logo

ఉప తహసీల్దారు, వీఆర్వోలపై దాడి

పెనమలూరులోని ఓ రేషన్‌ దుకాణంలో మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న ఉప తహసీల్దారు, వీఆర్వోలపై పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు వచ్చి దాడి చేయడంతో

Updated : 19 May 2022 03:34 IST

8 మంది తెదేపా నాయకుల అరెస్టు

గాయపడిన విజయ్‌కుమార్‌

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరులోని ఓ రేషన్‌ దుకాణంలో మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న ఉప తహసీల్దారు, వీఆర్వోలపై పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు వచ్చి దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పెనమలూరుకు చెందిన లుక్కా అరుణ్‌కుమార్‌ స్థానికంగా రేషన్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. మంగళవారం రాత్రి అతని దుకాణంలో తనిఖీలు చేయడానికి ఉప తహసీల్దారు విజయకుమార్‌.. రెవెన్యూ అధికారులతో కలిసి వచ్చారు. సరకు నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించి కేసు నమోదు చేయడానికి నిర్ణయించారు. దీనికి మధ్యవర్తుల రిపోర్టును తయారు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో డీలర్‌ అరుణ్‌కుమార్‌ అక్కడ్నించే మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో బోడే ప్రసాద్‌ ఉప తహసీల్దారు విజయకుమార్‌తో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. ఆగ్రహించిన బోడే ప్రసాద్‌ పోరంకి, పెనమలూరులకు చెందిన తెదేపా నేతలు, కార్యకర్తలతో కలిసి కార్లు, ద్విచక్ర వాహనాలపై పెనమలూరులోని రేషన్‌ దుకాణానికి చేరుకున్నారు. బోడే దుకాణం వెలుపల కొద్ది దూరంలో నిలిచిపోగా వెంట వచ్చిన నేతలు, కార్యకర్తలు దుకాణంలోకి ప్రవేశించి ఉప తహసీల్దారు విజయకుమార్‌పై దాడికి దిగగా ఆయన కంటికి తీవ్రగాయమయ్యింది. విజయకుమార్‌పై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వీఆర్వో మంగరాజుపైనా వారు దాడి చేయడంతో ఆయనకీి గాయాలయ్యాయి.ఈ సంఘటనలో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో పోరంకికి చెందిన వంగూరి పవన్‌, కొల్లిపర ప్రమోద్‌కుమార్‌, బోడే మనోజ్‌, కాపరోతు వాసు, పెనమలూరుకు చెందిన దొంతగాని పుల్లేశ్వరరావు, చిగురుపాటి శ్రీనివాసరావు, కిలారు ప్రవీణ్‌కుమార్‌, కిలారు కిరణ్‌కుమార్‌లు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, మరికొందరు పరారీలో ఉన్నట్లు సీిఐ సత్యనారాయణ తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పరామర్శ: ఉప తహసీల్దారు విజయకుమార్‌ తాడిగడపలోని ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయన్ను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి బుధవారం పరామర్శించారు. దాడిని ఆయన ఖండించారు. మరోపక్క రేషన్‌ డీలర్‌ లుక్కా అరుణ్‌కుమార్‌కు పెనమలూరు మండల రేషన్‌డీలర్ల సంఘానికి ఎటువంటి సంబంధం లేదని సంఘ ప్రతినిధి సుధాకర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని