logo

ఆరోగ్య కేంద్రం... వైద్యానికి దూరం!

‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ)ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు

Published : 19 May 2022 02:56 IST

అరకొరగానే శస్త్రచికిత్సలు, ప్రసవాలు

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో ఇదే పరిస్థితి

ఈనాడు, అమరావతి

జగ్గయ్యపేట సీహెచ్‌సీకి కాన్పు కోసం వచ్చిన గర్భిణులు

‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ)ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు పీహెచ్‌సీల్లోనే అత్యధికంగా జరుగుతుండేవి. కానీ.. గత రెండు మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పీహెచ్‌సీల్లో సరైన పరికరాలు, సౌకర్యాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా ఉంటుండడంతో శస్త్రచికిత్సలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. పీహెచ్‌సీలకు వచ్చే కేసుల్లో చాలావాటిని విజయవాడ, మచిలీపట్నం ఆసుపత్రులకు వెళ్లాలని పంపించేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 90 పీహెచ్‌సీలుండగా.. వాటిలో ప్రస్తుతం ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో 80వరకు ఉన్నాయి. నూజివీడు ప్రాంతంలో ఉన్నవి ఏలూరులో కలిసిపోయాయి. చాలా పీహెచ్‌సీల్లో సరైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వచ్చిన వారిని వచ్చినట్టే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిపోమంటూ సూచిస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు కూడా గుడివాడ ఏరియా ఆసుపత్రి లేదంటే దగ్గరిలో ఉన్న సీహెచ్‌సీలకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు. అందుకే.. సీహెచ్‌సీల్లో మాత్రమే ప్రస్తుతం ప్రసవాలు, కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 11 సీహెచ్‌సీలున్నాయి. వీటిలో మాత్రం శస్త్రచికిత్సలు ప్రస్తుతం చేస్తున్నారు. తాజాగా జగ్గయ్యపేట సీహెచ్‌సీలో అన్నీ కలిపి.. మార్చిలో 58, ఏప్రిల్‌లో 46 శస్త్రచికిత్సలు చేశారు. పీహెచ్‌సీల్లోనూ ఇదే విధంగా ఏర్పాట్లు చేస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు మేలు జరుగుతుంది.

క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉన్నా..

చాలాచోట్ల ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరేసి వైద్యులు ఉన్నారు. ఉదయం ఓపీ చూడాలి. మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలి. స్థానికంగా ఉండే గర్భిణులు, రోగులకు క్షేత్రస్థాయిలోనికి వెళ్లి సేవలు అందించాలి. ప్రస్తుతం చాలావరకూ వైద్యులు ఎవరూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం లేదు.

ఆసక్తి ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వాలి..

రెండు జిల్లాల్లో 15 నుంచి 20మంది వరకూ సీనియర్‌ వైద్యులున్నారు. వీరున్నచోట కూడా ప్రస్తుతం శస్త్రచికిత్సలు అరకొరగానే చేస్తున్నారు. వైద్య పరికరాలు సరిగా లేవని చెబుతున్నారు. మిగతా అన్నిచోట్లా జూనియర్‌ వైద్యులున్నారు. వీరిలో ఆసక్తి ఉన్న కనీసం ఓ 30 నుంచి 40మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తే.. శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుంటుంది. మండలానికి కనీసం ఓ కేంద్రంలోనైనా ఆపరేషన్‌ థియేటర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోనికి తేవాలి.

పదేళ్ల కిందట ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పీహెచ్‌సీల్లో ఆపరేషన్‌ థియేటర్లను రూ.లక్షలు ఖర్చుపెట్టి సిద్ధం చేయించారు. ఒక్కో పీహెచ్‌సీకి రూ.3 లక్షల వరకూ ఖర్చుపెట్టి బాగు చేయించారు. దాతలు, ప్రభుత్వ నిధులతో ప్రతి మండలానికి ఒకటి రెండుచోట్ల ఆపరేషన్‌ థియేటర్లను సిద్ధం చేయించారు. వైద్యులు, అధికారులు బదిలీలపై వెళ్లిపోవడంతో క్రమంగా అవి పాడైపోయాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించి ఇక్కడ శస్త్రచికిత్సలు తప్పనిసరిగా చేసేలా అధికారులు ఏర్పాటు చేస్తే గ్రామీణులకు ప్రయోజనకరం.

24 గంటలూ పనిచేయాల్సి ఉండగా..

పీహెచ్‌సీలన్నీ ప్రస్తుతం 24గంటలూ పనిచేయాల్సి ఉంది. ఏ సమయంలో రోగులు వచ్చినా వైద్య సేవలు అందించాలి. కానీ.. 90శాతం పీహెచ్‌సీల్లో రాత్రి 9గంటల తర్వాత వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళ రోగులు వచ్చినా చూసేందుకు ఎవరూ ఉండడం లేదు. కొన్నిచోట్ల సిబ్బంది ఉంటున్నా.. రాత్రి వేళ వచ్చే వారిని విజయవాడ, మచిలీపట్నం తీసుకెళ్లాలంటూ సూచించడానికే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి.


ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో గత రెండేళ్లలో ఇలా..

(2022 ఫిబ్రవరి వరకు)

90 పీహెచ్‌సీల్లో ప్రసవాలు : 1067

12 సీహెచ్‌సీల్లో ప్రసవాలు : 4348

ఏరియా ఆసుపత్రుల్లో : 4999

విజయవాడ, మచిలీపట్నం ఆసుపత్రుల్లో : 26,592

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని