logo

పారిశుద్ధ్య కార్మికులకు అందని ఆరోగ్య భత్యం

పురపాలికల్లో పొరుగు సేవల విధానంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యభత్యాన్ని ఐదు నెలలుగా ప్రభుత్వం నిలిపివేసింది. కమిషనర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం ఉండడం లేదు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు

Updated : 26 May 2022 06:47 IST
ఐదు నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం
రెండు జిల్లాల్లో రూ.13.50 కోట్లు పెండింగ్‌
ఈనాడు - అమరావతి

పురపాలికల్లో పొరుగు సేవల విధానంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యభత్యాన్ని ఐదు నెలలుగా ప్రభుత్వం నిలిపివేసింది. కమిషనర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం ఉండడం లేదు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి జగన్‌ ఈ భత్యాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. వైద్య ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ లేక కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని నగరపాలిక, పురపాలికల్లో దాదాపు 4,500 మంది వరకు పారిశుద్ధ్య విధుల్లో నిమగ్నమవుతున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పొరుగుసేవల పద్ధతిలో పనిచేసే కార్మికులను ఆప్కాస్‌ కింద విధుల్లోకి తీసుకున్నారు. విజయవాడ నగరపాలికలో 3 వేలు, బందరు కార్పొరేషన్‌, పెడన, ఉయ్యూరు, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప, కొండపల్లి, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, పురపాలికల్లో మరో 1,500 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి 2020, ఆగస్టు నుంచి నెలనెలా ఆరోగ్య భత్యం కింద రూ.6 వేలు ఇస్తున్నారు. ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల దృష్ట్యా ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా జీతంతో పాటు భత్యాన్ని కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ ఠంఛనుగా ఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది కూడా ఇవ్వడం నిలిపివేశారు. గత ఐదు నెలలుగా రెండు జిల్లాల్లోని కార్మికులకు మొత్తం రూ.13.50 కోట్ల వరకు పెండింగ్‌ ఉంది. దీనికి సంబంధించి మున్సిపల్‌ కమిషనర్ల నుంచి ఆప్కాస్‌కు వివరాలు వెళ్లినా ఇంత వరకు మంజూరుకు నోచుకోలేదు. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించకపోవడంతోనే పెండింగ్‌లో పడినట్లు తెలిసింది.


అనారోగ్య సమస్యలతో సతమతం

క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వైద్య ఖర్చుల కింద అక్కరకొస్తాయని భావించిన వారికి నిరాశే మిగులుతోంది. దుమ్ము, ధూళిలో పనిచేయడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, తదితర వాటికి గురవుతున్నారు. ఒక్క వీఎంసీ పరిధిలోనే దాదాపు 120 మంది తీవ్ర అనారోగ్యానికి గురై, విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంత మంది చనిపోయారు. తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని కమిషనర్లకు అర్జీలు పెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇచ్చే జీతంలో తమ చేతికి వచ్చేది కేవలం 13 వేలు మాత్రమే అని, ఈ మొత్తాన్ని కుటుంబ పోషణ, వైద్యం కోసం వెచ్చించడం భారంగా మారిందని విజయవాడలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు విజయలక్ష్మి, వెంకటరమణమ్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలకు బతకడం కష్టంగా మారిందన కన్నీటిపర్యంతమవుతున్నారు.


హామీని విస్మరించిన ముఖ్యమంత్రి

- డేవిడ్‌, నగరపాలక ఉద్యోగులు, కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి, విజయవాడ

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు అనేక హామీలను ఇచ్చారు. పొరుగుసేవల సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అందేలా చూస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని మరిచారు. చివరకు ఆరోగ్య భత్యాన్ని కూడా ఇవ్వడం లేదు. దీని వల్ల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం సాగిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని