logo

విహారంలో విషాదం

 కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో బీఫార్మసీ విద్యార్థినులు ఇరువురు దుర్మరణం పాలైన సంఘటన రెండు కుటుంబాలకు అంతులేని శోకాన్ని

Published : 24 May 2022 03:28 IST

బీచ్‌లో ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే:  కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో బీఫార్మసీ విద్యార్థినులు ఇరువురు దుర్మరణం పాలైన సంఘటన రెండు కుటుంబాలకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు పరాసుపేటకు చెందిన కె.పూజిత(22) భీమవరంలోని విష్ణు కళాశాలలో ఇటీవలే బీఫార్మసీ పూర్తి చేసింది. ఆమెతో పాటు బీఫార్మసీ పూర్తి చేసిన భీమవరానికి సమీపంలోని పిప్పర గ్రామానికి చెందిన ప్రమీలారాణి జాస్మిన్‌(22), గరగపల్లి గ్రామానికి చెందిన డి.ఆశాజ్యోతి రెండు రోజుల క్రితం సరదాగా మచిలీపట్నంలోని పూజిత ఇంటికి వచ్చారు. ముగ్గురూ సోమవారం ఉదయం 10గంటల సమయంలో మంగినపూడి బీచ్‌లో స్నానాలు చేసేందుకు వెళ్లారు. స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురూ లోపలికి కొట్టుకుపోతుండడంతో స్థానికులు గమనించి వారిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కొనఊపిరితో ఉన్న పూజిత, ప్రమీలారాణి జాస్మిన్‌లకు ప్రాథమిక చికిత్స అందించేలోపే మృతిచెందారు. ఆశాజ్యోతి కోలుకుంది. అప్పటివరకూ తనతో సరదాగా గడిపిన స్నేహితురాళ్లు ఇరువురూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి కన్నీరు మున్నీరుగా ఆమె విలపించింది. సమాచారం తెలుసుకున్న ప్రమీలారాణి జాస్మిన్‌ తల్లిదండ్రులు మచిలీపట్నం చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించిన తమ కుమార్తెలను విగతజీవులుగా చూడలేక రెండు కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. వారి వేదన చూపరుల హృదయాలను కలిచివేసింది. కళ్లెదుటే చోటుచేసుకున్న హృదయవిదారక ఘటనతో చలించిపోయిన  సందర్శకులు ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే తక్షణ వైద్య సాయం అందించే ఏర్పాట్లు బీచ్‌వద్ద చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తాలూకా ఎస్సై వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.  


ఉద్యోగంలో చేరకుండానే..

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: చేతికందివచ్చిన ముగ్గురు బిడ్డల్లో ఒకరు పదిరోజుల్లో ఉద్యోగంలో చేరతారని సంతోషిస్తున్న సమయంలో  ఆ కుటుంబాన్ని విషాదం కమ్ముకుంది. బందరు మండల పరిధిలోని ఆర్‌గొల్లపాలెంకు చెందిన మాజీ సర్పంచి కుమారుడు శ్రీకృష్ణవరప్రసాద్‌ వ్యవసాయం చేసుకుంటూ మచిలీపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తెకు వివాహం చేయగా రెండో కుమార్తె భీమవరం విష్ణు కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసింది. కుమారుడు విశాఖలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ప్రాంగణ ఎంపికలో  చెన్నైలోని ఓ బహుళజాతి మందుల కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్న పూజిత మరో పదిరోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ లోపే విధి వక్రించింది. మరో పది రోజుల్లో ఉద్యోగానికి వెళ్లిపోతోందన్న ఆనందంలో ఉన్న వారు విగతజీవిగా మారిన పూజితను చూసి తట్టుకోలేకపోయారు. పూజిత అంత్యక్రియలు మంగళవారం వారి స్వగ్రామంలో నిర్వహిస్తారని మృతురాలి బంధువులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని