logo

లక్ష్యం ఐదు బంగారు పతకాలిచ్చింది

‘‘తరగతి గదిలో నేర్చుకున్నది ఒక్క శాతమే. హౌస్‌సర్జన్‌గా మిగిలిన 99 శాతం నేర్చుకున్నా. ఇష్టంగా చదవడం ప్రారంభించాక ఎక్కడా వైద్య విద్య కష్టం అనిపించలేదు. అభిరుచితో చదవడంతోనే ఐదు బంగారు పతకాలు సాధించా. ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయ టాపర్‌గా నిలిచాను’’ అంటున్నారు డాక్టర్‌ జ్యోత్స్న.

Published : 26 Jun 2022 01:11 IST

బంగారు పతకాలతో జ్యోత్స్న

‘‘తరగతి గదిలో నేర్చుకున్నది ఒక్క శాతమే. హౌస్‌సర్జన్‌గా మిగిలిన 99 శాతం నేర్చుకున్నా. ఇష్టంగా చదవడం ప్రారంభించాక ఎక్కడా వైద్య విద్య కష్టం అనిపించలేదు. అభిరుచితో చదవడంతోనే ఐదు బంగారు పతకాలు సాధించా. ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయ టాపర్‌గా నిలిచాను’’ అంటున్నారు డాక్టర్‌ జ్యోత్స్న. కర్నూలు వైద్య విద్యాలయం-2016 బ్యాచ్‌కు చెందిన ఆమె వైద్య విద్య పూర్తి చేసి ఇటీవల పట్టభద్రురాలవ్వడంతోపాటు ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె ‘ఈనాడు’తో మాట్లాడుతూ విజయపథాన్ని వివరించారు. తరగతి గదిలో చెప్పిన అంశాలు ఇంటి వద్ద ఏ రోజుకారోజు అధ్యయనం చేస్తే గమ్యం చేరడం చాలా సులువని ఆమె యువతకు సూచించారు.

ఇంటర్మీడియట్‌ ఎంతో ముఖ్యమైంది

నాకే కాదు ఇంటర్మీడియట్‌ అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైంది. ఇంటర్‌లో బైపీసీ తీసుకుని ప్రథమ సంవత్సరంలో వసతిగృహంలో ఉన్నా. ఇంటిపై బెంగతో చాలా ఇబ్బంది పడ్డా. చదువుపై మొదటి సంవత్సరం అంతగా దృష్టి సారించలేదు. ఆ సమయంలో నాన్న భరోసా ఇచ్చి ధైర్యం నింపారు. లక్ష్యం గుర్తుకొచ్చింది. మంచి మార్కులు సాధించా. కర్నూలు వైద్య కళాశాలలో సీటు సంపాదించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లా. కష్టపడి చదివి మెడిసిన్‌లో 459 ర్యాంకు సాధించా... అనుకున్నట్లే కర్నూలు వైద్య కళాశాలలో సీటు వచ్చింది.

మొదటి పతకం.. నమ్మకం పెంచింది

పదో తరగతిలో ఉన్నప్పుడు నేనే బాగా చదువుతా అనుకునేదాణ్ని. వైద్య విద్యలో నాకంటే బాగా చదివేవాళ్లు చాలామంది ఉంటారు. గట్టి పోటీ ఉంటుంది. మొదటి సంవత్సరం అనాటమీ పరీక్షల ముందు కొంత ఒత్తిడికి లోనయ్యా. ఆ సమయంలో ప్రొఫెసర్‌ ప్రోత్సహించడంతో మొదటిస్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నా. ఆ పతకమే నాలో నమ్మకం పెంచింది. ఆ స్ఫూర్తితో మొదటి సంవత్సరంలో అనాటమీ, ద్వితీయ సంవత్సరంలో పెథాలజీ, మైక్రోబయాలజీ, తృతీయ సంవత్సరం ఆప్తల్‌మాలజీ, చివరి సంవత్సరంలో పిడియాట్రిక్‌లో మొత్తం ఐదు బంగారు పతకాలు సాధించా.

మా తాత కల

నాన్న శ్రీనివాసులు రైతు, అమ్మ కామాక్షి గృహిణి. మాది నెల్లూరు. వెంకటరత్నంనాయుడు మా తాత . ఆయన ఓసారి చెన్నై ఆసుపత్రుల్లో వైద్యులను చూశాక మా కుటుంబంలో ఒక్కరైనా వైద్యులు అవ్వాలన్నది ఆకాంక్షించారు. అదే విషయం నాతో చెబుతూ ఉండేవారు. అలా నాకు చిన్నప్పటి నుంచి వైద్యవృత్తిపై ఆసక్తి పెరిగింది. నా స్నేహితులు ఐదుగురు ఉండేవాళ్లం. ఎప్పుడు కలిసినా బాగా చదువుకోవాలనుకునేవాళ్లం. మంచి ఆసుపత్రి నిర్మించాలనుకునేవాళ్లం. పిడియాట్రిక్‌, జనరల్‌ మెడిసిన్‌ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని పూర్తిస్థాయిలో నైపుణ్యం సాధించాలని అనుకుంటున్నా. ఇందుకు అమెరికా వెళ్లి ఎంత నేర్చుకునే అవకాశం ఉంటుందో అంత నేర్చుకోవాలన్నది నా లక్ష్యం.

ఏ రోజు అంశం.. ఆ రోజే పూర్తి

వైద్య విద్య పూర్తి చేయడంలో తొలి సంవత్సరం నుంచి ప్రణాళికంటూ ఏమీ పెట్టుకోలేదు. నిత్యం చదివేదాణ్ని. ఏ రోజు సబ్జెక్టు ఆరోజే పూర్తి చేశా. తరగతి గదిలో చెప్పిన పాఠాలను అక్కడే ఎక్కు  నేర్చుకొనేందుకు ప్రయత్నించా. వైద్యవిద్య కష్టమైనప్పటికీ ఇష్టంగా చదవడం ప్రారంభించాక చాలా బాగా అనిపించింది. చదువు పూర్తయ్యాక స్నేహితులతో కలిసి చిరుతిళ్లు తినేందుకు వెళ్లడానికి ఆసక్తి చూపా. వచ్చిన ప్రతి సినిమా చూశా.

శిశువులకు ప్రాణం పోయడం మరిచిపోలేను

తరగతి గదిలో చదివి నేర్చుకొంది ఒక శాతం అయితే హౌస్‌సర్జన్‌గా 99 శాతం నేర్చుకున్నాను. కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్నప్పుడు సేవలందించాం. పీపీ కిట్లు వేసుకుని వేసవిలో చాలా కష్టపడ్డాం. దాని తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ మ్యూకర్‌ కేసులు వచ్చినప్పుడు వార్డు మొత్తం నేను ఒక్కదాన్ని ఉండి పని చేశా. ఇంజెక్షన్లు ఇవ్వడం, నిత్యం పరిశీలన చేయడం, సర్జరీలు చేయడం వంటి సేవలు చేశా. గైనిక్‌ విభాగంలో డెలివరీ రూంలో పనిచేయడం మంచి సంతృప్తినిచ్చింది. చనిపోయే స్థితిలో ఉన్న గర్భిణులకు రక్తం ఎక్కించడం అత్యవసర సేవ చేసినట్లు అనిపించేది. నేను సొంతంగా పదిమందికి సిజేరియన్లు చేశా. శిశువులకు ప్రాణం పోయడం వర్ణించే అనుభూతి కాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని