logo

హలధారికి దక్కని హక్కులు

ఏటా పంటలు సాగు చేస్తున్నా కొందరు కర్షకులకు పథకాలు దక్కడం లేదు. రుణాలు, బీమా, పరిహారం, మద్దతు ధర,  విత్తనాలు, యంత్రాల రాయితీ లబ్ధి పొందలేకపోతున్నారు. జిల్లాలో ఇలాంటి వారు 60-70 వేల మంది ఉన్నారు. వీరంతా చిన్న, సన్నకారు రైతులే.

Updated : 19 May 2022 06:26 IST

 వెబ్‌ల్యాండ్‌లో నమోదుకాని భూములు 
 సన్న, చిన్నకారు రైతుల అవస్థలు

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే: ఏటా పంటలు సాగు చేస్తున్నా కొందరు కర్షకులకు పథకాలు దక్కడం లేదు. రుణాలు, బీమా, పరిహారం, మద్దతు ధర,  విత్తనాలు, యంత్రాల రాయితీ లబ్ధి పొందలేకపోతున్నారు. జిల్లాలో ఇలాంటి వారు 60-70 వేల మంది ఉన్నారు. వీరంతా చిన్న, సన్నకారు రైతులే. పంటలు సాగు చేస్తున్నప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో భూ వివరాలు నమోదు కాకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.

విన్నవిస్తున్నా 
* పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఆ వివరాలు వెబ్‌ల్యాండ్‌లో 1బీ, అడంగళ్‌లో నమోదు చేసుకొన్న భూములే రెవెన్యూ దస్త్రాల్లో ఉంటాయి. ఆయా భూముల్లో సాగుచేసిన పంటలు, విస్తీర్ణం మాత్రమే పంట నమోదు(ఈ-క్రాప్‌ బుకింగ్‌)లో నిక్షిప్తం అవుతాయి. ఈ-క్రాప్‌ బుకింగ్‌లో పేర్లు ఉన్న వారే సాగు పథకాల లబ్ధి పొందడానికి వీలుంటుంది.
* ధ్రువపత్రాలు లేక భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడం, అనువంశికంగా వచ్చినా పత్రాలు లేకపోవడం,  పాసుపుస్తకాలు లేనివి, అసైన్డు, పోరంబోకు, చెరువు, గ్రామకంఠకం, దేవాదాయ, సొసైటీ తదితర భూములు సాగుచేస్తున్నవారి వివరాలు వెబ్‌ల్యాండ్‌లో లేవు. వీరికి పథకాలు దక్కడం లేదు.

పట్టించుకోని అధికార యంత్రాంగం
గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారులు నాన్‌-వెబ్‌ల్యాండ్‌ భూముల వివరాలు గుర్తించి సమస్య పరిష్కరించాలని... ఇందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూముల్లో సాగుచేస్తున్న రైతుల వివరాలు వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది సంయుక్తంగా కలిసి గుర్తించాలి. ఆ వివరాలు ఈ-పంట నమోదులో నిక్షిప్తం చేసి పథకాలు అందేలా చూడాలి. ఇప్పటి వరకు సమాచారం అందలేదని రెండు శాఖల అధికారులు చెప్పడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని