logo

కూత పెట్టి పతకాలు సాధించి

గ్రామీణ క్రీడ కబడ్డీ ఆదరణ చూరగొంటోంది. మైదానంలో అడుగుపెట్టి కూతపెడితే చాలు ఒకటే ఈలలు, కేకలు.. ప్రోకబడ్డీ రాకతో పోటీల వైపు యువతరం మొగ్గుచూపుతోంది. ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతరలో భాగంగా అమ్మాయిలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తుండగా జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు సైతం పాల్గొని అబ్బురపరుస్తున్నారు.

Published : 27 Jan 2022 05:22 IST

కబడ్డీ పోటీల్లో యువతుల రాణింపు


ఎన్టీఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో క్రీడాకారులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: గ్రామీణ క్రీడ కబడ్డీ ఆదరణ చూరగొంటోంది. మైదానంలో అడుగుపెట్టి కూతపెడితే చాలు ఒకటే ఈలలు, కేకలు.. ప్రోకబడ్డీ రాకతో పోటీల వైపు యువతరం మొగ్గుచూపుతోంది. ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతరలో భాగంగా అమ్మాయిలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తుండగా జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు సైతం పాల్గొని అబ్బురపరుస్తున్నారు. డిఫెన్స్‌, రైడింగ్‌లో సత్తా చాటుతున్నారు. దిల్లీ, పంజాబ్‌, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు ఆయా జట్ల తరఫున పాల్గొని ప్రదర్శనతో మెప్పిస్తున్నారు.

నాన్న తోడ్పాటుతో..

తండ్రి పవన్‌తో పలక్‌ దువాన్‌

చిత్రంలో తండ్రితోపాటు ఉన్న క్రీడాకారిణి పేరు పలక్‌ దువాన్‌.. సొంత ఊరు దిల్లీ. బీదర్‌కు చెందిన చెన్నబసవేశ్వర అకాడమీ తరఫున ఆడుతోంది. తండ్రి తన కుమార్తెకు స్వయంగా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. రైడర్‌గా రాణిస్తోన్న దువాన్‌ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటోంది. 2017 నుంచి 2022 వరకు ఖేలో ఇండియా, దిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ పోటీల్లో రాణించింది. తెలంగాణలో జరిగిన పోటీల్లో జట్టు తరఫున రజతం అందుకుంది. నాన్న ప్రోత్సాహంతోనే పోటీల్లో పాల్గొంటున్నానని, రెండుసార్లు జాతీయ స్థాయిలో రజత పతకాలు సాధించినట్లు వివరించింది. జట్టు తరఫున మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమని తెలిపింది.

జాతీయస్థాయి పోటీల్లో..

చిత్రంలోని క్రీడాకారిణి భువన. విజయనగరంలో డిగ్రీ చదువుతోంది. తల్లిదండ్రులు కూలీలు అయినా కుమార్తెను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. పోటీలు ఎక్కడ జరిగినా జిల్లా జట్టు తరఫున పాల్గొని రాణిస్తోంది. కబడ్డీలో డిఫెండర్‌గా నైపుణ్యం చాటుతోంది. 2018 నుంచి 2021 వరకు హరియాణా, పశ్చిమ బెంగాల్‌, జైపూర్‌, తెలంగాణ, పట్నా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితరచోట్ల జరిగిన పోటీల్లో రాణించి అదుర్స్‌ అనిపిస్తోంది. జిల్లా, ఏపీ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలు సొంతం చేసుకున్నట్లు క్రీడాకారిణి తెలిపింది.

పట్టు వదలకుండా..

చిత్రంలో క్రీడారారిణి పేరు జయశ్రీ. కర్ణాటక. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తున్నారు. కబడ్డీ ఆటపై ఇష్టంతో మూడేళ్లుగా సాధన చేస్తుంది. డిఫెండర్‌గా రాణిస్తూ ప్రత్యర్థి జట్టు క్రీడాకారిణులను పట్టు వదలకుండా పట్టేయడంలో దిట్ట. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, పాండిచ్చేరి, కేరళ, ఏపీ, తెలంగాణలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. ఖేలో ఇండియా పోటీల్లో సైతం తన ప్రదర్శనతో సత్తా చాటింది. అకాడమీ ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నట్లు యువతి వెల్లడించారు.

శిక్షకుడి తోడ్పాటుతో..

చిత్రంలోని క్రీడాకారిణి పేరు శాంతాబాయి. తల్లిదండ్రులు లేరు. బీదర్‌లోని డా.బసవలింగేశ్వర పట్టకేర్‌ బాలికల అనాథశ్రమంలో ఉంటుంది. క్రీడాకారిణి ఆలనాపాలన అంతా కోచ్‌ రంగనాథ్‌ చూసుకుంటున్నారు. కబడ్డీలో నాలుగేళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. చెన్నబసవేశ్వర స్వామి అకాడమీ తోడ్పాటునిస్తోంది. కబడ్డీలో సెంటర్‌ ఆఫ్‌లో ఆడుతోంది. నేషనల్‌ పోటీల విభాగంలో పంజాబ్‌, తమిళనాడు, విజయవాడ, విశాఖపట్టణం, పశ్చిమ బెంగాల్‌, పాండిచ్చేరిలో జరిగిన పోటీల్లో మూడేళ్లుగా పాల్గొంటూ రాణిస్తుంది. కోచ్‌ తోడ్పాటుతో ఆటలో ప్రతిభ సాధించినట్లు పేర్కొంది.

ప్రత్యర్థి జట్టుకు కష్టాలే

చిత్రంలోని క్రీడాకారిణి పేరు సవిత. కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో చదువుతోంది. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తున్నారు. కబడ్డీపై ఇష్టంతో నిత్యం సాధన చేస్తోంది. రైడర్‌గా రాణిస్తోంది. మైదానంలో అడుగుపెడితే చాలు ప్రత్యర్థులకు కష్టాలు మొదలైనట్లే! మల్టిపుల్‌ పాయింట్లు సాధించడంలో దిట్ట. 2019 నుంచి 2021 వరకు జాతీయస్థాయి పోటీల్లో భాగంగా తమిళనాడు, విజయవాడ, పశ్చిమబెంగాల్‌, బెంగళూరు, తిరుపతిలో పాల్గొని రాణించింది. దిల్లీలో జరిగిన పోటీల్లో ప్రతిభ పురస్కారం సొంతం చేసుకున్నట్లు వివరించారు.

డిఫెండర్‌గా రాణిస్తూ..

చిత్రంలోని క్రీడాకారిణి పేరు రేవతి. కర్నూలు. లఫె్ట్‌ కార్నర్‌ డిఫెండర్‌గా రాణిస్తోంది. తల్లిదండ్రులది రైతు కుటుంబం. ఆటలపై మక్కువతో సాధన చేస్తూ నాలుగేళ్లుగా కబడ్డీలో రాణిస్తోంది. అండర్‌ -19 జాతీయస్థాయి పోటీల విభాగంలో హరియాణా, హైదరాబాదు, చెన్నె, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోటీల్లో రాణించి ప్రతిభ చాటింది. జాతీయస్థాయిలో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని