logo
Published : 28 Jun 2022 02:24 IST

ఊరు వీడారని.. అమ్మఒడిని దూరం చేశారు

హాజరు శాతం తక్కువగా ఉందని వలస కూలీల పిల్లల అనర్హత జాబితా

ఆదోని విద్య, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకం వలస కూలీలకు శాపంగా మారింది. కొత్తగా నిబంధనల మేరకు పాఠశాలలు జరిగిన పనిదినాల్లో 75 శాతం హాజరు తప్పనిసరి చేశారు. దీంతో  పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్లోని చాలా గ్రామాల్లోని వలస కూలీల పిల్లలకు అమ్మఒడి పథకం దూరమైంది.

పొట్టకూటికి వలస బాట

ఆదోని డివిజన్‌ పరిధిలోని ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో వలసలు ఎక్కువ. స్థానికంగా ఉపాధిలేక చాలా మంది పొట్టకూటికి బెంగళూరు, హైదరాబాదు, గుంటూరు, ముంబయి వంటి నగరాలకు వలస వెళ్తుంటారు. ఆ సమయంలో చాలా మంది తమ పిల్లలనై బడికి పంపించకుండా వారి వెంటే తీసుకెళ్తుంటారు. అక్కడే రెండు మూడు నెలల పాటు పనులు చేసుకొని స్వగ్రామానికి వస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోవడంతో పాఠశాలల్లో హాజరు శాతం తగ్గిపోతుంది.

శాపంగా 75 శాతం హాజరు

* అమ్మఒడి పథకానికి పాఠశాలల పనిదినాల్లో విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని కొత్త నిబంధనలు పెట్టడంతో వలస కూలీలకు శాపంగా మారింది. వలసలు అధికంగా వెళ్లే గ్రామాలను పరిశీలిస్తే.. ఒక్కో గ్రామంలో 10 నుంచి 20 మంది విద్యార్థులకు హాజరు శాతం లేక అమ్మఒడి పథకం అందలేదు.

* ఆదోని మండలం కె.నాగలాపురంలో అత్యధిక మంది గుంటూరు, బెంగళూరు వంటి నగరాలకు వలసలు వెళ్తుంటారు. కొందరు వారి పిల్లలను వెంట తీసుకెళ్తుంటారు.. మరికొందరు బంధువుల ఇళ్లకు పంపిస్తుంటారు. ఈ గ్రామంలో ఈ ఏడాది అమ్మఒడి 231 మందికి పథకం వర్తించగా.. 47 మందికి వివిధ కారణాలతో రాలేదు. ఇందులో దాదాపు 10 నుంచి 15 మంది వరకు విద్యార్థుల హాజరు శాతం లేక అందలేదు.

* ఆదోని మండలం కె.నాగలాపురంలో అత్యధిక మంది గుంటూరు, బెంగళూరు వంటి నగరాలకు వలసలు వెళ్తుంటారు. కొందరు వారి పిల్లలను వెంట తీసుకెళ్తుంటారు.. మరికొందరు బంధువుల ఇళ్లకు పంపిస్తుంటారు. ఈ గ్రామంలో ఈ ఏడాది అమ్మఒడి 231 మందికి పథకం వర్తించగా.. 47 మందికి వివిధ కారణాలతో రాలేదు. ఇందులో దాదాపు 10 నుంచి 15 మంది వరకు విద్యార్థుల హాజరు శాతం లేక అందలేదు.


ఎమ్మిగనూరు మండలం కడివెళ్లకు చెందిన శాంతమ్మ, రంగస్వామి దంపతులకు శ్రీలక్ష్మి, ప్రశాంతి, లోకేశ్‌ ముగ్గురు పిల్లలు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలుగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పొలం లేక.. గ్రామంలో పనులు లేకపోవడంతో పిల్లలతో కలిసి గుంటూరుకు వలస వెళ్లారు. అక్కడే మూడు నెలల పాటు ఉండటంతో పాఠశాలలో పిల్లల హాజరు శాతం తగ్గిపోయింది. దీంతో ఈ ఏడాది ప్రభుత్వం పంపిణీ చేసిన అమ్మఒడి పథకం వర్తించదని అధికారులు చెప్పారు. కూటి కోసం వలస వెళ్తే అమ్మఒడి పథకం ఇవ్వకపోవడం బాధాకరమని విద్యార్థిని తల్లి శాంతమ్మ పేర్కొంటున్నారు.


చిత్రంలోని తల్లీకుమార్తె కొలిమి మహాదేవి, శైలజలది ఆదోని మండలం నాగలాపురం. శైలజ ఆదోని మండలం పెద్దతుంబళంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. మహాదేవి, యల్లప్ప దంపతులకు ఒక్క సెంటు భూమి లేదు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పనులు లేనిసమయంలో తిరుపతికి తాపీ పనులకు వలస వెళ్లారు. ఈ క్రమంలో శైలజను పెద్దకడబూరు మండలంలోని ముచ్చుమర్రిలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి పంపారు. ఆ సమయంలో విద్యార్థిని పాఠశాలకు సరిగా హాజరు కాలేదు. హాజరు శాతం తక్కువగా ఉందని ఈ ఏడాది అమ్మఒడి పథకం వర్తించదని అధికారులు అనర్హత వేటు వేశారు. ‘‘ పొట్టకూటికి వలస వెళ్తే హాజరు శాతం పేరిట అమ్మఒడి పథకం రద్దు చేయడం బాధకరమని’’ మహాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.


 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts