కట్టెలు మండితేనే..కడుపు నిండేది
పాఠశాలలకు భారమైన గ్యాస్ వినియోగం
పత్తికొండ: ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిత్యం 800 మంది భోజనం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం తయారీకి గతంలో గ్యాస్ పొయ్యి, సిలిండర్ ఇచ్చినా వినియోగించడం లేదు. ధరలు ఆకాశాన్నంటడంతో కట్టెలే వినియోగిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికితోడు పాత్రలు పెద్దవి కావడంతో గ్యాస్ పొయ్యిపై ఇబ్బందిగా ఉందన్నారు. గ్యాస్‌పై వంట చేయాలంటే రోజుకో సిలిండర్ చొప్పున అయిపోతుంది.. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏమాత్రం సరిపోదని వాపోతున్నారు. దీంతో రూ.6 వేలు వెచ్చించి ఓ టన్ను కట్టెలు కొనుగోలు చేస్తే నెల మొత్తం సరిపోతున్నాయని చెబుతున్నారు.
మద్దికెర న్యూస్‌టుడే: ఇరుకిరుకు వంట గదులతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఆరుబయటే వండుతున్నారు. ధరాభారం కావడంతో గ్యాస్ సిలిండర్లను పక్కన పెట్టి వంటచెరుకునే వాడుతున్నారు. ఆరు బయట వంట చేస్తున్న క్రమంలో ఏలూరులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.ఆరు బయట వంటలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం - రంగారెడ్డి, డీఈవో
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైన రాయితీని చెల్లించాలని ఇప్పటికే పలుమార్లు వినతులు వచ్చాయి. వాటి ఆధారంగా ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదిస్తాం. గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయడమా, లేక వంట నిర్వాహకులే కొనుగోలు చేస్తే వారికి రాయితీ అందించడమా అనే విషయమై నివేదిక పంపిస్తాం.
90 శాతం పాఠశాలల్లో ఆరుబయటే
1981 ప్రాథమిక పాఠశాలల్లో 1,88,556 మంది, 365 ప్రాథమికోన్నత బడుల్లో 53,692 మంది, 612 ఉన్నత పాఠశాలల్లో 20,4588 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. 90 శాతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటకు కట్టెలే ఆధారమవుతున్నాయి. దీంతో తరగతి గదుల్లోకి పొగ రావడంతో పిల్లలు, వంట నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.
నెలలకు 1,200 టన్నుల వినియోగం
ఒక్కో బడిలో పిల్లల సంఖ్యను బట్టి 15 నుంచి 25 కిలోల కట్టెలు అవసరం అవుతున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా రోజుకు 50 టన్నుల కలప వినియోగిస్తున్నట్లు అంచనా. నెలకు 25 రోజుల చొప్పున అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి 1,200 టన్నులకుపైగా కలప మండుతోంది. సర్కారు ఇచ్చే గ్యాస్ సరిపోకపోవడంతోపాటు, కమర్షియల్ సిలిండర్ ధర అమాంతం పెరగడంతో వంట నిర్వాహకులు గ్యాస్‌కి దూరంగా ఉంటున్నారు.
మండని ‘రసోయి ఘర్’ పొయ్యి
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా 2008లో కేంద్ర ప్రభుత్వం ‘రసోయి ఘర్’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనిద్వారా పాఠశాలలకు రూ.1,550 విలువ చేసే గ్యాస్ స్టౌవ్, రెండు సిలిండర్లు, 12, 14, 16 లీటర్ల సామర్థ్యం గల నీటిడ్రమ్ములు, విద్యార్థుల ఎత్తు, బరువు కొలిచే సాధనాలను అందజేశారు. పాఠశాలల్లో గ్యాస్ ఆధారంగా వంట చేసేందుకు అనువైన గదులు లేకపోవడం, గ్యాస్ పొయ్యిపై పెద్ద పాత్రలు పెట్టి వంట చేయడం కష్టమని, కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. గ్యాస్ పొయ్యిల వాడకం నామమాత్రంగానే ఉంది.
డోన్: పట్టణంలోని యు.కొత్తపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో వంట గది లేక ఏజెన్సీ నిర్వాహకులు తరగతి గదుల వద్ద వంటలు తయారు చేస్తున్నారు. ఈ పాఠశాల 2010లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయ్యింది. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం 259 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసేందుకు ఉన్నత పాఠశాలలో వంట గది లేక వరండాలోనే ఓ చివరన.. మహిళలు ఇరుకుగా కూర్చొని వంటలు తయారు చేసి పిల్లలకు వడ్డించాల్సి వస్తోంది. ఇక్కడ స్థల సమస్య వేధిస్తోంది. గతంలో వంట గది మంజూరైనా నిర్మించేందుకు స్థలం లేకపోవడంతో నిధులు కాస్తా వెనక్కి వెళ్లాయి. ఉన్నతాధికారులు పలుమార్లు పాఠశాలను సందర్శించినా ఫలితం లేకుండా పోయింది.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.