logo

కృష్ణా డెల్టాకు జూన్‌ 10 నుంచి సాగు నీరు

కృష్ణా డెల్టాలో మూడు పంటలకు అవకాశం కల్పించేలా జూన్‌ 10 నుంచి సాగునీరు విడుదల చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. కలెక్టరేట్‌

Published : 19 May 2022 03:14 IST

నీటిపారుదల సలహామండలి సమావేశంలో మంత్రి జోగి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్‌. వేదికపై కలెక్టర్‌ రంజిత్‌బాషా,

జేసీ మహేష్‌కుమార్‌, ఎమ్మెల్యే నాని, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక తదితరులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: కృష్ణా డెల్టాలో మూడు పంటలకు అవకాశం కల్పించేలా జూన్‌ 10 నుంచి సాగునీరు విడుదల చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్‌ రంజిత్‌బాషా అధ్యక్షతన నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులిచింతల రిజర్వాయర్‌లో 32.75 టీఎంసీలు, నాగార్జునసార్‌ ప్రాజెక్టు కింద 184 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టులో 35.81 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పులిచింతల రిజర్వాయర్‌ నుంచి జూన్‌ 10న నీరు విడుదల చేస్తారన్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు మొత్తం 146 టీఎంసీలు, తాగునీటి కోసం 4.18 టీఎంసీల అవసరం ఉంటుందన్నారు. 2022-23 సంవత్సరానికి ప్రధాన కాల్వల కింద 5.70 లక్షల ఎకరాలు ఆయకట్టు నిర్దేశించుకోగా అందులో 5.25 లక్షల ఎకరాలకు జూన్‌ 10 నుంచే సాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌(ఓ అండ్‌ ఎం) కింద 2021-22 సంవత్సరంలో చేపట్టిన పనులు సత్వరం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మరో రూ.48 కోట్ల పనులకు సల్పకాలిక టెండర్లు పిలిచి వెంటనే పనులు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, నీటి వినియోగదారుల సంఘ పరిధిలో రూ.87 కోట్లతో కాడా కమిటీ ఆమోదించిన తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, గేట్ల మరమ్మతులు వంటి పనులు పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు. సమావేశంలో పాల్గొన్న మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ ఇరిగేషన్‌ పనులకు ఉద్దేశపూర్వకంగా కొందరు టెండరు వేసి పనులు చేయకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అటువంటి వారికి సహకరిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్‌ రంజిత్‌బాషా, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, కేడీసీసీబీ ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, జేసీ మహేష్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ గోపాల్‌, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

రైతుకు ఏ ఇబ్బందీ రానీయకూడదు

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ప్రభుత్వ సిద్ధాంతానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని మంత్రి జోగి స్పష్టం చేశారు. వ్యవసాయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో ఆర్బీకేల ద్వారా ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు పంపిణీ చేస్తారన్నారు. రైతులు, మిల్లర్లు బాగుండాలని, ఎవరైనా మిల్లర్లు రైతులను నష్ట పెట్టాలని చూస్తే క్షమించేది లేదన్నారు. శానసభ్యుడు పేర్ని మాట్లాడుతూ ఈ-క్రాప్‌ నమోదు విషయంలో వ్యవసాయశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది రైతులు ఇబ్బందిపడాల్సి వచ్చిందనీ, రైతులకు ప్రత్యక్షంగా రశీదు ఇవ్వడం లేదని, వేసిన పంట ఒకటైతే నమోదు మరోటి చేశారని, ప్రభుత్వం వద్దన్న విత్తనాలు సైతం సాగుచేస్తే వాటిని మరోరకంగా నమోదు చేశారని చెబుతూ వ్యవసాయశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ ఈ-క్రాప్‌ నమోదు చేశాక తప్పనిసరిగా రైతుకు రశీదు ఇచ్చి, దాని కాపీని కార్యాలయంలో భద్రపర్చాలని చెప్పారు. రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కృష్ణాజీరావు, సలహా మండలి అధ్యక్షులు జన్ను రాఘవరావు, మండలి సభ్యుడు నాగేశ్వరరావు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సలహామండలి సభ్యులు రామచంద్రరావు, పెరుమాళ్లు, శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని