logo

నేతల రాత... అర్హులకు వాత

సిఫార్సు లేఖలతో ఉపాధ్యాయుల బదిలీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్‌ వరకు ఆగితే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.. అప్పటి వరకు ఆగితే కోరుకున్న చోటుకు వెళ్లలేమని కొందరు

Published : 28 Jun 2022 02:24 IST

సిఫార్సులతో ఉపాధ్యాయుల బదిలీలు

కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు

ఈనాడు- కర్నూలు, కర్నూలు విద్య- న్యూస్‌టుడే: సిఫార్సు లేఖలతో ఉపాధ్యాయుల బదిలీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్‌ వరకు ఆగితే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.. అప్పటి వరకు ఆగితే కోరుకున్న చోటుకు వెళ్లలేమని కొందరు ఉపాధ్యాయులు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 207 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సీఎంవో తాజాగా ఆమోదం తెలిపింది. అందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వారు పది మంది వరకు ఉన్నారు. వీరంతా నేతల అనుగ్రహంతో కోరుకున్నచోటుకు బదిలీ చేయించుకోవడం గమనార్హం. కౌన్సెలింగ్‌తో కాకుండా సిఫార్సు లేఖలతో బదిలీలతో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

ప్రక్రియ ఎప్పుడో

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పని చేసే ఉపాధ్యాయులు 14,035 మంది వరకు ఉంటారు. ఎయిడెడ్‌లో 636 మంది విధులు నిర్వహిస్తున్నారు. 2020లో కౌన్సెలింగ్‌ సమయంలో సుమారు తొమ్మిదివేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నాలుగు వేల మందిని అర్హులుగా గుర్తించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరులో ముగియనుంది. ఆ వెంటనే ఉపాధ్యాయుల బదిలీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. జీరో సర్వీసు లేదా ఎనిమిదేళ్ల సర్వీసు ఈ రెండింటిలో ఏదో ఒక అవకాశం ఇవ్వొచ్చు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి అవకాశం ఇస్తే 40-50 శాతం మంది అర్హులుగా ఉంటారు.

అర్హులకు అన్యాయం

ఒకేచోట ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు త్వరలో కౌన్సెలింగ్‌ విధానంలో జరిగే బదిలీ ప్రక్రియలో తప్పని సరిగా కదలాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే దగ్గర ప్రాంతాలకు వెళ్లొచ్చని వీరంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘‘ కొందరు సిఫార్సు లేఖలతో బదిలీ చేయించుకోవడంతో తాము ఎక్కడో సుదూరాన ఉండే పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది.. తీవ్ర అన్యాయం జరిగినట్టేనని’’ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం జరిగిన బదిలీల్లో ప్రస్తుతం పని చేస్తున్న, కోరుకున్న ప్రాంతం, సిఫార్సు చేసిన ప్రజాప్రతినిధుల పేర్లతో సహా వెల్లడించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు భారీగా ఖర్చు పెట్టి నేతల సిఫార్సు లేఖలు పొందినట్లు సమాచారం.

ఎక్కడికి ఎవరు

* మద్దికెర మండలం మదనంతపురం నుంచి కల్లూరుకు, హోళగుంద మండలం నుంచి గడివేములకు వచ్చేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని సిఫార్సు లేఖలు తీసుకున్నట్లు సమాచారం.

* ఆదోని మండలం పెద్దహరివాణం నుంచి పాణ్యం పరిధిలో బలపనూరు, ప్రకాశం జిల్లా కంభం పరిధిలోని తురిమిళ్ల నుంచి కర్నూలు నగరంలో కింగ్‌మార్కెట్‌ గర్ల్స్‌ హైస్కూలుకు వస్తామని ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ సిఫార్సు లేఖలు పొందారు.

* కోసిగి నుంచి వెలుగోడుకు, కొలిమిగుండ్ల నుంచి నంద్యాల పట్టణానికి సమీప ప్రాంతానికి, ఉయ్యాలవాడ నుంచి పొద్దుటూరుకు బదిలీ కావాలంటూ ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్‌( ప్రకాశం జిల్లా దర్శి), శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి (నంద్యాల) , రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (పొద్దుటూరు)ల సిఫార్సు తీసుకున్నారు.

* అనంతపురం జిల్లా గంగవరం నుంచి కర్నూలు నగర సమీపంలోని గార్గేయపురానికి ఓ ఉపాధ్యాయుడు మంత్రి ఉషశ్రీ చరణ్‌, ఉయ్యాలవాడ ఆదర్శ పాఠశాల నుంచి తిరుపతి లేదా శ్రీకాళహస్తి ఆదర్శ పాఠశాలకు వెళ్తానని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి లేఖ జత చేశారు.

* అనంతపురం జిల్లా రాయదుర్గం ఆదర్శ పాఠశాల నుంచి మద్దికెర ఆదర్శ పాఠశాలకు వచ్చేందుకు అసిస్టెంట్‌ సీఎంవోతోపాటు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సిఫార్సులేఖ పెట్టారు.


సిఫార్సుల విధానం రద్దు చేయాలి

- కాకి ప్రకాశరావు, ఫ్యాప్టో రాష్ట్ర కో-ఛైర్మన్‌

సిఫార్సు లేఖలతో జరుగుతున్న బదిలీల వల్ల అర్హులైన ఉపాధ్యాయులు నష్టపోతారు. ఈ విధానానికి మేము పూర్తిగా వ్యతిరేకం. కౌన్సెలింగ్‌ విధానం పక్కా అమలు చేసి.. సిఫార్సుల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.


ఉత్తర్వులు సవరించాలి

- హెచ్‌.తిమ్మన్న, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి

ఏశాఖలో లేనివిధంగా పదేళ్లుగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కౌన్సెలింగ్‌ విధానంలో జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం సిఫార్సుల బదిలీలకు శ్రీకారం చుట్టడం బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా జరుగుతున్న బదిలీలు వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం విడుదల చేసిన 117 ఉత్తర్వులు తక్షణం సవరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని