logo

జీవోలు రద్దయ్యే వరకూ పోరాటమే

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ప్రయోజనాలను హరించే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోలను రద్దు చేసే వరకూ పోరాడుతూనే ఉంటామని పీఆర్సీ సాధన కమిటీ నాయకులు స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యాన

Published : 29 Jan 2022 01:39 IST

పీఆర్సీ సాధన కమిటీ నాయకులు

దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ప్రయోజనాలను హరించే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోలను రద్దు చేసే వరకూ పోరాడుతూనే ఉంటామని పీఆర్సీ సాధన కమిటీ నాయకులు స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద కొనసాగిస్తున్న రిలే దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. పాలనా విధానంలో సహేతుకత లేకుండా ఉద్యోగవర్గాలను మోసపుచ్చే ప్రయత్నాలు గర్హనీయమన్నారు. పీఆర్సీ నిబంధనలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చి ఉద్యోగ, ఇతర వర్గాల అభిప్రాయాలతో పనిలేదన్నట్టు ఏకపక్షంగా జీవోలు విడుదల చేయడమే కాకుండా సమాజంలో ఆయా వర్గాలపై దురభిప్రాయం కల్పించేలా అసత్య ప్రకటనలు చేయడం మంచిదికాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని చీకటి జీవోలను రద్దు చేయడం ద్వారా ఉద్యోగ వర్గాల్లో నమ్మకం కల్పించి చర్చలకు పిలవాలని కోరారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రూ.కోట్లు ఖర్చు చేసి రూపొందించిన అశుతోష్‌మిశ్రా కమిషన్‌ నివేదికను ఎందుకు బహిర్గతం చేయరో చెప్పాలన్నారు. పాత విధానంలోనే ఒకటో తేదీ జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏపీటీఎఫ్‌ నాయకులు తమ్ము నాగరాజు, పీఆర్‌టీయూ(డి) నాయకులు శ్రీను, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకులు రాజేంద్రప్రసాద్‌, తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. సుభాష్‌ చంద్రబోస్‌ స్ఫూర్తితో ఉద్యమాన్ని ఉప్పెనలా ముందుకు తీసుకువెళ్తామన్నారు. చర్చల పేరుతో సంఘ నాయకులను అపహాస్యం చేయాలనుకోవడం అభ్యంతరకరమన్నారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కనకరావు, ఎస్టీయూ నాయకులు కొమ్ము ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు తమ్ము నాగరాజు, పింఛనుదారుల సంఘ నాయకులు శంకరనాథ్‌, శాస్త్రి, రాజేంద్రప్రసాద్‌, తదితరులు ప్రసంగిస్తూ హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటం ఒక్కటే ఏకైక మార్గమంటూ నినదించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు భాసుమతి, పీడీఎస్‌యూ, ఏటీటీయూసీ నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. పోరాట సాధన సమితి నాయకులు ఉల్లి కృష్ణ, నెల్సన్‌పాల్‌, దారపు శ్రీనివాస్‌, శోభన్‌బాబు తదితరుల పర్యవేక్షణలో కొనసాగిన రిలే దీక్షలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పింఛనుదారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని