logo

ఆదాయ ఎత్తుగడలు

 ఆదాయ అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. భవన నిర్మాణ విలువలు పెంచేందుకు జిల్లా స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకొనేందుకు భూములు, స్థలాల విలువలేకాక భవనాల విలువలు పెంచాలని

Published : 24 May 2022 04:15 IST

జూన్‌ 1 నుంచి భవనాల విలువ పెంపు

పూరి గుడిసెకూ చెల్లించాల్సిందే

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, న్యూస్‌టుడే: ఆదాయ అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. భవన నిర్మాణ విలువలు పెంచేందుకు జిల్లా స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకొనేందుకు భూములు, స్థలాల విలువలేకాక భవనాల విలువలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి అమలు చేయాలని ఆ శాఖ ఐజీ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు మొదట జేసీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో సమావేశమైన అనంతరం కొత్త భవన విలువలు అమలు చేస్తారు.

మూడో అంతస్తు నుంచి

గతంలో నగరపాలకసంస్థ, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో సాధారణ భవనాల విలువ చదరపు అడుగు రూ.1,140 ఉండగా ప్రస్తుతం రూ.1,200 పెరగనుంది. గతంలో భవనం ఎన్ని అంతస్తులున్నా ఒకే విలువ ఉండేది. ఇప్పుడు మూడో అంతస్తు నుంచి విలువ మరింత పెరగనుంది. సెల్లారు, పార్కింగ్‌ ప్రదేశాలు, అపార్ట్‌మెంట్‌, సినిమా హాళ్లు, వాణిజ్య భవనాలు, చావిడి మిద్దెలు, పూరి గుడిసెలు తదితర అన్ని విలువలు పెరగనున్నాయి.

పల్లె మొదలు పట్టణం వరకు

2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఉమ్మడి జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు రూ.524.06 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా రూ.468.83 (90 శాతం) కోట్లు ఆర్జించాయి.

తాజాగా పల్లె నుంచి నగరం వరకు అన్ని ప్రాంతాల్లో భవనాల విలువ పెంచేందుకు రంగం సిద్ధమైంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్న కర్నూలు జిల్లాకు రూ.406.46 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.202.01 కోట్లు ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది.

మొదట ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి భూముల, స్థలాలు, భవనాల విలువలు పెంచాలని ప్రభుత్వం భావించింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. కేవలం కొత్త జిల్లా కేంద్రాల్లో మాత్రమే స్థిరాస్తుల విలువ పెంచిన సంగతి విదితమే.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని