logo

ప్రయోగశాలల ప్రారంభోత్సవంలో అపశ్రుతి

కృష్ణా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీల్యాబ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జెండాలు కడుతూ సెక్యూరిటీగార్డ్‌గా పనిచేస్తున్న ఎస్‌.షణ్ముఖ్‌(23) (అవివాహితుడు) ప్రమాదవశాత్తు

Published : 29 Jan 2022 01:39 IST

కృష్ణా వర్సిటీలో విద్యుదాఘాతంతో సెక్యూరిటీ గార్డ్‌ మృతి

న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్థుల ఆందోళన

వర్సిటీ వద్ద ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, రుద్రవరం గ్రామస్థులు

కృష్ణా విశ్వవిద్యాలయం (మచిలీపట్నం), న్యూస్‌టుడే : కృష్ణా విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీల్యాబ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జెండాలు కడుతూ సెక్యూరిటీగార్డ్‌గా పనిచేస్తున్న ఎస్‌.షణ్ముఖ్‌(23) (అవివాహితుడు) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాదం జరిగిన వెంటనే విశ్వవిద్యాలయం వారు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, అతని స్వగ్రామమైన రుద్రవరం ప్రజలు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో విశ్వవిద్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకపోవడమే కాకుండా ఎవరూ లేకుండా అంబులెన్స్‌లో కేవలం మృతదేహాన్ని ఇంటింకి పంపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, ఎస్సీ సంఘాల నాయకులు పెక్కుసంఖ్యలో అక్కడికి తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. వర్సిటీ అధికారులు లోపలే ఉన్నారని, వారంతా బయటకు రావాలని నినదిస్తూ లోపలికి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి...అధికారులు బయటకువచ్చి సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.

ఉపకులపతి, రిజిస్ట్రార్‌తో చర్చలు

ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు ఆందోళన కొనసాగింది. అనంతరం మృతుని కుటుంబ సభ్యులు, దళిత జేఏసీ నాయకులు, పలువురు ప్రముఖులు విశ్వవిద్యాలయానికి వెళ్లి సీఐలు వీరయ్యగౌడ్‌, భీమరాజు, తహసీల్దారు సునీల్‌బాబు సమక్షంలో ఉపకులపతి కె.బి చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ రామిరెడ్డిలతో చర్చలు జరిపారు. మృతదేహం వెంట విశ్వవిద్యాలయం నుంచి ఎవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించగా ప్రమాదం జరిగిన వెంటనే షుణ్ముక్‌ను ఆసుపత్రికి తామే తీసుకుని వెళ్లామని, చనిపోయాడని తెలుసుకున్న తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చి జిల్లా ఆసుపత్రికి వెళ్లి వేచిచూస్తుండగా అంబులెన్స్‌ ఇంటికి వెళ్లినట్లు తెలిసిందని, ఉపకులపతి, రిజిస్ట్రార్‌లు సమాధానం ఇచ్చారు. విశ్వవిద్యాలయంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడం చాలా బాధగా ఉందని, అతని కుటుంబానికి పూర్తిన్యాయం చేస్తామని చెప్పారు. వివిధఅంశాల వారీగా చర్చించిన అనంతరం మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు వారు అడిగిన పరిహారాన్ని ఇచ్చేందుకు అంగీకరించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఉపకులపతి, రిజిస్ట్రార్‌తో చర్చిస్తున్న నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు

షణ్ముఖ్‌ (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని