logo

సాధన చేశారు..సత్తా చాటారు

వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద కుటుంబాలకు చెందిన బాలికలు. పట్టుదల ఉంటే ప్రతిభ చాటుకోవడానికి ఏవీ అడ్డు కావని నిరూపిస్తున్నారు. గూడూరుకు చెందిన పలువురు విద్యార్థినులు ఇటీవల ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో

Published : 29 Jan 2022 01:39 IST

కబడ్డీలో రాణిస్తున్న బాలికలు

మచిలీపట్నం(గొడుగుపేట), గూడూరు, న్యూస్‌టుడే : వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద కుటుంబాలకు చెందిన బాలికలు. పట్టుదల ఉంటే ప్రతిభ చాటుకోవడానికి ఏవీ అడ్డు కావని నిరూపిస్తున్నారు. గూడూరుకు చెందిన పలువురు విద్యార్థినులు ఇటీవల ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు చదువుకునే పాఠశాలకు, పుట్టిన ఊరికి కూడా మంచి పేరు తీసుకువస్తున్నారు. మండల, జిల్లా స్థాయి పోటీల్లో పతకాలు దక్కించుకున్నారు. అంతేకాదు రాష్ట్రస్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు బహుమతులు సొంతం చేసుకున్నారు. వారి లక్ష్యాలు. క్రీడల్లో రాణిస్తున్న తీరు తదితర అంశాలపై కథనం.

క్రీడలంటే ఇష్టం: జి.వన్షిత

చిన్నప్పటినుంచీ క్రీడలు అంటే ఇష్టం. అందుకే ప్రాథమికస్థాయి నుంచే సాధన చేస్తున్నాను. వ్యాయామ ఉపాధ్యాయులు నా ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. తోటి విద్యార్థినులతో కబడ్డీ ఆడుతుంటే చూసి వారు నాకు శిక్షణ ఇచ్చారు. చదువుతోపాటు ఆటలకు కూడా కొంత సమయం కేటాయించి రోజూ సాధన చేయడంతో ఉపాధ్యాయులు, శిక్షకులు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. అలా మండల, జిల్లాస్థాయిలో మెరుగ్గా రాణించడంతో రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. కర్నూలులో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నాం. పరుగు, ఖోఖో పోటీల్లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను.భవిష్యత్తులో క్రీడా కోటా కింద ఉద్యోగం సంపాదించాలనేది నా కోరిక.

అనుకోకుండా ఆటలోకి: ఎస్‌.యశస్విని

పాఠశాలలో నాతోటి బాలికలతో కలిసి వివిధ ఆటలు ఆడినా ఖోఖోలో ఎక్కువగా ఆసక్తి ఉండేది. ఉపాధ్యాయులు వెన్నుతట్టి ప్రోత్సహించే వారు. అలా పలు పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నాను. అనుకోకుండా కబడ్డీ ఆట ప్రారంభించాను. స్నేహితులతో కలిసి ఆడడంతో పలువురితో జట్టు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చారు. వారు ఇచ్చిన సహకారం, నిరంతర సాధనతో రాష్ట్రస్థాయి జట్టుకు అర్హత సాధించాం. జట్టులో నలుగురు మా పాఠశాలకు చెందిన వారే కావడంతో దూర ప్రాంతమైనా వెళ్లి పోటీల్లో పాల్గొన్నాం. మా గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారిణిగా ఎదగాలనేది నా లక్ష్యం.

ఆత్మవిశ్వాసంతో ముందడుగు..

జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన బాలికలతో ఏర్పాటు చేసిన జట్టులో చోటు దక్కించుకోవడం, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి వచ్చిన క్రీడాకారిణులతో కలిసి పోటీల్లో పాల్గొనడం ద్వారా నాలో ఆత్మవిశ్వాసం కలిగింది. గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో ఎన్‌సీసీ, స్కౌట్స్‌అండ్‌గైడ్స్‌ బృందాలు ఉన్నాయి. పలువురు ప్రముఖులు వచ్చి ఇచ్చే ఉపన్యాసాలు కూడా ధైర్యాన్ని పెంపొందించాయి. ఆ స్ఫూర్తితోనే వివిధ పోటీల్లో పాల్గొంటున్నాం. కబడ్డీతోపాటు ఖోఖోలో కూడా ప్రావీణ్యం ఉంది. అలా ఎక్కడ పోటీలు నిర్వహించినా రెండువిభాగాల్లోనూ పోటీపడుతుంటాను. రాష్ట్రస్థాయి పోటీల్లో మాజట్టు తృతీయస్థానం సాధించినా ఆస్థాయి పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. - బి.కల్యాణి మధుశ్రీ,

స్నేహితులతో కలిసి: పి.ప్రవీణ

ప్రాథమిక స్థాయి నుంచే స్నేహితులతో కలిసి వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనేదాన్ని. హైస్కూల్‌కు వచ్చిన తరువాత వ్యాయామ ఉపాధ్యాయులు ఖోఖో, కబడ్డీలో ప్రతిభ చాటుకుంటున్నట్లు గ్రహించి ఆ ఆటల్లో ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. రోజూ సాధన చేయించడంతోపాటు మమ్మల్ని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే పోటీలకు తీసుకెళ్లడంతో విజయం సాధించాలన్న సంకల్పం ఏర్పడింది. రాష్ట్రస్థాయి జట్టులో చోటుదక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించి క్రీడాకోటాలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని