logo

పాత పీఆర్సీ ప్రకారమే వేతనాలివ్వాలి

కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలంటూ ఖజానాశాఖ అధికారులు డీడీవోలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని డీటీవో కార్యాలయం ఎదుట

Published : 23 Jan 2022 02:16 IST


ఖజానా శాఖ డీడీతో మాట్లాడుతున్న ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు

వెంగళ్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలంటూ ఖజానాశాఖ అధికారులు డీడీవోలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని డీటీవో కార్యాలయం ఎదుట ఆయనతోపాటు ఏపీ ఎన్జీవో సంఘం నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఫ్యాప్టో అధ్యక్షుడు ఓంకార్‌ యాదవ్‌, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఖజానాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పలనాటి సునీల్‌కుమార్‌, కరుణాకర్‌, వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిప్రకాష్‌, ఎన్జీవో సంఘం నాయకులు బలరామిరెడ్డి, సాంబశివారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి శనివారం నిరసన తెలిపారు. కొత్త పీఆర్‌సీ వద్దని.. పాత వేతనాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాల చెల్లింపులు చేసేందుకు దూకుడుగా వ్యవహరించడం తగదని ఖజానాశాఖ డీడీ రామచంద్రరావుతో వాగ్వాదానికి దిగారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ లెక్క తేలేదాకా తమకు పాత వేతనాలే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఖజానాశాఖ డీడీకి వినతిపత్రం సమర్పించారు.

కలెక్టరేట్‌ ఆవరణలో నిరసన

ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యంగా లేదు.. వచ్చే నెల 7 నుంచి ఉద్యమబాట పడుతున్నట్లు ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో శనివారం వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ, క్వాంటమ్‌ పింఛన్‌ వంటి చీకటి జీవోలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎస్‌ డౌన్‌ డౌన్‌, ఐఏఎస్‌ అధికారుల మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జడ్‌.కరుణాకర్‌, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు 130 సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నాలుగు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు సి.క్యాంపులోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం సమావేశ భవనంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవో, ఏపీఆర్‌ఎస్‌ఏ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీజీఈఎఫ్‌ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం 130 సంఘాల నాయకులతో కలిసి భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించనున్నామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల నాయకులంతా హాజరై ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు.

కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేత

తమకు పాత వేతనాలే కావాలి.. కొత్త పీఆర్సీ ప్రకారం వద్దని.. వచ్చే నెల 7 నుంచి తాము సమ్మెలోకి వెళ్తున్నామని పేర్కొంటూ ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు శనివారం కలెక్టర్‌ పి.కోటేశ్వరరావును కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. జనవరి నెల కొత్త వేతనాల కోసం ఖజానా శాఖ అధికారులు ఒత్తిడి చేయకుండా జోక్యం చేసుకోవాలంటూ కోరారు.

కలెక్టర్‌ పి.కోటేశ్వరరావుకు సమ్మె నోటీసు ఇస్తున్న ఏపీ ఐకాస జిల్లా

అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని