అన్ని రంగాల్లో రాణించాలి
దివ్యాంగులకు ఉపకరణాలు అందజేస్తున్న కలెక్టర్ కోటేశ్వరరావు, జేసీ (ఆసరా) శ్రీనివాసులు తదితరులు
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: దివ్యాంగులు ప్రతిభావంతులని, మనోధైర్యంతో.. ఆత్మ విశ్వాసంతో సకలాంగులకు దీటుగా ముందుకెళ్తున్నారని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌తోపాటు జేసీ (ఆసరా) ఎంకేవీ శ్రీనివాసులు, దివ్యాంగుల శాఖ ఏడీ విజయ, మెప్మా పీడీ రాధికారెడ్డి తదితరులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వైకల్యాలు ఎదుగుదలకు అవరోధం కాదని, వాటి గురించి నిరాశతో కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలో దివ్యాంగులకు జిల్లాలో 11 పోస్టులకు సంబంధించి ప్రకటన ఇస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని, ఉపకరణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జేసీ (ఆసరా) ఎంకేవీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని, ప్రత్యేక వసతిగృహ నిర్మాణం జరుగుతోందని, నిధులు రాగానే పూర్తి చేస్తామన్నారు. హిజ్రాలకు సంబంధించి పాణ్యంలో పొదుపు సంఘం ఏర్పాటుతోపాటు నంద్యాలలో కుట్లు, అల్లికలతో జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. అనంతరం ట్రైసైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, టచ్ స్క్రీన్ మొబైల్స్ తదితరాలను అందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సోలో డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, పాటలు ఆకట్టుకున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, జీజీహెచ్ ఆర్ఎంవో వసుధ, దివ్యాంగుల సంఘం నాయకులు రాఘవేంద్ర, లక్ష్మణస్వామి, సుబాల్ బాషా, మాధురి పాల్గొన్నారు.