గురుపాద సేవకు శ్రీకారం
తితిదే తరహాలో కార్యక్రమం
మంత్రాలయం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులకు సేవ చేసుకొనేందుకు తిరుపతి తరహాలో ‘గురుపాద సేవ’కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లు ఉత్సవాల సమయాల్లోనే స్వామిసేవలో పాల్గొనే భక్తులు ఇక నుంచి నిత్యం సేలందించొచ్ఛు ఇందుకోసం బృందావనం గేట్‌కు ఎదురుగా ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించారు. బాధ్యుడిగా విశ్రాంత అధ్యాపకుడు హరిస్వామిని నియమించారు. రాఘవేంద్ర స్వామికి మొక్కులో భాగంగా మఠంలో శుభ్రత పనులు, భోజనాలు ప్రసాదాల పంపిణీ, భక్తులను వరుసల్లో పంపే తదితర కార్యక్రమాల్లో పాల్గొనేవారు. భక్తులకు సంపూర్ణంగా సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని పీఠాధిపతి, అధికారులు భావించారు. ఇకపై దేశంలోని ఎక్కడి భక్తులైనా స్వామి సేవలో తరించొచ్ఛు వచ్చిన భక్తులకు భోజనం, ప్రసాదం, దర్శనం, పీఠాధిపతి ఆశీర్వాదం, సేవకు గుర్తింపుగా ధ్రువపత్రం అందజేయనున్నారు.
50 ప్రాంతాల్లో అవసరం
‘గురుపాద సేవ’లో పాల్గొనే భక్తుల సేవలు ఎక్కడెక్కడ అవసరం అవుతాయి.. వారిని ఏఏ ప్రాంతాల్లో సద్వినియోగం చేసుకోవాలన్న ప్రణాళికను రూపొందించారు. మఠం ముఖద్వారం నుంచి అన్నపూర్ణ భోజనశాల, భక్తుల వరుసలు, ప్రసాదాల ప్యాకింగ్, వాటి తరలింపు, పంపిణీ, పీఠాధిపతి గది, పూజలు తదితర ప్రాంతాలను గుర్తించారు. మొత్తం 50 చోట్ల వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. రెండ్రోజులుగా సేవలను మొదలుపెట్టగా భక్తుల స్పందనను బట్టి మార్పులు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారికి వసతి, భోజనం, దర్శనం వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
భక్తులకు గొప్ప అవకాశం
- హరిస్వామి, గురుపాద సేవ నిర్వహణ అధికారి
పీఠాధిపతి ఆదేశాల మేరకు నూతన సేవలను ప్రారంభించాం. భక్తులు ముందుకొస్తున్నారు. ఔత్సాహికులు ముందుగానే వారి పేర్లను నమోదు చేయించుకోవాలి. వచ్చిన వారికి ఐడెంటీ కార్డులు ఇచ్చి ఎక్కడెక్కడ పని చేయాలో నిర్ణయించి నియమిస్తాం. ఉత్సవాల్లోనే కాకుండా భక్తులు అధికంగా వచ్చే సెలవు దినాలు, ప్రత్యేక రోజుల్లోనూ అమలు చేయనున్నాం. ఈ విధానం ఇంకా ఆన్లైన్లో ఏర్పాటు చేయలేదు.