాధ్యతలు కేటాయించారు. మెప్మా సిబ్బంది లబ్ధిదారులతో ఇళ్లకు సంబంధించి డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ పూర్తి చేయించి బ్యాంకులు రుణం అందించేలా చర్యలు తీసుకోవాలి. దీనిలో భాగంగానే ఇటీవల మచిలీపట్నంలో టిడ్కో ఇళ్ల ప్రాంగణంలోనే రుణ మేళా నిర్వహించి పలువురికి ఇప్పించినా లక్ష్యం పూర్తికాని పరిస్థితి. నగరంలో 960మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 117మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ఇదే పరిస్థితి. జగ్గయ్యపేటలో రూ.55.96కోట్లు, మ,చిలీపట్నంలో రూ.33.84కోట్లు. తిరువూరులో రూ13.29, నూజివీడులో రూ.60.50కోట్లతో కలిపి జిల్లా వ్యాప్తంగా రూ.679 కోట్లకుపైగా రుణాలు అవసరం.

అన్ని వసతులతో ఇళ్లు

జీప్లస్‌త్రీ ఇళ్లను అన్ని వసతులతో లబ్ధిదారులకు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. వసతుల కల్పనకు రుణాలు అవసరం. దీనిలో భాగంగానే పట్టణాల్లో పలువురు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి రుణాలు మంజూరు చేసే ప్రక్రియ జరుగుతోంది.దీనిపై క్షేత్రస్థాయిలో సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్య సాధనకు చర్యలు తీసుకుంటున్నాం. - చిన్నోడు, ఏపీ టిడ్కో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని