logo

మాకో మాస్టారు కావాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ‘నాడు-నేడు’, ‘అమ్మఒడి’ వంటి పథకాల పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు నిధులు వెచ్చిస్తున్నా కొన్నిచోట్ల కనీస విద్య సైతం అందని పరిస్థితి నెలకొంది. మండలంలో పేరూరు శివారు తేరగూడెం ప్రాథమిక పాఠశాల

Published : 29 Jan 2022 01:39 IST

తేరగూడెం విద్యార్థుల ఎదురుచూపు

పేరూరు (ముదినేపల్లి), న్యూస్‌టుడే : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ‘నాడు-నేడు’, ‘అమ్మఒడి’ వంటి పథకాల పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు నిధులు వెచ్చిస్తున్నా కొన్నిచోట్ల కనీస విద్య సైతం అందని పరిస్థితి నెలకొంది. మండలంలో పేరూరు శివారు తేరగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడి కోసం నిత్యం ఎదురుచూపు తప్పడం లేదు. పక్క పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు డిప్యుటేషన్లపై వస్తారో రారో తెలియని అయోమయ పరిస్థితిలో కాలం గడుపుతున్నారు. దాదాపు నెల రోజులుగా ఈ పరిస్థితి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధ్యాయ పోస్టూ లేదు

ఈ పాఠశాలను ఐదేళ్ల క్రితం మూసేశారు. దీంతో విద్యార్థులు పేరూరు లేదా గుడివాడ రూరల్‌ మండలం పర్నాసకు వెళ్లాల్సి వచ్చేది. దీనిపై గ్రామస్థుల అభ్యర్థన మేరకు ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలను తిరిగి తెరిచారు. ఇటీవల బదిలీల్లో ఈ పాఠశాలలో పోస్టును చూపకపోవటంతో ఉపాధ్యాయుడు లేకుండా పోయారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఒత్తిళ్ల కారణంగా నిబంధనల ప్రకారం అధికారులు డిప్యుటేషన్లు వేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కోసారి పాఠశాల తెరవకపోయినా పట్టించుకునే వారే లేరని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

కనీస సౌకర్యాలూ కరవు

పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవటంతో డిప్యుటేషన్లపై వెళ్లేందుకు ఉపాధ్యాయినులతో పాటు కొందరు ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. మౌలిక వసతులు లేనిచోట ఎలా విధులు నిర్వహించాలని వారు ప్రశ్నిస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవటంతో విద్యార్థులతో పాటు ఇక్కడ డిప్యుటేషన్‌పై విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు రోజంతా అవస్థలు తప్పడం లేదు. ఈ విద్యా సంవత్సరంలోనే తిరిగి ప్రారంభించడంతో ‘నాడు-నేడు’ పథకం కింద మౌలిక వసతుల కల్పనకూ నోచుకోలేదు. అదీకాక శివారు ప్రాంతం కావడం కనీసం బస్సు, ఆటో వంటి రవాణా సౌకర్యం లేకపోవటంతో సకాలంలో అక్కడి చేరుకోవటం కష్టంగా ఉంటుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మధ్యాహ్న భోజనం వండేవారు సైతం లేకపోవటంతో పేరూరు పాఠశాల నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన దుస్థితి. పాఠశాలలో నేలంతా కుంగిపోయింది. పూర్తిస్థాయి ఉపాధ్యాయుడిని నియమించి, కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు

దీనిపై ఎంఈవో కె.నరేశ్‌కుమార్‌ను వివరణ కోరగా డిప్యుటేషన్లతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నాం. పాఠశాలకు రవాణా సౌకర్యం లేకపోవటం, మౌలిక వసతుల కొరతతో ఉపాధ్యాయినులు అక్కడకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయుడి నియామకం, కనీస సౌకర్యాల కల్పన ఆవశ్యకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆయన వివరించారు.

వినియోగంలో లేని మరుగుదొడ్లు​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని