logo

రోగులకు మెరుగైన సేవలందించాలి

రాయలసీమకే తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఏపీ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన కొవిడ్‌-19పై కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు,

Published : 23 Jan 2022 02:16 IST

ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ కేశవ్‌


మాట్లాడుతున్న ఏపీ పీఏసీ కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, పక్కన పాణ్యం

ఎమ్మెల్యే కాటసాని, కలెక్టర్‌ కోటేశ్వరరావు, జేసీలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాయలసీమకే తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఏపీ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన అధ్యక్షతన కొవిడ్‌-19పై కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జేసీలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్షించారు. పీఏసీ ఛైర్మన్‌ మాట్లాడుతూ కొవిడ్‌ బారిన పడిన రోగులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్నిరకాల వైద్య సేవలందించేందుకు వైద్యాధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. అవసరమైన ప్రాణవాయువు, అన్నిరకాల మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మొదటి డోసు వంద శాతం, రెండో డోసు 87 శాతం, బూస్టర్‌ డోసు 47 శాతం వేశారని, వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా చేశారని జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించారు. వైద్యసేవల్లో భాగంగా మందుల చీటీలు బయటకు రాసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో లేని అత్యవసర మందులను మాత్రమే బయటకు రాస్తున్నట్లు జీజీహెచ్‌ పర్యవేక్షకుడు డా.నరేంద్రనాథ్‌రెడ్డి వివరణ ఇచ్చారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ప్రత్యేక దృష్టి సారించి మెరుగుపరచాలని ఆదేశించారు.

క్యాన్సర్‌ ఆస్పత్రి పనులపై దృష్టి

రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు సంబంధించి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏజెన్సీ నిర్వాహకులు రోగులకు భోజనం ఇస్తున్నారో లేదో పరిశీలించడంతోపాటు నాణ్యత చూడాలని, మంచి ఆహారం అందేలా చర్యలు చేపట్టాలని జీజీహెచ్‌ పర్యవేక్షకులకు సూచించారు. కొవిడ్‌ కట్టడికి చేపట్టిన చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు వివరించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల నియామకాల విధానంలో పారదర్శకత పాటించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. ఈ సమీక్షలో జేసీలు డా.మనజీర్‌ జిలానీ సామూన్‌, ఎస్‌.రామసుందర్‌రెడ్డి, నారపురెడ్డి మౌర్య, నగరపాలక కమిషనర్‌ డీకే బాలాజీ, ఇన్‌ఛార్జి డీఆర్వో మల్లికార్జునుడు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని