ఆర్‌యూలో డాక్టరేటు

రాయలసీయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు తుంగలో తొక్కి పీహెచ్‌డీలు ప్రదానం చేశారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే బోధన సిబ్బంది రీసెర్చి సూపర్‌వైజర్లుగా పనిచేసి పీహెచ్‌డీలకు ఆమోద ముద్ర వేస్తున్నారు.

Published : 04 Jun 2022 02:52 IST

ఈనాడు - కర్నూలు :  రాయలసీయ విశ్వవిద్యాలయంలో నిబంధనలు తుంగలో తొక్కి పీహెచ్‌డీలు ప్రదానం చేశారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే బోధన సిబ్బంది రీసెర్చి సూపర్‌వైజర్లుగా పనిచేసి పీహెచ్‌డీలకు ఆమోద ముద్ర వేస్తున్నారు. నాణ్యమైన పరిశోధనలు గాలికొదిలేసి నాసిరకమైన పరిశోధనలకు పీహెచ్‌డీలు ప్రదానం చేయడంపై గమనార్హం.

ఇటీవల 267 మందికి ప్రదానం

రాయలసీమ విశ్వవిద్యాలయం (ఆర్‌యూ) 2008లో ఏర్పడింది. ఎక్స్‌ట్రా మ్యూరల్‌ పార్ట్‌టైం పీహెచ్‌డీల ప్రవేశానికి 2009లో అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వందల సంఖ్యలో పీహెచ్‌డీలు ప్రదానం చేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి వెళ్లకుండా.. పరిశోధనల అవసరం లేకుండా ఫీజు చెల్లించి.. ఆపై అడిగినంత ముట్టజెబితే చాలు.. డాక్టరేట్‌ ఇచ్చేస్తున్నారు. ఒకే అంశంపై( సబ్జెక్టు) 60కిపైగా పీహెచ్‌డీలు.. ఒక నెలలో అత్యధికంగా 22-30 ఇచ్చిన ఘనత ఆర్‌యూకు దక్కుతుంది. ఎంతలా అంటే పరిశోధనను మూడేళ్ల నుంచి అత్యధికంగా ఆరేళ్లు చేయాల్సి ఉంటుంది. ఆర్‌యూలో ఏడాదికే పీహెచ్‌డీ ప్రదానం చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో లేని డిపార్ట్‌మెంట్లకూ ఇవ్వడం గమనార్హం. ఎస్వీ యూనివర్సిటీలో ఏడాదికి 60 పీహెచ్‌డీలు ఇస్తుంటే కర్నూలు ఆర్‌యూలో నాలుగేళ్లల్లో 400పైగా ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 267 మందికి పీహెచ్‌డీలు అందించారు.

తాత్కాలిక సిబ్బందే ఆమోదం

విశ్వవిద్యాలయంలో తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న బోధన సిబ్బంది రీసెర్చి సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ పీహెచ్‌డీలు అవార్డు చేసినట్లు ఆర్‌యూ ప్రొఫైల్‌లోనే పెట్టుకోవడం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. 2006 యూజీసీ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ టీచింగ్‌ స్టాఫ్‌ గైడ్‌షిప్‌ చేయాలని ఉంది. ఆర్‌యూలో తాత్కాలిక బోధన సిబ్బంది పీహెచ్‌డీలకు ఆమోద ముద్ర వేశారు.  

ముగ్గురిదే కీలక పాత్ర

 పీహెచ్‌డీలకు సంబంధించి డబ్బుల వసూళ్లలో ముగ్గురు కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సెనాప్సిస్‌ (అభ్యర్థి రెండు పుస్తకాలు, ముగ్గురు ప్రొఫెసర్ల) బోర్డు సమావేశం జరుగుతుంది. ఇది ప్లాగరిజంతోపాటు టీసెస్‌ (పరిశోధన గ్రంథం) సమర్పించాలి. అనంతరం వైవాకు పిలుస్తారు. ప్లాగరిజంలో కాపీయింగ్‌ ఏమైనా జరిగితే గుర్తిస్తారు. సాఫ్ట్‌వేర్‌ లేక రీసెర్చి స్కాలర్‌తోనే బయట నుంచి ప్లాగరిజం నివేదికలు తెప్పిస్తున్నారు.  

కనిపించని గోప్యత

పరిశోధన గ్రంథం సమర్పించాక ముగ్గురు నిపుణులైన అధ్యాపకులతో మూల్యాంకనం చేసి సంబంధిత నివేదికను విశ్వవిద్యాలయానికి గోప్యంగా పంపుతారు. రీసెర్చి విభాగంలో గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని కాసుల కక్కుర్తితో ఆ ముగ్గురు స్కాలర్‌కు చెప్పేస్తున్నారు. బయట పైరవీలు చేసి వెంటనే ఆర్‌యూకు నివేదిక వచ్చేలా స్కాలర్స్‌ చేస్తున్నారు. ఆరు నెలలకు అందాల్సిన నివేదికలు వారంలో వచ్చేస్తున్నాయనడానికి తార్కాణాలున్నాయి. 2017 జనవరి నుంచి ఆగస్టు వరకు ఏకంగా 67 పట్టాలివ్వడం గమనార్హం. 

గవర్నర్‌కు ఫిర్యాదు

ఇబ్బడిముబ్బడిగా ఇచ్చిన పీహెచ్‌డీలపై ‘ఈనాడు’లో గతంలో వచ్చిన కథనాలకు సీఎంవో స్పందించారు. విచారణ కమిటీ వేసి నివేదికలు పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 2017 నవంబరు 29న ఆదేశాలు జారీ చేశారు. వాటిని తుంగలో తొక్కారు. 2018 మార్చి 28న పీహెచ్‌డీల ప్రదానంపై కమిటీ వేసి నిజాలు తేల్చాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశించినా అడుగులు పడలేదు. ఇప్పటికైనా గవర్నర్‌ కార్యాలయం దీనిపై దృష్టి సారించి ఆరా తీయడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆర్‌యూలో జరుగుతున్న డాక్టరేట్ల దందాపై ఇప్పటికే విద్యార్థి సంఘాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని