logo

బయట ఉంటే అంతే

అసలే పెరిగిన విద్యుత్తు బిల్లుల భారంతో అన్ని వర్గాలు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎత్తేస్తే.. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వర్గాలకు అండగా

Published : 19 May 2022 02:56 IST

ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు వినియోగదారులకు షాక్‌

ఈనాడు - అమరావతి

అసలే పెరిగిన విద్యుత్తు బిల్లుల భారంతో అన్ని వర్గాలు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎత్తేస్తే.. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వర్గాలకు అండగా ఉంటున్నామని చెబుతున్న ప్రభుత్వం.. వారికి విద్యుత్తు వినియోగంపై సబ్సిడీని మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకుంటే డబ్బు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం జారీ చేసిన ఉత్తర్వుకు అధికారులు పదును పెడుతున్నారు. ఆంక్షల పేరుతో రాయితీని కుదించేందుకు చకచకా పావులు కదుపుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రతినెలా లభించే విద్యుత్తు రాయితీ ప్రభుత్వం భరిస్తుంది. వారు వినియోగించుకున్న మొత్తాన్ని ప్రభుత్వం డిస్కమ్‌లకు సర్దుబాటు చేస్తుంది. ఆవాసాలు, కాలనీలు, తండాల్లో నివాసం ఉండే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకే రాయితీకి అర్హులంటూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఎక్కడా ఇది బయటకు పొక్కలేదు. కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు కేవలం వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యుత్తు శాఖ అధికారులకు అందజేస్తే రాయితీ వర్తించేది. కొత్త నిబంధనల కారణంగా కాలనీలు, తండాల్లో నివిసించే వారే అర్హులు. వేరే చోట నివాసం ఉంటూ 200 యూనిట్లలోపు వినియోగించుకున్నా సబ్సిడీ వర్తించదు. బిల్లును అందరిలా చెల్లించాల్సిందే. దీనిపై ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో సరైన వసతి లేక, ఇతర ప్రాంతంలో చిన్న ఇళ్లు కట్టుకున్నా.. అనర్హులుగా గుర్తిస్తారు. సెంట్రల్‌ డిస్కమ్‌ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో సుమారు 6.38 లక్షల మంది పైగా రాయితీ కారణంగా ప్రయోజనం పొందుతున్నారు. తాజా నిర్ణయం వల్ల చాలా మందిని అనర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారాన్ని దించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

రికవరీపై ఆందోళన

ప్రభుత్వం ఇప్పటికే ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సంబంధించి ఆధార్‌తో సహా అన్ని వివరాలను సేకరించి సాంఘిక సంక్షేమ శాఖలోని వివరాలతో ఆరు దశల వడపోత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఆధార్‌తో అనుసంధానమైన చాలా ఇళ్లు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవి కాదని తేలిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన రాయితీని తిరిగి రాబట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యుత్తు సహాయకులతో సర్వే చేయిస్తున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివాసం ఉండేవారికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఉచిత విద్యుత్తును వీరికే వర్తింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని