logo

AP News: గుడ్డ ముక్క పెట్టి కుట్లేశారు!

ప్రసవ వేదనతో వచ్చిన ఆ మహిళకు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. శస్త్రచికిత్స చేసిన భాగంలో రెండు నెలలైనా చీము వస్తూనే ఉండటంతో మూడుసార్లు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు పూర్తి స్థాయిలో వైద్యమందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Updated : 19 Jul 2021 09:20 IST

రెండు నెలలపాటు తల్లడిల్లిన బాధితురాలు


నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్‌ వార్డులో

చికిత్స పొందుతున్న బాలింతలు (పాత చిత్రం)

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: ప్రసవ వేదనతో వచ్చిన ఆ మహిళకు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. శస్త్రచికిత్స చేసిన భాగంలో రెండు నెలలైనా చీము వస్తూనే ఉండటంతో మూడుసార్లు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు పూర్తి స్థాయిలో వైద్యమందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా నరకయాతన పడ్డారు. చివరికి వైద్యులు స్పందించి పరీక్షలు చేసి కడుపులో ఓ గుడ్డ ముక్క ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఇలా బయట పడింది

నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నందిని అనే మహిళకు రెండు నెలల కింద శస్త్రచికిత్స చేయగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. శస్త్రచికిత్స (సిజేరియన్‌) చేసే సమయంలో ఎప్పటికప్పుడు రక్తం శుభ్రం చేసే గుడ్డ ముక్కను పొరబాటున లోపల పెట్టి కుట్లు వేశారు. ఆ బాలింతకు రెండు నెలలుగా కుట్ల వద్ద చీము కారుతోంది. ఎన్నిసార్లు ఆసుపత్రికి వచ్చినప్పటికీ వైద్యులు మామూలు ఇన్ఫెక్షన్‌ అని మందులిచ్చి పంపించారు. అయినప్పటికీ తగ్గలేదు. దీంతో ఆమె ఓ జనరల్‌ సర్జన్‌ వద్దకు వెళ్లారు. ఆయన వెంటనే స్కానింగ్‌ రాసి ఇచ్చారు. చివరికి స్కానింగ్‌లో అసలు విషయం బయటపడింది.

మళ్లీ శస్త్రచికిత్స చేసి..

కడుపులో గుడ్డ ముక్క ఉందనే విషయాన్ని సదరు వైద్యుడు ఆమెకు చెప్పకుండా గైనిక్‌వైద్యులు తెలిపారు. ఈ విషయం బయటకు రానీయకుండా ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు. కుట్ల వద్ద కోత పెట్టి రెండించుల మేర ఉన్న గుడ్డ ముక్కను తొలగించారు. ఏమీ కాదని, వారంలో తగ్గిపోతుందని పంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని