logo

పథకం ప్రకారమే అమరావతి విధ్వంసం

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పథకం ప్రకారమే అమరావతిని నాశనం చేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 20 May 2022 05:04 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

చుట్టుగుంట, న్యూస్‌టుడే : జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పథకం ప్రకారమే అమరావతిని నాశనం చేసిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీకి కల్పతరువు లాంటి అమరావతిపై కుట్ర చేశారన్నారు. రాజధానిని కట్టలేక, చేతకాక అమరావతిని విధ్వంసం చేశారన్నారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్, ఒక సామాజిక వర్గం వారు అంటూ ఎన్నో దుష్ప్రచారాలు చేశారన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా వంకర బుద్ధితో కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యే ఆర్కే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై ఫిర్యాదు చేశారని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. అసలు లేని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాలు ఎలా జరిగాయో చెప్పాలన్నారు. చంద్రబాబు దూరదృష్టితో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావించారన్నారు. సింగపూర్‌ ప్రభుత్వ సంస్థతో ప్లాన్‌ గీయించారన్నారు. కాగితాలకే పరిమితమైన రింగ్‌ రోడ్డులో.. అక్రమాలు ఎలా జరిగాయో చెప్పాలని ఉమా నిలదీశారు. ప్రతిపక్ష నాయకులమైన మాపై తప్పుడు కేసులు పెట్టినా ఏమీ పీకలేరన్నారు. వందలాదిగా తప్పుడు కేసులు పెట్టినా.. ఒక్కటైనా నిరూపించారా జగన్‌మోహన్‌రెడ్డి.. అని ప్రశ్నించారు. హైకోర్టుతో ఇన్నిసార్లు చివాట్లు తిన్న ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. జగన్‌ మాటలు నమ్మి గతంలో సీనియర్‌ అధికారి శ్రీలక్ష్మి వంటి వారు జైలుకెళ్లారన్నారు. ఇప్పుడు మరికొంత మంది వెళ్తున్నారని చెప్పారు. మద్యం, ఇసుక మాఫియాతో వేల కోట్లు దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగే.. దొంగ, దొంగ అన్నట్లుగా జగన్‌ తీరు ఉందన్నారు. ఈ వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రజల ముందుకు వెళుతున్న వైకాపా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. సమాధానాలు చెప్పలేక అక్కడి నుంచి పారిపోతున్నారన్నారు. పదో తరగతి పేపర్‌ లీక్‌ చేసి.. పరీక్ష నిర్వహించడం చేతకాని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని అన్నారు. వాళ్ల తప్పును కప్పిపుచ్చుకునేందుకే తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న బీసీకి రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో బీసీలు లేరా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. జగన్‌ పెట్టే అక్రమ కేసులకు భయపడమని, ప్రజల పక్షాన పోరాడతామన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు ఘంటా కృష్ణమోహన్, మాచర్ల గోపీనాథ్, గొట్టుముక్కల వెంకీ, గడ్డం రాజు, తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని