logo

ఇకనైనా పనులు సాగేనా..!

నగరపాలికలు, పురపాలికల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన అమృత్‌ పథకం పెండింగ్‌ బిల్లులు ఎట్టకేలకు ఇటీవల విడుదల అయ్యాయి. జిల్లాలోని పలు పురపాలికల్లో ఈ పథకం కింద చేపట్టిన పనులు గత కొంత కాలంగా గుత్తేదారులు నిలిపారు. చేసిన పనులు

Published : 29 Jan 2022 01:39 IST

ఎట్టకేలకు అమృత్‌ బకాయిల విడుదల

ఈనాడు - అమరావతి

నగరపాలికలు, పురపాలికల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన అమృత్‌ పథకం పెండింగ్‌ బిల్లులు ఎట్టకేలకు ఇటీవల విడుదల అయ్యాయి. జిల్లాలోని పలు పురపాలికల్లో ఈ పథకం కింద చేపట్టిన పనులు గత కొంత కాలంగా గుత్తేదారులు నిలిపారు. చేసిన పనులు తాలూకూ బిల్లులు ప్రభుత్వం వద్ద పేరుకుపోయాయి. అప్పోసొప్పో చేసి ఖర్చు చేసినా డబ్బులు రావడం లేదని ఆపేశారు. ఈ ప్రభావం పనులపై పడడంతో ఎంతకూ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పురపాలక శాఖ పాత బకాయిల విడుదలకు ఆమోదం తెలిపింది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 18 కోట్ల వరకు బిల్లులు గుత్తేదారులకు విడుదల అయ్యాయి.

నిలిచిన పనులకు మోక్షం : అమృత్‌ పథకం కింద తాగునీటి పథకాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, వర్షపు నీటి మళ్లింపు పనులను జిల్లాలో చేపట్టారు. బందరు నగరంలో అమృత్‌ రెండో దశ కింద రూ. 21 కోట్ల స్టామ్‌ వాటర్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు కేటాయించారు. ఈ నిధులతో అంతకు ముందు అసంపూర్తిగా వదిలేసిన ఓపెన్‌ డ్రెయిన్‌ పనులు పూర్తి చేయడంతో పాటు మొత్తం 11 కి.మీ పైగా పనులు చేపట్టేందుకు వీలుగా పనులు ప్రారంభించారు. 2018లో ప్రారంభం అయిన పనులు ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి. కేవలం 8 కి.మీ మాత్రమే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి రూ. 3 కోట్లు విడుదల అయ్యాయి. మచిలీపట్నం నగరానికి తాగునీటిని అందించే రక్షిత నీటి పథకాన్ని అమృత్‌ పథకం కింద చేపట్టారు. ఈ పనులు పూర్తయి ఏడాది గడిచింది. దీనికి సంబంధించి రూ. 5 కోట్ల బిల్లుకు మోక్షం కలగలేదు. మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 2018లోనే శంకుస్థాపన చేశారు. రూ. 16 కోట్లతో చేపట్టిన పనులు కూడా అసంపూర్తిగానే మిగిలాయి.

విజయవాడ నగరంలో ఈ పథకం కింద యూజీడీ, తాగునీటి పైపులైన్ల మార్పు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. బల్లులు రాక నెమ్మదించాయి. ఇటీవల వీటికి సంబంధించి రూ. 3 కోట్లు వచ్చాయి. గుడివాడ పట్టణంలో తాగునీటి సరఫరా ప్రాజెక్టును 2019లో రూ.20 కోట్లతో ప్రారంభించారు. పనులు 50 శాతం మేర పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు అయిన పనులకు సంబంధించి రూ. 5.72 కోట్ల వరకు బిల్లులు మంజూరయ్యాయి. ఇక్కడే ఎస్టీపీ నిర్మాణం కూడా పురోగతి లోపించింది. ఈ పనుల బిల్లు రూ. 1.20 కోట్లు వచ్చింది.

మంత్రి దిశానిర్దేశం

పెండింగ్‌ బిల్లులు మంజూరు కావడంతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, గుత్తేదారులతో సమావేశం నిర్వహించారు. గడువు దాటినా పూర్తి కాని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. చెల్లింపులు పూర్తి అయ్యాయి కాబట్టి.. వెంటనే నిలిచిన పనులను ప్రారంభించాలన్నారు. వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గుడివాడ పట్టణానికి తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు గడువు దాటినా పూర్తికి నోచుకోలేదు. దీని వల్ల దాదాపు వేల మందికి రక్షిత నీరు అందని పరిస్థితి నెలకొంది. వాటర్‌ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే వేసవి నాటికి పూర్తి చేయాలని మంత్రి బొత్స గడువు నిర్దేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని