logo

ఆరోగ్యం రంగు చూసి మురవొద్దు.. మరవొద్దు

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్‌ కావడంతో వివిధ రకాలు మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. వాటిలో మంచి రంగుతో నిగనిగలాడేవాటిని కొనేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రంగుచూసి కొంటే అనారోగ్యం కొని

Updated : 24 May 2022 06:47 IST

న్యూస్‌టుడే, తోట్లవల్లూరు

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్‌ కావడంతో వివిధ రకాలు మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. వాటిలో మంచి రంగుతో నిగనిగలాడేవాటిని కొనేందుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రంగుచూసి కొంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లేనని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. మంచి రంగు కోసం వ్యాపారులు మామిడిని మాగబెట్టేందుకు నిషేధిత రసాయనాలు వినియోగిస్తున్నారని.. వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో మాగబెట్టినవాటినే కొనాలని, లేకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారంటున్నారు.

కృష్ణా జిల్లాలో సుమారు 6 వేల హెక్టార్లల్లో, ఎన్‌టీఆర్‌ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. హెక్టారుకు సగటున 6 టన్నులకుపైగా దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది ఆలస్యంగా పూత రావడం, ఇతరత్రా కారణాల వల్ల దిగుబడి 4 టన్నులకు పడిపోయింది. ముందుగా అందివచ్చిన కాయలను కొనుగోలుచేసి పండించి విక్రయిస్తే అధిక ధరలు వస్తాయనే భావంతో ప్రమాదకరమైన రసాయనాలు వినియోగించి కొందరు మామిడి కాయలను మంచి రంగుతో తళతళలాడిస్తున్నారు. ప్రస్తుతం డజను కాయలు రకాన్ని బట్టి రూ.250 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు.

సంప్రదాయ పద్ధతులు మేలు 

మామిడి కాయలు మాగబెట్టేందుకు సంప్రదాయ విధానమే మంచిది. ఒక గదిలో మూడు వందల కాయలు పెట్టి మిగిలిన ప్రాంతంలో గాలి వెళ్లేందుకు అవకాశం కల్పించి మాగబెట్టడం శ్రేయస్కరం. దీంతోపాటు ఇథిలిన్‌ను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించేందుకు అనుమతులిచ్చారు. 400 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్‌ను, పైపులను ఉపయోగించి క్యూబ్‌ను తయారు చేసుకుని వాటిలో ఇథిలిన్‌ పంపి మాగబెట్టడం కాస్త మంచిదని ఉద్యానశాఖాధికారులు సూచిస్తున్నారు.

అవయవాలపై తీవ్ర ప్రభావం 

మామిడి కాయలు మాగబెట్టేందుకు వ్యాపారులు, రైతులు కాల్షియం కార్బైడ్‌ వాడితే దాని నుంచి వెలువడే ఎసిటిలిన్‌ వాయువులో పాస్సిన్‌, అర్సిన్‌ అనే వాయువులు కలిగి ఉండటం వల్ల ఆ పండ్లను తిన్నవారికి క్యాన్సర్‌ సోకే ప్రమాదం ఉంది. ఎసిటిలిన్‌ వాయువు మనిషి నాడీవ్యవస్థ, ఇతర అవయవాలపై ప్రభావం చూపించి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపక శక్తిని కోల్పోవడం తదితర అనారోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుందని అధికారులు చెపుతున్నారు. దీంతో ఈ రసాయనాన్ని మామిడి మాగ బెట్టేందుకు ప్రభుత్వం నిషేధించింది. ఈ విధానానికి పాల్పడినవారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ, ఉద్యాన శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.


నిబంధనలు పాటించకుంటే చర్యలు

- జి.లక్‌పతి, ఉద్యానశాఖ అధికారి 

మామిడి మాగబెట్టడంలో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని రైతులకు, వ్యాపారులకు తెలియజేశాం. తోటబడి కార్యక్రమంలో కాయలను మాగబెట్టే విధానంపై రైతులకు అవగాహన కల్పించాం. కాల్షియం కార్బైడ్‌ వినియోగిస్తున్న వారిపై సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని