logo

ఆందోళన వద్దు... అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం 70 శాతం వేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. టీకా చేయించుకోని వారికి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.. వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ‘ఈనాడు’ నిర్వహించిన

Published : 20 Jan 2022 03:28 IST

‘ఈనాడు- ఫోన్‌ఇన్‌’లో వైద్య నిపుణులు (సర్వజన వైద్యశాల) డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: ప్రస్తుతం 70 శాతం వేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. టీకా చేయించుకోని వారికి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.. వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ‘ఈనాడు’ నిర్వహించిన ఫోన్‌ ఇన్‌లో సందేహాలు నివృత్తి చేశారు. స్వీయ గృహనిర్భందంలో ఉండి వైరస్‌ సోకిన రోజు నుంచి ఏడు రోజులపాటు ఉండాలి. కేంద్ర కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ, ఐసీఎంఆర్‌ తాజాగా 13వ తేదీ విడుదల చేసిన నిబంధనల ప్రకారం రూ.200 కిట్‌ సూచించారు. ఇందులో సెట్రిజిన్‌ 10ఎంజీ(రెండు పూటలా), పారాసిట్మాల్‌ 650ఎంజీ(మూడు పూటలా), అజిత్రోమైసిన్‌(ఒక పూట), ఆస్కారిల్‌ సిరప్‌(మూడు పూటలా), బి కాంప్లెక్సు (ఒక పూట), పాన్‌టాప్‌(గ్యాస్‌ 20ఎంజీ) ఒక పూట వేసుకోవాలని సూచించారు. ఆందోళన వద్ధు. అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

నా వయసు 62 ఏళ్లు. నేను పన్నెండేళ్ల క్రితం బైపాస్‌ సర్జరీ చేయించుకొన్నా. రక్తపోటు, మధుమేహం ఉన్నాయి. వాటికి మందులు వాడుతున్నా. రెండు డోసుల టీకాలు వేయించా. గతరాత్రి నుంచి జలుబు, స్వల్ప జ్వరం ఉంది. ఏం చేయాలి? - శ్రీరాములు, కర్నూలు

హైరిస్క్‌ గ్రూప్‌లో ఉన్నారు. బూస్టర్‌ డోస్‌ వెంటనే వేయించుకోండి. గుండెకు సంబంధించిన మందులు, బీపీ, షుగరు మందులు కొనసాగిస్తూనే ఐదు రోజులపాటు పారాసిట్మాల్‌, సిట్రజిన్‌, అజిత్రోమైసిన్‌, బీకాంప్లెక్సు వాడండి.

మాది డోన్‌. రెండ్రోజులుగా దగ్గు, ఒళ్లు నొప్పులున్నాయి. జలుబు అంతగా లేదు. జనరల్‌ మెడిసిన్‌ వాడుతున్నా. ఇవి ఒమిక్రాన్‌ లక్షణాలేనా?

ఇప్పటికే మూడ్రోజులు దాటింది.. మరో ఐద్రోజులు మందులు వాడితే సరిపోతుంది. ఎక్కువ నీరు తాగాలి. కొంచె లేచి తిరుగుతూ ఉండండి. ఇంట్లోనే ఐసొలేట్‌ అవ్వండి.

ఒమిక్రాన్‌ వస్తే గుండెకు ఏమైనా సమస్య వస్తుందా? గుండెకు ఒత్తిడి పెరుగుతుందని సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. అది నిజమేనా? - శ్రీధర్‌, కర్నూలు

ఒమిక్రాన్‌తో గుండెకు ఎలాంటి సమస్య రాదు. అటువంటి కేసులు ఒక్కటి కూడా రికార్డు కాలేదు. ఒమిక్రాన్‌ జలుబు, దగ్గు, గొంతునొప్పి, విపరీతమైన ఒళ్లునొప్పులు, జ్వరం ఉంటాయి.

నాకు గాల్‌బ్లాడర్‌లో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే కొన్ని రోజుల క్రితం ట్యూబ్‌ వేశారు. దగ్గు, గొంతులో గరగరగా ఉంటే కొన్ని మందులు వాడుతున్నాను. పూర్తిగా తగ్గడానికి ఏం మందులు వాడాలి? - ఖాశీం వలి, న్యాయవాది, ఆదోని

సెఫిక్‌జైమ్‌ 200ఎంజీ రెండు పూట్లా, ఆస్కారిల్‌ దగ్గు మందు మూడు పూట్లా వేసుకుంటే కళ్లె, గొంతులో గరగర తగ్గిపోతాయి.

పదేళ్ల క్రితం టీబీ వచ్చి తగ్గింది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఎలర్జీ వస్తుంది. రెండు అలల్లోనూ కొవిడ్‌ సోకలేదు. ప్రస్తుతం రెండు డోసులతోపాటు బూస్టర్‌ డోసు వేయించాం. ముందస్తు జాగ్రత్తగా ఏవైనా మందులు వాడొచ్చా? - పవన్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు.

బూస్టర్‌ డోస్‌ వేసుకొన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ముందస్తుగా ఎలాంటి మందులు వాడొద్ధు జలుబు, దగ్గు, జ్వరానికి కొన్ని మందులు ఇంట్లో అందుబాటులో ఉంచుకోండి చాలు.

నాకు థైరాయిడ్‌ ఉంది. రెండ్రోజులుగా ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించా.. ఫలితం రాలేదు. నీరసంగా ఉంటుంది? - జయసుధ, బనగానపల్లి

ఫలితం వచ్చే ముందే మందులు వాడండి. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోండి. మసాలాలతో కూడిన ఆహారం కాకుండా త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. ఇంట్లోనే ఐసొలేట్‌ అవ్వండి.●

లక్షణాలు వచ్చి ఇప్పటికి ఏడు రోజులైంది. పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం గొంతు నొప్పి ఇంకా తగ్గలేదు. బయటకు వెళ్లొచ్చా? - భరత్‌రెడ్డి, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌

ఏడు రోజులు పూర్తయితే కొవిడ్‌ నిర్ధారణ అయ్యాక వైరస్‌ వ్యాప్తి ఉండదు. కనుక మాస్క్‌ ధరించి బయటకు వెళ్లొచ్ఛు●

మా కుమారుడి ఇంట్లో పనిచేసే సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణైంది. జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులున్నాయి. ఏం మందులు వాడాలి? - వేణుగోపాల్‌రెడ్డి, నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజర్‌

సిట్రజిన్‌, పారాసిట్మాల్‌, బి-కాంప్లెక్సు, అజిత్రోమైసిన్‌, పాన్‌టాప్‌ (గ్యాస్‌ టాబ్లెట్‌) ట్యాబ్లెట్లు వేసుకుంటూ బాగా నీళ్లు తాగాలి. దగ్గుకు అవసరమైతే ఆస్కారిల్‌ సిరప్‌ మూడు పూటలా తాగితే సరిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని