logo

డౌన్‌లోడ్‌ చేశారంటే.. అంతే!

ఇతరుల రెక్కల కష్టాన్ని నేరగాళ్లు సులువుగా దోచేస్తున్నారు. వారి ఎత్తుగడలను బాధితులు తెలుసుకుని జాగ్రత్తపడే లోపే బురిడీ కొట్టిస్తున్నారు. ఫలితంగా నిరక్షరాస్యుల నుంచి విద్యావంతుల వరకు తేలికగా

Updated : 24 May 2022 09:32 IST

స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌తో మోసాలు
ఖాతాలు లూటీ చేస్తున్న కేటుగాళ్లు
ఈనాడు - అమరావతి

తరుల రెక్కల కష్టాన్ని నేరగాళ్లు సులువుగా దోచేస్తున్నారు. వారి ఎత్తుగడలను బాధితులు తెలుసుకుని జాగ్రత్తపడే లోపే బురిడీ కొట్టిస్తున్నారు. ఫలితంగా నిరక్షరాస్యుల నుంచి విద్యావంతుల వరకు తేలికగా మోసపోతున్నారు. తమ ఖాతాల్లోంచి డబ్బు పోతే కానీ వారికి విషయం తెలియడం లేదు. స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ పేరుతో ఇట్టే గాలం వేసి, అందినకాడికి డబ్బు లాగేస్తున్నారు. సాయం చేస్తామని నమ్మించి ఈ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయించి, ఆనక విలువైన సమాచారాన్ని తస్కరించి, డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో నమోదు అవుతున్నాయి.

కేవైసీ పేరు చెప్పి.. రూ. 3.03 లక్షలు లూటీ
విజయవాడ పటమటలంక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు సంక్షిప్త సందేశం వచ్చింది. మీ సిమ్‌కు సంబంధించి పత్రాల పరిశీలన ఇంకా పూర్తి కాలేదని, త్వరగా ముగించాలని, లేనిపక్షంలో 24 గంటల్లో సిమ్‌ పనిచేయడం ఆగిపోతుందని అందులో ఉంది. మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. తాను కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. కేవైసీ డాక్యుమెంట్‌ పెండింగ్‌ ఉందని, పూర్తి చేయడానికి తాను సాయం చేస్తానని, ఇందుకు గాను ఎనీ డెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించడంతో అలాగే చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి సూచించిన విధంగా ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ. 10 ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీ నిర్వహించాడు. ఈ మొత్తం జమకాలేదని చెప్పడంతో మళ్లీ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ. 10 బదిలీ చేశాడు. రెండు రోజుల తర్వాత బాధితుడికి ఫోన్‌ చేసి, ఇంకో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పడంతో.. అలాగే చేశాడు. 20 నిమిషాల తర్వాత.. నగదు లావాదేవీలు జరిగినట్లు చాలా ఎస్‌ఎమ్‌ఎస్‌లు వచ్చాయి. రూ. 1.86 లక్షలు, రూ. 77 వేలు, రూ. 40,760 చొప్పున మొత్తం రూ. 3,03,760 మేర గుర్తు తెలియని వ్యక్తి లూటీ చేసేశాడు. ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.

ఎదుటి వ్యక్తికి చెందిన మొబైల్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ల్లో సాఫ్ట్‌వేర్‌, ఇతర సమస్యల పరిష్కారం కోసం స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ను ఉపయోగిస్తుంటారు. సంబంధిత పరికరంలో ఇటువంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని, డెస్క్‌ ఐడీని అవతలి వ్యక్తికి చెప్తే చాలు.. ఇక నియంత్రణ అంతా వారి చేతికి వెళ్తుంది. తెరపై మనం చేసే పనులన్నీ అవతలి వ్యక్తి చూసే అవకాశం ఉంది.

రిమోట్‌ స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ను తమ మోసాలకు సాధనాలుగా సైబర్‌ నేరస్థులు ఉపయోగిస్తున్నారు. వీటిని ఎంచుకున్న వారి మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయించి, బాధితులు తమ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే సమయంలో టైప్‌ చేసే ఐడీ, పాస్‌వర్డ్‌లను చూస్తున్నారు. వీటి ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దశలవారీగా బదిలీ చేస్తున్నారు. యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయించేందుకు అనేక రకాలుగా నమ్మిస్తుంటారు. ఇందుకు గాను తాము సాయం చేస్తామంటూ నమ్మించి కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు.

జాగ్రత్తలు అవసరం
గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను విశ్వసించవద్దు. రిమోట్‌ స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌కు సంబంధించి ఐడీ వివరాలు అపరిచితులకు ఇవ్వడం మంచిది కాదు.
ఎవరైనా ఫోన్‌ చేసి, ఫలానా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని ఒత్తిడి తెస్తే పట్టించుకోవద్దు. అధీకృత వినియోగదారుల సేవా సిబ్బంది ఎవరూ వీటిపై ఒత్తిడి చేయరని గమనించాలి.
అపరిచిత వ్యక్తుల నుంచి మనకు వచ్చే లింక్స్‌ను క్లిక్‌ చేయకపోవడమే శ్రేయస్కరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని