logo

వేతనం అందక.. 108 ఉద్యోగుల వేదన

ఆలూరు నియోజకవర్గ పరిధిలో 108లో పని చేసి ఉద్యోగి వేతనాలు అందక ఇంటి నిర్వహణకు రూ.10 వేల వరకు అప్పు చేశారు. పత్తికొండ పరిధిలో పని చేసే ఓ ఉద్యోగిది ఇదే పరిస్థితి. వీరిద్దరే కాదూ ఉమ్మడి జిల్లాలో 108లో పని చేస్తున్న అందరి పరిస్థితి ఇదే.

Updated : 19 May 2022 06:25 IST

ఆదోని పురపాలిక, న్యూస్‌టుడే: ఆలూరు నియోజకవర్గ పరిధిలో 108లో పని చేసి ఉద్యోగి వేతనాలు అందక ఇంటి నిర్వహణకు రూ.10 వేల వరకు అప్పు చేశారు. పత్తికొండ పరిధిలో పని చేసే ఓ ఉద్యోగిది ఇదే పరిస్థితి. వీరిద్దరే కాదూ ఉమ్మడి జిల్లాలో 108లో పని చేస్తున్న అందరి పరిస్థితి ఇదే. మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా గ్రామీణులకు వైద్య సేవలందిస్తున్న 104 సిబ్బందికీ సక్రమంగా వేతనాలు అందడం లేదు. 

108 వాహనాలు 57
ఉమ్మడి జిల్లాలో 108 వాహనాలు 57 వరకు ఉన్నాయి. 143 పైలట్లు, 143 మంది ఈఎంటీలున్నారు. పైలట్‌కు నెలకు రూ.18-28 వేలు, ఈఎంటీలకు రూ.20-30 వేలు దాకా అనుభవం ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారు. ఒక్కో వాహనం నిత్యం నాలుగైదు కేసులు చూస్తోంది. రహదారి ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు, ప్రసవాలు, ఇతరత్రా ప్రమాదాల బారిన పడిన వారికి సేవలు అందిస్తున్నారు. ఫోన్‌ చేసిన వెంటనే నిమిషాల్లో ప్రమాద స్థలికి చేరుకొంటున్నారు. ఇంతలా సేవలందిస్తున్న వీరు వేతనాల కోసం మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు.

ఏ నెలలోనూ సక్రమంగా అందవు
ఉమ్మడి జిల్లాలో 104 వాహనాలు 53 వరకు ఉన్నాయి. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 58, డ్రైవర్లు 58, వైద్యులు 58 మంది వరకు ఉన్నారు. డ్రైవర్లకు రూ.16 వేలు, ఐదేళ్లు పైబడిన వారికి రూ.21 వేలు, పదేళ్లు దాటిన వారికి రూ.26 వేల వేతనం  ఇస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు అంతా కొత్తవారే కావడంతో రూ.15 వేలు, వైద్యులకు అర్బన్‌ ప్రాంతాలైతే రూ.45 వేలు, గ్రామీణ ప్రాంతాలైతే రూ.60 వేలు వరకు చెల్లిస్తున్నారు. వీరికి ఏ నెలలోనూ సక్రమంగా వేతనాలు అందడం లేదు.
త్వరలో జమ చేస్తాం : చంద్రమౌళి, 108 జిల్లా మేనేజరు 
108 ఉద్యోగులకు ఒక్క రోజులో వేతనాలు జమ అవుతాయి. ఇప్పటికే బ్యాంకులో చెక్కు అయింది. ఆర్థిక ఏడాది ముగింపు కారణంగా కొంత ఆలస్యమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని