logo

రిజిస్ట్రేషన్లలో సవరణలు సరళీకృతం

భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం లేక వేలాదిమంది ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. కేవలం దస్తావేజులో ఉన్న చిన్న చిన్న తప్పుల కారణంగా బ్యాంకు, ఇతర తనఖా రుణాలు పొందలేక అవస్థలు

Updated : 24 May 2022 03:08 IST

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం లేక వేలాదిమంది ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. కేవలం దస్తావేజులో ఉన్న చిన్న చిన్న తప్పుల కారణంగా బ్యాంకు, ఇతర తనఖా రుణాలు పొందలేక అవస్థలు పడుతున్న విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు రిజిస్ట్రేషన్లలో తప్పుల సవరణను సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాచరణ చేపట్టింది.

పొలాలు, ఇళ్లు ఇలా ఏది కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్‌ తప్పని సరి. అలా రిజిస్ట్రేషన్‌ చేసే సమయంలో తయారు చేసే దస్తావేజులో వివరాలు నమోదులో ఒకోసారి తప్పులు దొర్లుతుంటాయి. సరిహద్దులు, భూమి విస్తీర్ణం, సర్వేసంఖ్యలు, క్రయ, విక్రయదారుల మధ్య జరిగిన ఒప్పంద తేదీలు.. వీటిలో ఎలాంటి తప్పుదొర్లినా సవరించుకోవడానికి అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. దస్తావేజును తనఖా పెట్టి బ్యాంకు రుణాలు పొందాలనుకున్నా పరిశీలనలో దొర్లిన తప్పుల కారణంగా బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. తప్పులు సవరిస్తేనే తదుపరి చర్యలు ఉంటాయంటూ వెనక్కి తిప్పి పంపుతున్నారు.మళ్లీ సవరించుకోవాలంటే భూమిని అమ్మిన వారు రాకపోవడం,  ఒక వేళ వచ్చినా మళ్లీ అదనంగా డబ్బులు అడగడం, కొందరు విదేశాల్లో ఉండటం ఇలా వివిధ కారణాలతో తప్పులు సవరించుకోలేక జిల్లాలో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏటా 10 నుంచి 20వేల వరకు రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటాయి. అవనిగడ్డ, చల్లపల్లి, గుడివాడ, మొవ్వ, పామర్రు, పెడన, కవుతరం ఇలా జిల్లాలో 13 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కలిపి సగటున 70వేల వరకు వివిధ రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలో తప్పుల సవరణకు ఎదురు చూస్తున్నవారు వేలసంఖ్యలో ఉన్నారు.


జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం

వ్యక్తిగత అఫిడవిట్‌తో..

భూములకు సంబంధించిన సర్వేసంఖ్య, సరిహద్దులు, తేదీల్లో సహా కొన్ని పొరపాట్లు రిజిస్ట్రేషన్‌ పత్రంలో నమోదైతే వాటిని వ్యక్తిగత అఫిడవిట్‌తో సవరించుకుని కొత్త రిజిస్ట్రేషన్‌ పత్రం పొందడానికి అవకాశం కల్పించారు. తాజాగా సవరించిన ఉత్తర్వుల ప్రకారం అనేకమందికి ఊరట లభించింది. ఎన్నో ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేసిన విక్రయదారులు అందుబాటులో లేకపోయినా, మరణించినా లేక వారి చిరునామా తెలియకపోయినా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భూమి కొనుగోలు దారులే దొర్లిన తప్పులు, వాస్తవ వివరాలు తెలియజేస్తూ తగు విధంగా అఫిడవిట్‌ సమర్పిస్తే చాలు ఆమేరకు రిజిస్ట్రేషన్‌శాఖ పరిశీలించి రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేసి కొత్త రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని జారీ చేస్తుంది. పాత దస్తావేజుల్లో తప్పులను సవరించుకోవడంతోపాటు హద్దులు, స్థల విస్తీర్ణంలోనూ  మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అసలు భూమి విక్రయించిన వ్యక్తి లేకుండానే సవరణలు చేసుకోవడానికి మార్గం సుగమమయ్యింది. నిర్దేశించిన అంశాల వరకు మాత్రమే సవరించుకోవాలి. ఇదే అవకాశంగా భావించి ఎవరైనా  ఇష్టానుసారంగా సర్వే సంఖ్యలు మార్చేసి అవకతవకలకు పాల్పడితే మాత్రం చట్టపర చర్యలు తీసుకుంటారు. దానికి రిజిస్ట్రార్లే బాధ్యత వహించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూవివాదాలు ఎక్కువగా ఉన్న సమయంలో వెలువడిన ఈ  ఉత్తర్వులు బాధితులకు కొంత ఊరట ఇస్తుంది.


వినియోగించుకోవాలి:  ఉపేంద్రరావు, జిల్లా రిజిస్ట్రార్‌
రిజిస్ట్రేషన్లలో జరిగిన తప్పులను సవరించుకోవడానికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా భూమి విక్రయించినవారు అందుబాటులో లేక, ఆ వ్యక్తి మరణిస్తే వారసులు ఎక్కడున్నారో తెలియక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారందరికీ ఇది మంచి అవకాశం. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం.  ఎక్కువగా భూమి విస్తీర్ణం సమస్యలతో సవరణలకోసం తిరుగుతున్నారు. దస్తావేజులో తక్కువగా ఉంటే క్షేత్రస్థాయిలో విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ సంబంధిత వ్యక్తి వాస్తవిక పత్రాలు అందించి తనే సవరించుకోవచ్చు. దీనిపై అవగాహన కల్పించాలని జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు