logo

జైళ్లో జతకట్టి.. ఇళ్లు కొల్లగొట్టి

కారాగారాలు దొంగల మధ్య పరిచయాలకు వేదికలుగా మారుతున్నాయి. నేరాలకు పాల్పడి అరెస్టై జైళ్లకు వెళ్లేవారు అక్కడ ఉండే వారితో పరిచయాలు పెంచుకొంటున్నారు. నేరమనస్తత్వం కలిగి ఉండటంతో త్వరగా స్నేహితులవుతున్నారు. బయటకు వెళ్లిన వారు

Updated : 19 May 2022 11:54 IST

ప్రభాకర్‌(అనంతపురం), షేక్‌ సద్దాం హుస్సేన్‌(కొత్తపల్లె), తెలుగు నాగిరెడ్డి(ఆత్మకూరు), సత్యనారాయణ(కొల్లాపూర్‌), మహబూబ్‌బాషా (బళ్లారి) వీరంతా మధ్య బళ్లారి జైళ్లో స్నేహం ఏర్పడింది. ఒకరి తర్వాత ఒకరు బెయిల్‌పై బయటకొచ్చాక మూడు రాష్ట్రాల్లోనూ నేరాలకు పాల్పడుతూ రెండ్రోజుల కిందట దొరికిపోయారు.
ఎమ్మిగనూరుకు చెందిన శ్రీకాంత్‌ డిగ్రీ వరకు చదివి జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన ఆకుల వీరేశ్‌ చిల్లరగా తిరుగుతూ తల్లిని చంపిన కేసులో జైలుకు వెళ్లిన సందర్భంలో శ్రీకాంత్‌ పరిచయమయ్యాడు. ఇద్దరి స్నేహం ఏర్పడింది. బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు చోరీలకు పాల్పడ్డారు. కోడుమూరు, కర్నూలులో భారీ చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కారు. 

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కారాగారాలు దొంగల మధ్య పరిచయాలకు వేదికలుగా మారుతున్నాయి. నేరాలకు పాల్పడి అరెస్టై జైళ్లకు వెళ్లేవారు అక్కడ ఉండే వారితో పరిచయాలు పెంచుకొంటున్నారు. నేరమనస్తత్వం కలిగి ఉండటంతో త్వరగా స్నేహితులవుతున్నారు. బయటకు వెళ్లిన వారు లోపలుండే దొంగకు బెయిల్‌ ఇప్పించే ఏర్పాటు చేసి సహకరించటంతో ఇరువురి మధ్య బంధం బలపడుతోంది. పరివర్తన చెందాల్సిన చోటే ముఠాలుగా ఏర్పడి బయటకు వచ్చి కలిసి దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొత్తకొత్త ముఠాలు దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతుండటం పోలీసులకు సవాలుగా మారుతోంది. 
మహిళలు సైతం
*మహిళా దొంగలూ జైళ్లలో కలిసి ముఠాలుగా ఏర్పడుతుండటం గమనార్హం. నెల్లూరుకు చెందిన కిరణ్‌కుమార్, అదే జిల్లా కావలికి చెందిన నారాయణమ్మ పరిచయం కాగా, ఇద్దరు కలిసి రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాలో నేరాలకు పాల్పడ్డారు. జిల్లాలో ఎనిమిది దొంగతనాలకు పాల్పడటంతో వీరి వ్యవహారం బయటపడింది. 
* స్టువర్టుపురం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మహిళా దొంగలు నంద్యాలకు చెందినవారికి స్నేహితులై పెద్ద ముఠాగానే ఏర్పడ్డారు. 
పక్క రాష్ట్రాల్లో దోచేస్తున్నారు
జిల్లా దొంగలు పొరుగు జిల్లా, రాష్ట్రాల దొంగలతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో వీరి కార్యకలాపాలు పొరుగురాష్ట్రాలకూ విస్తరిస్తున్నాయి. హత్య, దాడి, ఇతరత్రా నేరాలకు పాల్పడి జైళ్లో ఉండే ఖైదీలకూ అక్కడుండే దొంగలతో స్నేహం ఏర్పడి వారూ దొంగలుగా మారుతున్నారు. ఇటీవల అరెస్టయిన శివకు జైల్లో ఉన్న ప్రవీణ్‌కుమార్‌ పరిచయమైంది. బయటకు వచ్చిన ద్విచక్రవాహనం దొంగతనానికి పాల్పడి దొరికిపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని