logo

అంబులెన్స్‌ రాకుంటే... డయాలసిస్‌కు వెళ్లేదెలా..?

‘చీమలపాడు పెద్దతండాకు చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు రాంబాబు డయాలసిస్‌ చేయించుకునేందుకు వారానికోసారి నూజివీడు వెళ్లాల్సి ఉంటుంది. 108కి ఫోన్‌ చేస్తే ఒకసారి వస్తుంది.. మరోసారి రావడం లేదు. దీంతో ఆయన కుమారుడు ద్విచక్రవాహనంపై తండ్రిని

Published : 26 May 2022 05:10 IST
స్పందించని ప్రజాప్రతినిధులు, అధికారులు
ఎ.కొండూరు కిడ్నీ బాధితుల వెతలు
ఈనాడు, అమరావతి

‘చీమలపాడు పెద్దతండాకు చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు రాంబాబు డయాలసిస్‌ చేయించుకునేందుకు వారానికోసారి నూజివీడు వెళ్లాల్సి ఉంటుంది. 108కి ఫోన్‌ చేస్తే ఒకసారి వస్తుంది.. మరోసారి రావడం లేదు. దీంతో ఆయన కుమారుడు ద్విచక్రవాహనంపై తండ్రిని నూజివీడు తీసుకెళ్లి డయాలసిస్‌ చేయించి తీసుకొస్తున్నారు. ఇప్పటికే వ్యాధి చికిత్స కోసం వారు రెండెకరాల పొలం అమ్ముకున్నారు. ప్రస్తుతం డయాలసిస్‌ చేసే సమయంలో రూ.2 వేల ఇంజక్షన్‌ బయట కొనుక్కుకుంటున్నారు. దీనికే నెలకు రూ.8వేలు ఖర్చవుతోంది. మందులకు మరో రూ.8 వేల వరకూ అవుతోంది. ప్రైవేటు వాహనం బుక్‌ చేసుకుని వెళితే ప్రతిసారీ కనీసం రూ.1500 పైనే అవుతోంది. దీంతో వారు ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తున్నారు. మరోవైపు ఈయనకు రూ.10 వేల పింఛను కూడా రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు’

న్టీఆర్‌ జిల్లాలోని ఎ.కొండూరు కిడ్నీ బాధితులు అత్యవసర సమయంలో, డయాలసిస్‌ చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లాల్సిన సమయంలో అంబులెన్స్‌లు అందుబాటులో ఉండకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్లుగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండాల్లో ఉండే డయాలసిస్‌ బాధితులు వారానికోసారి తప్పనిసరిగా నూజివీడు, విజయవాడ ఆసుపత్రులకు వెళ్లాలి. దీంతో రవాణా ఖర్చులే భారీగా అవుతున్నాయంటూ బాధితులు చాలా కాలంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలల కిందట అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఎ.కొండూరు సమస్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వెంటనే ప్రత్యేకంగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేయిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ హైమావతి కిడ్నీ బాధిత తండాలను పరిశీలించారు. అంబులెన్స్‌ల సమస్యను ఆమె దృష్టికి కూడా స్థానికులు తీసుకెళ్లారు. ఇప్పటివరకూ ఎవరూ స్పందించ లేదు. అధికారులు రావడం.. హడావుడి చేయడం.. వెళ్లడం తప్ప ప్రయోజనం ఏమీ లేదంటూ బాధితులు వాపోతున్నారు.

గతంలో ప్రైవేటు కార్లు పెట్టారు..

గత తెదేపా ప్రభుత్వ హయాంలోనూ ఇదే సమస్య ఉండగా.. స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో ప్రత్యేకంగా ప్రైవేటు కార్లను డయాలసిస్‌ బాధితుల కోసం ఏర్పాటు చేయించింది. ఒక్కో తండాకు ఒక రోజు కేటాయించేవారు. ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి గ్రామానికి తీసుకొచ్చేవారు. ప్రభుత్వం మారగానే.. ఈ కార్లను ఆపేశారు. దీనిపై అడిగితే.. ప్రభుత్వం రూ.10 వేల పింఛన్‌ ఇస్తోంది కదా.. అంటూ నాయకులు, అధికారులు అంటున్నారంటూ బాధితులు వాపోతున్నారు. గతంలోనూ రూ.10వేలు పింఛన్‌ ఇచ్చేవారని, దాంతో పాటు కార్లు పెట్టారని పలువురు పేర్కొంటున్నారు. అప్పట్లో ట్యాంకులతో కృష్ణా జలాలను కూడా తండాలకు తెచ్చి అందించేవారని, ప్రస్తుతం వాటిని కూడా ఆపేశారని స్థానికులు తెలిపారు. ప్లాంట్ల ద్వారా శుద్ధిజలాలు అందిస్తున్నామంటూ చెబుతున్నా.. వాటిలోనూ కలుషితాలు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు. బాధితులు చనిపోతే మట్టి ఖర్చులకు రూ.10 వేలనూ కొంతమందికి ఇస్తే.. కొందరికి ఇవ్వడం లేదు.


.కొండూరు మండలానికి చెందిన 108 వాహనం ఇతర రోగులనూ ఆస్పత్రులకు తరలించాల్సి రావడంతో కిడ్నీ బాధితులను డయాలసిస్‌కు తీసుకెళ్లేందుకు ఎప్పుడో కాని అందుబాటులో ఉండడం లేదు. బాధితులు ఫోన్లు చేస్తే.. పంపిస్తామంటూ కాల్‌సెంటర్‌ నుంచి చెబుతున్నారు. కానీ.. ఎంత వేచి చూసినా రావడం లేదు. ఒకవేళ వచ్చినా.. బాధితులను తీసుకెళ్లి ఆసుపత్రిలో దించేసి వెళ్లిపోతున్నారు. తిరిగి వాళ్లు వెనక్కి వచ్చేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.


పోషకాహారమూ ఆపేశారు..

తంలో బాధితులకు ఇచ్చిన పోషకాహారం కూడా ప్రస్తుతం ఆపేశారు. చిక్కీలు, రేషన్‌ బియ్యానికి బదులుగా జొన్నలు, రాగులు, సజ్జలు ఇచ్చేవారు. స్థానికంగా ఉండే గిరిజనులు రొట్టెలు ఎక్కువగా తింటారు. ఇదే విషయంలో గతంలో లక్ష్మీకాంతం కలెక్టర్‌గా ఉన్న సమయంలో బాధితులు చెప్పగా.. అప్పటి నుంచి బియ్యానికి బదులుగా ఇవి కావాలనే వారికి అందజేశారు. ప్రస్తుతం ఏవీ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని