logo

ఉచిత బియ్యం ఊసేలేదు..!

పేదల కోసం కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ఈనెల కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి కన్పించడంలేదు. గడచిన నెలలోనూ ఇవ్వకుండా నిలిపివేసిన కోటాను మే నెలలో

Published : 20 May 2022 04:38 IST

12 లక్షల కార్డుదారుల ఎదురుచూపులు 

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: పేదల కోసం కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ఈనెల కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి కన్పించడంలేదు. గడచిన నెలలోనూ ఇవ్వకుండా నిలిపివేసిన కోటాను మే నెలలో పంపిణీ చేస్తారన్న ప్రచారం సాగినా ఆచరణకు నోచుకోవడంలేదు. దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అసలు బియ్యం ఇస్తారా ఇవ్వరా అనే అనుమానం ఉమ్మడి జిల్లాల్లో 12.20  లక్షల మంది కార్డుదారుల్లో వ్యక్తమవుతోంది.

కొవిడ్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద వర్గాలను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ప్రధాన మంత్రి గరీబ్‌ యోజన ద్వారా ఉచిత బియ్యం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చితో ఉచిత పథకం ముగియాల్సి ఉన్నా కేంద్రం మరో ఆరు నెలలు   పొడిగించింది. కిలో రూపాయి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న రేషన్‌బియ్యంతో పాటు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కూడా ప్రారంభంలో ఎండీయూ వాహనాల ద్వారా అందజేశారు. ఉచిత బియ్యం వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరిస్తున్నా ప్రజల్లో అందుకు తగ్గ ప్రచారం రావడం లేదన్న కారణంతో కొద్ది నెలలుగా ఉచిత బియ్యాన్ని ఏండీయూ వాహనాల ద్వారా కాకుండా రేషన్‌డిపోల నుంచే ఇవ్వాలని సూచించారు. అప్పటి నుంచి ప్రతి నెలా ముందు రెండు వారాల పాటు రేషన్‌ పంపిణీ పూర్తిచేసి మూడో వారం ప్రారంభం నుంచి చౌకడిపోల ద్వారా ఉచిత బియ్యాన్ని ఇస్తున్నారు. గడచిన మార్చి వరకూ ఎటువంటి అవాంతరం లేకుండా పంపిణీ సజావుగానే సాగినా ఏప్రిల్‌ నెల ఉచిత కోటాను ఇవ్వలేదు. 

విభజన నేపథ్యంలో..

జిల్లాల విభజన నేపధ్యంలో ఏప్రిల్‌ నెలలో సాంకేతిక కారణాలతో రేషన్‌ పంపిణీలో కొన్ని రోజులు ఆలస్యం అయ్యిందని అధికారులు చెప్పినా ఆ నెలకు సంబంధించి ఉచిత బియ్యాన్ని మాత్రం ఇవ్వలేదు. జిల్లాలో ఉన్న బియ్యం కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సభ్యునికి 5 కిలోల బియ్యం, సబ్సిడీ ధరపై కందిపప్పు వంటి నిత్యావసరాలను అందజేస్తోంది. ఏప్రిల్, మే నెలకు సంబంధించి కార్డుదారుల కోసం నెలకు దాదాపు 7,220 మెట్రిక్‌ టన్నుల చొప్పున బియ్యాన్ని డిపోలకు విడుదల చేసి పంపిణీ కూడా పూర్తి చేశారు. కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం కూడా అంతే పరిమాణంలో ఇవ్వాల్సి ఉంది. నెలలో మూడో వారం గడిచిపోతున్నా ఉచిత బియ్యం పంపిణీ ఊసే లేకపోవడంతో కార్డుదారులు రోజూ డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

నిల్వలు లేవు...

గత నెలతో కలిపి సుమారు 25వేలకు పైగా మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. ఆ మేరకు పౌరసరఫరాల శాఖ వద్ద నిల్వలు లేనట్లు తెలుస్తోంది. తగు నిల్వలు లేనప్పుడు కేంద్ర అనుమతితో ఎఫ్‌సీఐ వద్ద రాష్ట్రం బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేస్తే ఆ మొత్తాన్ని కేంద్రం తిరిగి రాష్ట్రానికి చెల్లిస్తుంది. కారణాలు ఏవైనా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇండెంట్‌ కూడా పెట్టలేదని తెలుస్తోంది. పంపిణీ చేయాల్సిన బియ్యం నిల్వ కేంద్రాలు కనీసం పది రోజుల ముందు చేరితే అక్కడ నుంచి డీలర్లకు వచ్చాక కార్డుదారులకు అందజేయాలి. మిగిలిన పది పన్నెండు రోజుల్లో ఇది సాధ్యపడే విషయం కాదు కాబట్టి ఈనెలా ఉచిత బియ్యం లేనట్టే అని కొందరు డిపో నిర్వాహకులు చెపుతున్నారు. 

ఎవరికి వారే...

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారే అన్నట్టుగా ఉండడంతో ఒక నెల సరఫరా నిలిచిపోగా ఈనెల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం కార్యక్రమాన్ని తరచూ వివిధ ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్న భాజపా నాయకులతో పాటు ఇతర విపక్ష నాయకులు సైతం ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇంకా నాలుగు నెలల పాటు ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యంపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న అనుమానం కార్డుదారులను పీడిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై జిల్లా పౌరసఫరాలశాఖ అధికారిణి పార్వతి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని