logo

అవసరమైతే జైల్‌ భరోకు పిలుపునిస్తాం

ఆత్మకూరులో ఓటు బ్యాంకు రాజకీయానికి తెరలేపారు... శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డిది దురాగత.. రాజకీయ ప్రేరేపిత.. మతతత్వ వైఖరని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ధ్వజమెత్తారు. ఎస్టీబీసీ మైదానంలో శనివారం నిర్వహించిన ‘

Published : 23 Jan 2022 02:16 IST

ప్రజా నిరసన సభలో భాజపా నేతలు

ఆత్మకూరులో ఓటు బ్యాంకు రాజకీయం

సభలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వేదికపై జాతీయ కార్యదర్శి,

రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్జి సునీల్‌ దేవ్‌ధర్‌, ఎమ్మెల్సీ మాధవ్‌, రాజ్యసభ సభ్యులు

జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు

 ఈనాడు డిజిటల్‌ - కర్నూలు, కర్నూలు బిక్యాంపు - న్యూస్‌టుడే: ఆత్మకూరులో ఓటు బ్యాంకు రాజకీయానికి తెరలేపారు... శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డిది దురాగత.. రాజకీయ ప్రేరేపిత.. మతతత్వ వైఖరని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ధ్వజమెత్తారు. ఎస్టీబీసీ మైదానంలో శనివారం నిర్వహించిన ‘ప్రజా నిరసన సభ’కు జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, జాతీయ కార్యదర్శి సునీల్‌ దియోధర్‌ హాజరయ్యారు. జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు కారణంగానే రాష్ట్రంలో హిందూ వ్యతిరేక కార్యకలాపాలు మితిమీరి పోతున్నాయి.. భాజపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. అనుమతుల్లేవని ఆత్మకూరులో ఏడాది క్రితం అధికారులు నిలిపివేసిన మసీదు నిర్మాణాన్ని.. 24 గంటల్లో నిర్మించేందుకు స్థానిక ఎమ్మెల్యే యత్నించారన్నారు. ప్రశ్నించిన బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై 12 కేసులుపెట్టి బెయిల్‌ రాకుండా చేయడానికి అధికారపార్టీ నేతలు ప్రయత్నించడం దారుణమన్నారు. పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తే యువకుడిపై కేసుపెట్టారన్నారు. భాజపా నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. వైకాపా చేతగాని అసమర్థ ప్రభుత్వమన్నారు. అవసరమైతే జైల్‌ భరోకు పిలుపునిస్తామన్నారు.

భాజపా అంటే ఫైర్‌ : సునీల్‌ దేవ్‌ధర్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్‌ఛార్జి

భాజపా అంటే ఫైర్‌ అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి చెప్పాం.. నిప్పుతో చెలగాటమాడితే కాలిపోతావ్‌ అని హెచ్చరించామన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రమాదకర పరిస్థితులున్నాయి... ఆత్మకూరు ఘటనను ఇక్కడితో వదిలిపెట్టబోమన్నారు. శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఉపసంహరించుకొనే వరకు పోరాటం చేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిద్ర పోతోందా - జీవీఎల్‌ నరసింహారావు, రాజ్యసభ సభ్యులు

ఎస్డీపీఐ పేరుతో భారత, హిందూ వ్యతిరేక విధానాలను విచ్ఛిన్నం చేసే దిశగా కొన్ని సంస్థలు పని చేస్తుంటే వైకాపా ముఖ్యమంత్రి వారికి అండగా ఉండటం విచారకరమని రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. నీచ రాజకీయాలకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆ సంస్థను ఆత్మకూరు నుంచి పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజాపోరాటానికి సిద్ధం కావాలి - టీజీ వెంకటేష్‌, రాజ్యసభ సభ్యులు

వైసీపీ ప్రభుత్వం నిలబడిందంటే భాజపా ప్రభుత్వం ఉందన్న విషయాన్ని పార్టీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ అన్నారు. ప్రతి భాజపా కార్యకర్త ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉద్యోగుల వేతనాలు తగ్గించడం దారుణం - సీఎం రమేష్‌, రాజ్యసభ సభ్యులు

బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిని హత్య చేయడానికి వచ్చిన వారిని వదిలిపెట్టి, ఆయన పైనే హత్యాయత్నం కేసు పెట్టడం అన్యాయమన్నారు. దేశంలో ఎక్కడా ప్రభుత్వ వేతనాలు తగ్గించిన సందర్భాల్లేవని, ఏపీలో ఉద్యోగుల వేతనాలు తగ్గించడం దారుణం.

ఎమ్మెల్సీ మాధవ్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, ఓబీసీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ పార్థసారధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి మాట్లాడారు. సభలో వర్చువల్‌ విధానంలో శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి, రాష్ట్ర నాయకురాలు డా.వినుషారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ, , జిల్లా ఇన్‌ఛార్జి రావెల కిషోర్‌బాబు, హరీష్‌, కపిలేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని