logo

యువతపై ఉరిమిన మూడో అల

జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ మూడో అల విరుచుకుపడుతోంది. ముఖ్యంగా 18-40 ఏళ్లలోపు ఉన్నవారిపై ప్రభావం చూపుతోంది. కళాశాలలో చదివే విద్యార్థులతోపాటు ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం బయట తిరిగేవారు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారు. ఫలితంగా వారి కుటుంబసభ్యులకు

Published : 23 Jan 2022 02:16 IST

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ మూడో అల విరుచుకుపడుతోంది. ముఖ్యంగా 18-40 ఏళ్లలోపు ఉన్నవారిపై ప్రభావం చూపుతోంది. కళాశాలలో చదివే విద్యార్థులతోపాటు ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం బయట తిరిగేవారు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారు. ఫలితంగా వారి కుటుంబసభ్యులకు కరోనా సోకుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

భారీగా మందుల కొనుగోలు

జిల్లాలో చాలామంది జలుబు, జ్వరం బారినపడ్డారు. చలి తీవ్రత ఉండటంతో ఈ సమస్య ఎదురవుతోంది. ముందస్తుగా మందులు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కొవిడ్‌ ఐసొలేషన్‌ కిట్లు, అజిత్రోమైసిన్‌. డోలో అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. గత నెలలో పోల్చితే ఈ నెలలో కొనుగోళ్లు రెండింతలైనట్లు దుకాణ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

చాలామంది పరీక్షలు చేయించుకోకుండా డోలో, అజిత్రోమైసిన్‌ వంటివి వాడుతున్నారు. గతేడాది రెండో వేవ్‌లో ఎక్కువమంది ఆస్పత్రులపాలయ్యారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. సీరియస్‌ కేసులు రాకపోవడం.. చాలామందికి తగ్గిపోతుండటంతో హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు.

పరీక్షల పేరుతో దోపిడీ

ఇతర జిల్లాలు.. రాష్ట్రాల్లో చదువుకొనే విద్యార్థులు.. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. ఇదే అవకాశంగా ప్రైవేటు ల్యాబ్‌లు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల పేరుతో దోచుకుంటున్నాయి. కొందరికి పరీక్షలు చేయకనే వారి అవసరానికి తగ్గట్టు డబ్బులు తీసుకుని తప్పుడు పత్రాలు ఇస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో అడ్మిషన్‌ పేరుతో భారీగా నగదు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.350కు మించి వసూలు చేయకూడదు. కర్నూలు నగరంలో కొన్ని ఆసుపత్రులు, ల్యాబ్‌లు రోగి అవసరాన్ని బట్టి భారీగా వసూలు చేస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం.

బూస్టర్‌ డోస్‌ కోసం

జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం రెండో డోసు వేస్తున్నారు. వైద్య సిబ్బంది.. 60 ఏళ్లు దాటినవారికి ఉచితంగా బూస్టర్‌ డోసు వేస్తున్నారు. కర్నూలు నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టీకాలు వేస్తున్నారు. కొవిషీల్డ్‌ రూ.800, కొవాగ్జిన్‌కు రూ.1,500 తీసుకుంటున్నారు. మూడో అల నేపథ్యంలో కొందరు భయపడి ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండా వెళ్లి టీకా వేయించుకుంటున్నారు.

పెరిగిన ,పాజిటివ్‌ రేట్‌

జిల్లా వ్యాప్తంగా శనివారం 969 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కర్నూలు నగరంలోనే 481, నంద్యాల 97, ఆదోని 28, ఎమ్మిగనూరు 21 కేసులు బయటపడ్డాయి.

పట్టణ ప్రాంతాల్లో 674 మంది వైరస్‌ బారిన పడ్డారు. జిల్లాలో అర్బన్‌ ప్రాంతాల్లో 1,866 మందికి పరీక్షలు చేయగా 674 మందికి (పాజిటివ్‌ రేటు 35.74 శాతం)గా లక్షణాలు బయటపడ్డాయి. వెల్దుర్తిలో 23, ఓర్వకల్లు 25, కల్లూరు 10, పెద్దకడబూరు 19, కోడుమూరు 24, ప్యాపిలి 22, కర్నూలు గ్రామీణంలో 14 కేసులు బయటపడ్డాయి.

జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,190 పరీక్షలు చేయగా 295 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ రేటు 13.47 శాతంగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు వివిధ ఆస్పత్రులు, హోం ఐసొలేషన్‌లో 3,778 మంది చికిత్స పొందుతుండగా కొవిడ్‌ బారినపడి 854 మంది చనిపోయారు.

ఈనెలలో నమోదైన కేసులు( 11 నుంచి 20 వరకు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని