logo

అందని హక్కు పత్రం

వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. లబ్ధిదారుల అపోహలు పోగొట్టి డబ్బులు చెల్లించేలా అధికారులపైనా ఒత్తిడి తెచ్చారు. తీరా డబ్బులు కట్టాక హక్కు పత్రాలు జారీ చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోంది.

Published : 20 Jan 2022 03:28 IST

ఓటీఎస్‌ రిజిస్ట్రేషన్లలో జాప్యం

తప్పుల తడకలతో తిరస్కరణ

కడుమూరులో తహసీల్దారుకు ఓటీఎస్‌ నగదు చెల్లిస్తున్న లబ్ధిదారులు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. లబ్ధిదారుల అపోహలు పోగొట్టి డబ్బులు చెల్లించేలా అధికారులపైనా ఒత్తిడి తెచ్చారు. తీరా డబ్బులు కట్టాక హక్కు పత్రాలు జారీ చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. వీటి బాధ్యతలు వీఆర్వోలతోపాటు గ్రేడ్‌-4,5 పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. రిజిస్ట్రేషన్లుకు సంబంధించిన దస్త్రాలు ఎలా పూర్తి చేయాలో అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి తిరస్కరణలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు 1971 మందికి

జిల్లాలో 50వేలకు పైగా ఓటీిఎస్‌ చేయగా కేవలం 1971 మందికి రిజిస్ట్రేషన్లు చేసి గృహ హక్కు పత్రాలు ఇచ్చారు. మిగిలిన వారికి జాప్యం అవుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంపై చాలా మందిలో అపోహలు ఉండటంతో ఓటీఎస్‌ చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్న విషయం విధితమే. డేటా ఎంట్రీ చేశాక పరిశీలనకు కార్యదర్శులు, వీఆర్వోల లాగిన్‌కు పంపుతారు. సర్వే, కొలతలు ఆన్‌లైన్‌ చేశాక తహసీల్దార్‌ లాగిన్‌కు పంపుతారు. అక్కడ అనుమతి పొందితే గృహ నిర్మాణశాఖకు 10 రోజుల వ్యవధిలో చేరుతుంది. అక్కడి నుంచి అమరావతికి వెళ్లి డాక్యుమెంట్లు ప్రింటై వస్తాయి. ఈ విధానంలో క్షేత్రస్థాయిలో జాప్యం అవుతోంది. ప్రధానంగా తప్పులతడకలతోనే ఈ సమస్య ఎదురువుతున్నట్లు తెలుస్తోంది.

రూ.20.14 కోట్లు వసూలు

గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించుకొన్న ఇళ్లకు ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇందుకు ఓటీఎస్‌ పేరుతో రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.20వేలు వసూలు చేస్తున్నారు. 1983 నుంచి 2011 మధ్య కాలంలో వివిధ పథకాల కింద జిల్లా వ్యాప్తంగా 4,45,945 మంది లబ్ధి పొందినట్లు గుర్తించారు. వీరిలో సర్వే చేయగా 2.21 లక్షల మంది ఇళ్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఓటీఎస్‌ ద్వారా రూ.185 కోట్లు వసూలు అవుతాయని లక్ష్యం పెట్టుకొన్నారు. జనవరి 17 నాటికి 50,316 మంది రూ.20.14 కోట్లు చెల్లించారు.

అంతా గందరగోళం

లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసే దస్తావేజుల్లో తప్పులే దర్శనమిస్తున్నాయి. ఆధార్‌ కార్డులో పేరు ఎలా ఉంటే అలా డాక్యుమెంట్స్‌లో రాయాల్సి ఉండగా, లబ్ధిదారుడు ఎలా చెబితే అలా నింపేశారు. సర్వే, కొలతల్లోనూ వ్యత్యాసం నెలకొంది. తక్కువ సమయం ఇవ్వడం, గ్రేడ్‌-5 కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో తప్పులు చోటు చేసుకొన్నాయి. ఈ దిద్దుబాట్లపై తహసీల్దార్‌ సంతకంతో మార్చే అవకాశం కల్పించారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పరిశీలనకు వెళ్లిన వాటిలో తహసీల్దార్‌, కార్యదర్శుల సంతకాల్లేకపోవడం, సర్వే నంబర్లు పెన్నుతో సరిదిద్దడం వంటివి గుర్తించి తిరస్కరించారు. వీటితో ఇలా కాలయాపన జరుగుతుండటంతో ప్రకటించిన విధంగా వెంటనే హక్కు పత్రాలు అందించ లేకపోతున్నారన్న విమర్శలున్నాయి.

కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా

- వెంకట లక్ష్మమ్మ, నందికొట్కూరు

నందికొట్కూరు బైరెడ్డి నగర్‌లో ఉంటున్నా. 2008లో గృహ నిర్మాణశాఖ ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణం కొంత సొంత నగదు చేర్చి పూర్తి చేశా. ఓటీఎస్‌కు రూ.15వేలు చెల్లించా. ఇరవై రోజులుగా రిజిస్ట్రేషన్‌ పత్రం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అదిగో ఇదిగో అంటూ జాప్యం చేస్తున్నారు. డబ్బులు కట్టించుకుని జాప్యం చేస్తే ఆందోళనగా ఉంది.

సమయం పడుతుంది

- కె.వెంకటనారాయణ, హౌసింగ్‌ పీడీ

ఓటీఎస్‌ చెల్లించిన వెంటనే రుణ విముక్తి పత్రం అందజేస్తున్నాం. తహసీల్దార్‌ సంతకం అయ్యాక పది రోజుల వ్యవధిలో గృహ నిర్మాణ శాఖకు వచ్చే డాక్యుమెంట్లు అమరావతికి పంపిస్తాం. అక్కడ ప్రింట్‌ అయి రావడానికి సమయం పడుతోంది. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందొద్ధు కచ్చితంగా గృహ హక్కు పత్రాలు అందిస్తాం. ఇక తప్పులు సరి చేసేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్‌ లాగిన్‌లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేన్‌లో చేసుకోవచ్ఛు ఒక వేళ డాక్యుమెంట్‌ ప్రింట్‌ అయి వచ్చాక తప్పులు గుర్తిస్తే తహసీల్దార్‌ పచ్చ ఇంకుతో సరి చేసే అధికారం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు