logo

వివాదాల రాజమార్గం

నవ్యాంధ్రకు తలమానికంగా ఉండేలా ఏపీఐఐసీ ఆదర్శ పారిశ్రామికవాడకు చేరుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాజమార్గ నిర్మాణానికి ఇంకా అవరోధాలు తప్పడం లేదు. నాలుగేళ్ల కిందట నిర్మించ తలపెట్టిన ఈ

Published : 20 May 2022 06:05 IST

మళ్లీ నిలిచిన మల్లవల్లి పారిశ్రామికవాడ రహదారి నిర్మాణం

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: నవ్యాంధ్రకు తలమానికంగా ఉండేలా ఏపీఐఐసీ ఆదర్శ పారిశ్రామికవాడకు చేరుకునేందుకు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాజమార్గ నిర్మాణానికి ఇంకా అవరోధాలు తప్పడం లేదు. నాలుగేళ్ల కిందట నిర్మించ తలపెట్టిన ఈ రహదారి నేటికీ కొలిక్కి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. భూసేకరణలో నెలకొన్న అడ్డంకులు తొలగించడంలో ఏపీఐఐసీ వర్గాలు పూర్తిగా సఫలీకృతం కాలేకపోవడంతో చివరి దశకు వచ్చిన తర్వాత కూడా రహదారి పనులు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తేనే పారిశ్రామికవాడకు రవాణా సౌకర్యం ఎంతో మెరుగవుతుందని తెలిసినా కూడా అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాపులపాడు మండలం మల్లవల్లిలో 1,260 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడ, వందెకరాల్లో నిర్మిస్తున్న ఆహార పార్కుకు చేరుకోవాలంటే మచిలీపట్నం-కల్లూరు జాతీయ రహదారి నుంచి మీర్జాపురం మీదుగా ఉన్న మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. ఇది రెండు గ్రామాలు, నివాసాల మీదుగా వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో రాకపోకలకు అంత అనువుగా లేదు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం-కల్లూరు రహదారి నుంచి నేరుగా పారిశ్రామికవాడకు చేరుకునేలా 150 అడుగుల వెడల్పుతో రాజమార్గం నిర్మించేలా ఏపీఐఐసీ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం నూజివీడు, బాపులపాడు మండలాల్లో అవసరమైన భూమిని సేకరించేందుకు 2018లోనే కార్యాచరణ చేపట్టినా, పరిహారం విషయంలో రైతులు, అధికారులకు ఏకాభిప్రాయం కుదరక 2021 వరకు పూర్తిగా భూ సేకరణ జరగలేదు. ఏడాది కిందటే ఈ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ రహదారి పనులు కొనసాగుతూనే ఉండటం గమనార్హం.

అడుగడుగునా అడ్డంకులే: కీలకమైన రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు దాదాపుగా రైతులంతా సానుకూలంగానే స్పందించినా, ధరపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. పోలవరం కుడి కాల్వ నిమిత్తం సేకరించిన భూమికి ఇచ్చినట్లు ఇవ్వాలనే డిమాండ్‌ రాజమార్గం కోసం భూములిస్తున్న రైతుల్నుంచి అప్పట్లో వ్యక్తమైంది. ఇక్కడ ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.6.50 లక్షలుగా ఉండగా, రైతుల డిమాండ్‌ మేరకు రూ.35 లక్షల చొప్పున ఇచ్చారు. 6.38 ఎకరాలకు సంబంధించి రైతులు ససేమిరా అనడంతో గతేడాది చివరి వరకు 900 మీటర్ల మేర రహదారి నిర్మాణం ఆగిపోవడం, రైతులు కోరిన విధంగా పరిహారం ఇవ్వడంతో సమస్యకు పరిష్కారమవ్వడం తెలిసిన విషయమే. తాజాగా భూ సేకరణ సమయంలో తన పొలంలో వ్యవసాయ బోరు కోల్పోవాల్సి రావడంతో, ఏపీఐఐసీ అధికారులు ప్రత్యామ్నాయంగా మరో బోరు నిర్మించి ఇస్తామని చెప్పారని, బోరు నిర్మించే వరకు తన పొలం పొడవునా రహదారి నిర్మించడానికి వీల్లేదంటూ ఓ రైతు అడ్డం తిరిగారు. దీంతో పనులు మళ్లీ స్తంభించాయి.

కార్యాచరణ మొదలైందిలా..
ప్రతిపాదిత రహదారి పొడవు - 3.9 కి.మీ.
వెడల్పు - 150 అడుగులు
అంచనా వ్యయం - రూ.15 కోట్లు
సేకరించిన భూమి- 39.98 ఎకరాలు
ప్రతిపాదనలు రూపొందించింది- 2018 మార్చి
భూ సేకరణకు శ్రీకారం - 2018 మే
టెండర్లు - 2020 డిసెంబరులో
పనులు ప్రారంభించింది- 2021 ఫిబ్రవరిలో

పారిశ్రామికవేత్తల అసంతృప్తి
ఇప్పటికే భూమి ధరల పెంపు, కేటాయించిన ప్లాట్ల రద్దు, మౌలిక వసతుల కల్పనలో జాప్యం కారణంగా పారిశ్రామికవేత్తలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికితోడు మూడేళ్ల కిందట అందుబాటులోకి రావాల్సిన కీలక రహదారిని నేటికీ పూర్తి చేయకపోవడంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటోందని వారు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు వద్దవ సంప్రదించగా సమస్యని పరిష్కరించి త్వరలోనే రహదారిని అందుబాటులోకి తెస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని