logo

ఆపరేటర్ల అక్రమ రాతలు

విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి తన కారు ఆర్సీ గడువు ముగియడంతో నవీకరణ(రెన్యూవల్‌)కు... చిరునామా మార్చుకొనేందుకు దరఖాస్తు చేశారు. వాహన సామర్థ్యంగా సరిగా లేకపోవడంతో ఎంవీఐ నిరాకరించారు. కానీ అంతాబాగున్నట్లు డీబీఐ(కంప్యూటర్‌ ఆపరేటర్‌) వివరాలు నమోదు చేశారు.

Published : 23 Jan 2022 02:22 IST

●రవాణా శాఖలో పెరిగిన జోక్యం

అధికారుల పాస్‌ వర్డు తస్కరణ

న్యూస్‌టుడే, నంద్యాల క్రీడావిభాగం, పాత పట్టణం : విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి తన కారు ఆర్సీ గడువు ముగియడంతో నవీకరణ(రెన్యూవల్‌)కు... చిరునామా మార్చుకొనేందుకు దరఖాస్తు చేశారు. వాహన సామర్థ్యంగా సరిగా లేకపోవడంతో ఎంవీఐ నిరాకరించారు. కానీ అంతాబాగున్నట్లు డీబీఐ(కంప్యూటర్‌ ఆపరేటర్‌) వివరాలు నమోదు చేశారు.

కొలిమిగుండ్లకు చెందిన ఓ వ్యక్తి లైసెన్సు కోసం మూడ్రోజుల కిందట దరఖాస్తు చేశారు. ఆన్‌లైన్‌ పరీక్షలో ఫెయిల్‌ అయ్యారు. పాస్‌ అయినట్లు కంప్యూటర్‌ ఆపరేటర్‌ వివరాలు నమోదు చేయడంతో లైసెన్సు మంజూరైంది.

రెండ్రోజుల కిందట డ్రైవింగ్‌ పరీక్షకు వచ్చిన ఓ వ్యక్తి ఫెయిల్‌ అయ్యారు. సంబంధిత వివరాలు కంప్యూటర్‌ ఆపరేటర్‌ నమోదు చేయకుండా ఏజెంట్‌తో మాట్లాడి ఆ రోజు సంబంధిత వ్యక్తి హాజరుకానట్లు నమోదు చేశారు. ఫెయిల్‌ అయినట్లు నమోదు చేస్తే రూ.300 నుంచి రూ.600 వరకు అపరాధరుసుము చెల్లించాల్సి ఉంటుంది.

రవాణా శాఖలో ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో కంప్యూటర్‌ ఆపరేటర్లు అంతా తామై నడిపిస్తున్నారు. చేతినిండా సంపాదిస్తున్నారు. డ్రైవింగ్‌ రాకపోయినా లైసెన్సులు మంజూరు చేయిస్తున్నారు. ప్రతి పనికి ఓ ధర నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో పని చేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలకు ఒక లాగిన్‌(పాస్‌ వర్డు) ఇస్తారు. వారు తమ పరిధిలో ప్రమాద ఘటనల నివేదికలు, పన్ను డీఎల్‌లు, ఎఫ్‌సీలు, ఇతరత్రా అంశాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీరికి సాయంగా ఇటీవల ఒప్పంద పద్ధతిలో కార్యాలయ స్థాయిని బట్టి ఒకరు లేక ముగ్గురు డీబీఏ (కంప్యూటర్‌ ఆపరేటర్‌)లను నియమించారు. సర్వర్‌, నెట్‌, ప్రింటింగ్‌, నెట్‌వర్క్‌కు తదితర పనులు వీరు చేపట్టాల్సి ఉంటుంది. వీరు ఎంవీఐల లాగిన్‌ తెలుసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, డోన్‌, ఆదోని ప్రాంతాల్లో ఆర్టీవో కార్యాలయాల్లో డీబీఏల దందా ఎక్కువైంది.

డ్రైవింగ్‌ పరీక్ష పూర్తి అయిన వెంటనే ఎంవీఐలు నివేదికను వారి లాగిన్‌లో నమోదు చేయాలి. వీరి పాస్‌వర్డ్‌లు తెలుసుకొన్న డీబీఏ(కంప్యూటర్‌ ఆపరేటర్లు)లు అక్రమాలకు పాల్పడుతున్నారు.

●ఎంవీఐ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలో ఫెయిల్‌ చేసినా డీబీఏలు.. ఏజెంట్లు, వాహనదారుల వద్ద కాసులు దండుకొని మార్చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండానే ఉత్తీర్ణులు(పాస్‌) చేసి పంపుతున్నారు.

ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి ఏకంగా రూ.5 వేలు తీసుకొంటున్నట్లు సమాచారం. నాలుగు చక్రాల వాహనాల పరీక్షలకు రూ.1000 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏజెంట్లతో కుమ్మక్కై ఇదంతా నడిపిస్తున్నారు. నంద్యాలలో ఏకంగా ఓ అటెండర్‌లో ఎంవీఐ లాగిన్‌లో వేలిముద్ర వేయించడం చర్చనీయాంశంగా మారింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు, ఆర్సీ కార్డులు ఏజెంట్లకు ఇచ్చి నగదు వసూలు చేస్తున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం : రమేశ్‌, ఇన్‌ఛార్జి డీటీసీ, కర్నూలు

జిల్లాలో చాలాచోట్ల ఏఎంవీఐలు కొత్తగా వచ్చారు. వారిపని వారే చేయాలని చెప్పాం. కార్యాలయాలు పరిశీలించి వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. వాహనదారులెవరు దళారులను నమ్మొద్ధు అన్నీ ఆన్‌లైన్‌ చేసుకొని కార్యాలయానికి రావొచ్ఛు ఆన్‌లైన్‌ కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒరిజినల్‌ పత్రాలు ఉంటే పనిచేసి పంపిస్తారు.

జిల్లాలో రోజు వారీగా వచ్చే దరఖాస్తులు

ఎఫ్‌సీలు 100

డీఎల్‌ 220

ఎల్‌ఎల్‌ఆర్‌ 300

చిరునామా మార్చడం 50-70

రెన్యువల్‌ 60-70

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని