logo

జనం తరలె.. రథం కదిలె

గొరవయ్యల నృత్య ప్రదర్శనలు.. శివనామ స్మరణలతో చేనేతపురి పులకించింది. నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా కొనసాగింది. ఎమ్మిగనూరు పట్టణంలో జాతరను పురస్కరించుకుని బుధవారం మహా రథోత్సవం చేపట్టారు.

Published : 20 Jan 2022 03:28 IST

శివనామ స్మరణతో మార్మోగిన చేనేతపురి

తేరుబజార్‌లో కిక్కిరిసిన భక్తులు

ఎమ్మిగనూరు, ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: గొరవయ్యల నృత్య ప్రదర్శనలు.. శివనామ స్మరణలతో చేనేతపురి పులకించింది. నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువగా కొనసాగింది. ఎమ్మిగనూరు పట్టణంలో జాతరను పురస్కరించుకుని బుధవారం మహా రథోత్సవం చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. తేరుబజారు వద్దకు ధర్మకర్త మాచాని నీలకంఠప్ప నాగరాజు దంపతులు చేరుకుని హోమాలు నిర్వహించాక పార్వతీపరమేశ్వరుల విగ్రహాలను రథంలో పెట్టారు. సాయంత్రం 5.41 గంటలకు శివ నామస్మరణలు హోరెత్తగా రథాన్ని ముందుకు కదిలించారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయం వరకు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని రథోత్సవం తిలకించారు.●

ప్రజలు మిద్దెలు, చెట్లు ఎక్కి రథోత్సవం తిలకించారు. రథం ఎదుట భక్తుల భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తేరుబజార్‌లో గొరవయ్యల నృత్యాలు ఆకట్టుకొన్నాయి.

తేరుబజార్‌, సోమేశ్వర కూడలి, మల్లారవీధిలోని మిద్దెలపై ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రథం లాగేందుకు పోటీ పడ్డారు. డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

20 మంది ఎస్సైలు, 8 మంది సీఐలు, 250 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు.

కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్మన్‌ డా.రఘు, తహసీల్దార్‌ జయన్న, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, వైకాపా కన్వీనర్‌ ఎర్రకోట జగన్‌ మోహన్‌రెడ్డి, బసిరెడ్డి, మంత్రాలయం తెదేపా నాయకులు పి.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వై.రుద్రగౌడు, సీఐ శ్రీనివాస నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

రథశాల వద్ద ప్రత్యేక హోమం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని